కన్నీటి బుడగలే పగిలాయి ఎందుకో
చెక్కిలిని ఆర్తిగా తడిమాయి ఎందుకో
పూలున్న హృదయాన్ని ఆక్రమించేసాయి
ముళ్ళున్న పొదలెన్నొ మొలిచాయి ఎందుకో
నావలో అడుగేయబోయాయి మోదాలు
ఖేదాల కడలిలో మునిగాయి ఎందుకో
తొలిఋతువులో పికము పాట వినబడలేదు
రాగాలు శిశిరాన్ని వలచాయి ఎందుకో
రెప్పలను వెలివేసి వెళ్ళాయి స్వప్నాలు
కనులలో చీకట్లు మిగిలాయి ఎందుకో
హేమంత ధూపాలు దయచూపలేదులే
అంగార కుసుమాలు విరిసాయి ఎందుకో
నీతోడు లేనపుడు నామీద "నెలరాజ"
పలుమార్లు విరహాలు గెలిచాయి ఎందుకో
... #శ్రీ
'శ్రీ' కవితలు
నా మనసున మల్లెలు...అక్షర నక్షత్రాలైన వేళ.....
27/12/2016
21/12/2016
|| నీ నవ్వులకెలా తెలుసు – తెలుగు గజల్ ||
గులాబీలు పూయించుట నీ సిగ్గులకెలా తెలుసు
మల్లెపూలు కురిపించుట నీ నవ్వులకెలా తెలుసు
నిశినెరుగని లోకాలకు దారులు వేస్తుంటాయి
పున్నములను పండించుట నీ చూపులకెలా తెలుసు
అమరత్వమునే కానుకనిచ్చిన చెలి నీవుకదా
అమృతాన్ని అందించుట నీ పెదవులకెలా తెలుసు
చీకటిలో మగ్గుతున్న మదిని ఊరడిస్తావు
వెన్నెలలో తేలించుట నీ కన్నులకెలా తెలుసు
నా జీవనగమనంలో సహచరివై “ నెలరాజా “
వసంతాల నడిపించుట నీ పదములకెలా తెలుసు #శ్రీ
19/12/2016
|| చెప్పవలెనా - తెలుగు గజల్ ||
కలలు గుచ్చిన సూదులన్నీ తీయలేనని చెప్పవలెనా
కనుల పొంగిన రుధిరధారను ఆపలేనని చెప్పవలెనా
దారితప్పిన వసంతానికి చేరువయ్యే రోజులెపుడో
చివురులేసిన వియోగాలను తుంచలేనని చెప్పవలెనా
కలిసి గడిపిన క్షణములన్నీ నన్ను విడిచినవెందుకోమరి
ఎదురుచూపుల యుగాలన్నీ మోయలేనని చెప్పవలెనా
దిక్కు తెలియని ఒడ్డునెరుగని చోటులోనే వదలినావు
సుడులుతిరిగే శోకనదమును ఈదలేనని చెప్పవలెనా
ప్రాణమంటే తీపిలేదు మరణమంటే భయములేదు
నిన్నుచూడక నిమిషమైనా బతకలేనని చెప్పవలెనా
మనసునిండా వెన్నెలిచ్చిన చందమామవు నీవుకాదా
నీవు లేనిచొ నిశలసేనను గెలవలేనని చెప్పవలెనా
నీవు చేసిన బాసలన్నీ నీటిరాతలు "ఓ నెలరాజ"
చేయిపట్టిన చేతినెపుడూ వదలలేనని చెప్పవలెనా #శ్రీ .
18/12/2016
|| నీలోనే ఉన్నవిలే – తెలుగు గజల్ ||
వెన్నెలలో వెలుగులన్ని నీలోనే ఉన్నవిలే
తారలలో తళుకులన్ని నీలోనే ఉన్నవిలే
కనులలోని చీకట్లకు చుక్కలు చూపిస్తావు
పున్నమిలో కాంతులన్ని నీలోనే ఉన్నవిలే
ప్రేమమబ్బుపైన చరిచి చినుకులు
కురిపిస్తావు
తొలకరిలో మెరుపులన్ని నీలోనే ఉన్నవిలే
స్ఫటికమంటి తనువులోన ఏ కిరణం వంగినదో
ఇంద్రధనువు విరుపులన్ని నీలోనే ఉన్నవిలే
చూపులన్ని మధుపాలై ప్రదక్షిణలు
చేస్తున్నవి
మధువనాల సొబగులన్ని నీలోనే ఉన్నవిలే
ప్రాణాలను ఐదింటిని
వేటలాడుతుంటావు
కందర్పుని శరములన్ని నీలోనే
ఉన్నవిలే
నింగిలోన చందమామ ఒకటేలే నెలరాజా
చౌదసీల చాందులన్ని నీలోనే ఉన్నవిలే
(ప్రతీ ఏటా వచ్చే 12 శుక్లపక్షాల
చందమామలన్నమాట )
17/12/2016
|| వింతకదా - తెలుగు గజల్ ||
కన్నీటిని చిందించని కనులుంటే వింతకదా
బాధనెపుడు చవిచూడని మనసుంటే వింతకదా.
మోదాన్నీ ఖేదాన్నీ పరిచయిస్తు ఉంటుంది
విరహాలను పంచనట్టి వలపుంటే వింతకదా
చివరి ఋతువు కాళ్ళకింద ఆకులన్నిచిట్లుతాయి
పంతముతో చివురించని వనముంటే వింతకదా
వెలుగుతున్నసూరీడే వేకువలో జనిస్తాడు
తూర్పుదిక్కులో చీకటి నిలుచుంటే వింతకదా
పుడుతూనే పరుగులతో కడలిదరికి ఉరుకుతాయి
సంగమాన్ని కోరుకోని నదులుంటే వింతకదా
పాతాళంలోకి కూడ వేర్లు పెంచి ఉంటుంది
అవినీతిని పెళ్లగించు పలుగుంటే వింతకదా
ఎండమావిలో తీయని జలములాగ "నెలరాజా"
మూర్ఖునికడ పాండిత్యపు నిధులుంటే వింతకదా #శ్రీ
09/12/2016
|| ఉంటుంది - తెలుగు గజల్ ||
తూర్పులో నిద్రించు సూర్యుడిని తొలిసంధ్య లేపుతూ ఉంటుంది
రాతిరిని పాలించు చీకటికి వీడ్కోలు పలుకుతూ ఉంటుంది
రేపులుగు చల్లగా గీతికలు పాడడం అబ్బురం కాదులే
కౌముదుల జారేటి వెన్నెలను ఆర్తిగా తాగుతూ ఉంటుంది
తిమిరాల సేనపై వేటాడు గగనమే విరుచుకొని పడుతుంది
పదునైన ఓ చంద్రహాసాన్ని గురిచూసి విసురుతూ ఉంటుంది
సప్తాశ్వములపైన పయనించు కాలాన్ని అడ్డుతూ ఉంటుంది
వేధించు తన్హాయి...రాత్రులను మెల్లగా కదుపుతూ ఉంటుంది
చెలి మందహాసాలు కరువైన వేళలో బాధతో "నెలరాజ"
దుఖించు మదిలోన మరిగేటి కన్నీరు పొంగుతూ ఉంటుంది
- శ్రీ
05/12/2016
|| ఓ సశేషం ||
కెరటాలలో హాలాహలాన్ని నింపుకొన్న
కాలసాగరం కరాళనృత్యం చేసుకుంటూ ...
కబళించేందుకు
మీదికొస్తున్నట్లనిపించే కలలన్నీ
వాస్తవాలుగా మారి కళ్ళముందు కనిపిస్తున్నాయి
మనం కలిసి నడిచినప్పుడు
పాదాలకింద చందనపుముద్దలా తగిలిన
తీరంలోని ఇసుకతడి...
హేమంతంలో కూడా చండ్రనిప్పుల్ని కక్కుతోంది
పరిమళాన్ని ఆవాహనం చేసుకున్న
మన కబుర్లపూలన్నీ ఎప్పుడు వాడిపోయాయో...
ఎండిన రేకులన్నీ సాగరగర్భంలో ఎప్పుడు కలిసిపోయాయో
వియోగాన్ని కొన్ని యుగాలపాటు
నిస్సహాయంగా మోస్తున్న మనసుకు తెలియలేదంటే ఆశ్చర్యమేముంది
శుక్లపక్ష రాత్రులలో వెన్నెలపూలు తురుముకొని
లాస్యమాడే అలలకన్నెలు...
కృష్ణపక్షపు తిమిరాన్ని నింపుకొని కోరలు చాచి
ఒడ్డుని కాటేసేందుకు పడగలు విసురుతున్నట్లే ఉంది
మూసుకున్న నీ మదిగోడలపై
నా తలపులేసిన చిత్రాలన్నీనీ కంటబడితే మరలివస్తావనుకుంటున్నా.
గుప్పెడు జ్ఞాపకాల గవ్వలకోసం జల్లెడపట్టిన సైకతరేణువులు
నీ పాదాలపై నా చిరునామా వ్రాస్తాయనే నమ్మకం మాత్రమే మిగిలింది
అదే నమ్మకం ... అనుక్షణం నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ ఉంటుంది
... #శ్రీ
Subscribe to:
Posts (Atom)