29/08/2013

మన తెలుగు


|| మన తెలుగు ||

నన్నయ నేర్పిన నవనీతాక్షారాల భాష తెలుగు
భారతాన్ని భావాత్మకంగా అందించింది తెలుగు

శ్రీనాధుని సీసపద్యాలతో సింగారించింది తెలుగు
శృంగార నైషధంలో రసరమ్యభావాలను అందించింది తెలుగు

పోతన పద్యాలలో పరిమళించింది తెలుగు
భాగవతంలోని కృష్ణలీలకి మురిసింది తెలుగు

కృష్ణదేవరాయని భువనవిజయంలో భాసించింది తెలుగు
ఆముక్తమాల్యదలో మౌక్తికమై మెరిసింది తెలుగు

అల్లసాని అల్లిక జిగిబిగికి వెండితీవెలందించింది తెలుగు
హిమగిరుల అందాలకు రంగులలదినది తెలుగు.

తిమ్మన పలుకులలో పారిజాతాలు కుమ్మరించింది తెలుగు
సత్యభామ అలుకలో కొత్త అందాలు చూపింది తెలుగు

రామకృష్ణుని వికటకవిత్వంలో హాస్యమైనది తెలుగు
పాండురంగని భక్తికి పరశించింది తెలుగు

ధూర్జటి చాటువులలో చరితార్ధమైనది తెలుగు
కన్నప్ప మూఢభక్తికి ముగ్ధమైనది తెలుగు

విశ్వనాథుని వేయిపడగల మణిమయమైనది తెలుగు
కిన్నెరసానిలో వడివడిగా పరుగులు తీసింది తెలుగు.
కల్పవృక్షములో కమనీయమైనది తెలుగు

కృష్ణశాస్త్రి భావగీతమైనది తెలుగు
నారాయణుని విశ్వంభరమైనది తెలుగు

అజంతము మన తెలుగు.
అనంతము మన తెలుగు
అక్షయము మనతెలుగు.
విశ్వ భాషలలో...అద్భుతమైనది మనతెలుగు
అన్ని భాషలలో అమరమైనది మన తెలుగు ...@శ్రీ 29/08/13

అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాభినందనలు...

17/08/2013

|| లేవు ||

బైట సూర్యోదయంతో బాటు
ఇంట్లో చంద్రోదయాలు లేవు 

తొలకరిజల్లులా కురుల చివరల
నీటి తుంపర్ల అభిషేకాలు లేవు
కనురెప్పలపై తీయని స్పర్శలు లేవు
కాఫీకప్పుపై గాజుల (ద్రవ)తరంగిణులు లేవు

పూజగది నుండి అగరుపొగలు లేవు
హారతికర్పూరపు సుగంధాలు లేవు
వంటగదిలో కమ్మటి వాసనలు లేవు
తాలింపుల ఘుమఘుమలు లేవు

ఆఫీసుకెళ్ళేముందు తాయిలాలు లేవు
ఇంటికొస్తే ఎదురుచూపులు లేవు
మువ్వల సవ్వడులు లేవు
అందెలరవళులు లేవు.
జాజుల జావళీలు లేవు
మల్లెమాలల పరిమళాలు లేవు.

ఆషాఢమాసం వెళ్ళినా
నీవొచ్చే దాఖలాలు లేవు.
శ్రావణమొచ్చినా
నావిరహం తీరే దారులు లేవు. ...శ్రీ 

14/08/2013

తొలకరి విరిఝరి.

చినుకు శరాలెలా గుప్పిస్తున్నాడో ఆ ఇంద్రుడు
మేఘాల విల్లుతో.
చినుకుబాణాలు ఎలా వదులుతున్నాడో
మెరుపు నారి సారిస్తూ.
చినుకుల శరసంధానం చేసే ఇంద్రుని ధనుష్టంకారం
ఉరుమై తరుముతుంటే,
నీటియజ్ఞం మొదలెట్టింది ధరణి వరుణుని జలయంత్రాల సాయంతో.

మేఘం ...చినుకుపూలతో పలకరించి పోతూ ఉంటుంది
వేడెక్కిన గిరులకి ఆ'విరులిస్తూ'.
చినుకులనెలా చిమ్ముతోందో వానమేఘం
వసుంధర అందాలను బహిర్గతం చేస్తూ.
చినుకులు నేల చేరేందుకు
దారి చూపే కాంతిమార్గమనిపిస్తోంది ఆ విద్యుల్లత.

ఆకాశం ఆరేసిన ఏడువారాల కోకలనెలా తడిపేస్తోందో
ఆ తుంటరి మేఘం.
మేఘుని నీటితుపాకి కాల్పుల అభ్యాసం
తొలకరిలోనే.
మేఘుని జల(అ)నియంత్రణలు
పుడమి కట్టిన పచ్చనిచీరను తడుపుతూ.

తొలకరి అలవోకగా అల్లేస్తూ ఉంటుంది
నీటితివాచీలను...చినుకు దారాలతో.
చిందేస్తూ చినుకుల చిన్నది
మేఘ తాళాలకి ధీటుగా.

ఎక్కడ నేర్చిందో ఆ కొండ
చినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య.
చినుకు పలకరిస్తే చాలు
సిగ్గుతో పరుగందుకుంటుంది సెలయేరు.
వానకారులో ధరణి కోసం తెల్లకోకలంపుతూనే
ఉంటాడు ఆ పర్వతుడు. ....                                @శ్రీ

07/08/2013

అలుకకీ అలుకే
నీ అలుకకి కూడా అలుకట
నిన్ను త్వరగా ప్రసన్నం చేసుకోలేదని.
నీఅలుక నాకు అపురూపమే 
అలుకలో నీ అందం కెందామరకి ప్రతిరూపమే. 

అక్షరాలన్నీ పోటీ పడుతున్నాయి
నీవైన నాకైతలనలంకరించాలని
భావచందనాన్ని పూసుకొని
నవ పరిమళాలను వెదజల్లుతున్నాయి
నీ అందాలనుకప్పే భావాంబరానికి
తళుకులద్దాలని తొందరపడుతున్నాయి
ప్రతీ భావనర్తనానికీ
మురిపించే మువ్వలౌతున్నాయి
కళ్యాణ తలబ్రాలు కావాలని
పసిడి రంగు పూసుకుంటున్నాయి

భావాలన్నీ కొత్తకోకలు కట్టుకుంటున్నాయి
నీ మెప్పుపొందాలని.
కాముని శరాలని తోడు తెచ్చుకుంటున్నాయి
కలహమింకచాలించమని
అలుక తీరిన తదుపరి క్షణాలు తలచుకొని
సిగ్గిల్లుతున్నాయి
గమనంలో వయ్యారాలు చూపుతూ
సెలయేటి నడకలను తలపిస్తున్నాయి
నీ సౌందర్యాతిశయాలకు
అక్షర హస్తాలతో మోకరిల్లుతున్నాయి...@శ్రీ .

04/08/2013

|| e- స్నేహం ||


నిన్ను మునుపెప్పుడూ చూడలేదు 
ఎప్పుడూ మాట్లాడలేదు 
స్నేహమంటూ ఒకనాడు చేయి చాపావు 
చేయి కలుపుతూ సరేనన్నాను
నువ్వు థాంక్స్ అన్నావు
నేను వెల్కమ్ చెప్పాను

ఆత్మీయంగా రోజూ పలకరింపులు
శుభోదయాలు శుభరాత్రులు
పండుగలప్పుడు శుభాకాంక్షలు
పబ్బాలప్పుడు గ్రీటింగు కార్డులు

బాల్య స్నేహితులు గుర్తుకి రావడం లేదు
కాలేజ్ దోస్తీలు మరచిపోయాను
స్నేహంలోని ఆత్మీయతలలో కొట్టుకు పోతున్నా
అందులోని ఆప్యాయతలలో తేలిపోతున్నా
'e'- స్నేహాల వెల్లువలో మునిగిపోతున్నా

ఒక్కొక్కరినీ ప్రత్యక్షంగా కలుస్తుంటే
అనిపిస్తోంది ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లే
వినిపిస్తోంది ప్రతి మదినుంచీ స్నేహగీతం.
దినదినం వర్ధిల్లుతోంది మీతో ఈ అంతర్జాల స్నేహం... ...@శ్రీ 03/08/2013

(నేస్తాలూ కాదంటారా? ఈ అనుభవం చాలా మందికి అవుతోందని అనుకుంటున్నాను.
నాతో చక్కని ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తున్న నా అంతర్జాల స్నేహితులందరికీ
ప్రేమతో ఈ కవితా కానుక ...@శ్రీ )....