17/11/2012

అపురూపం నీ చెలిమి...




నేస్తం...
నీతో స్నేహమంటే...
ఏమిటో చెప్పనా?..
అందరిలాగే నాలుగు 
అందమైన పదాలు జోడించి 
అంత...ఇంత...అంటూ 
పోగిడేస్తావ్...అంతేగా!
అంటూ పెదవివిరుస్తావు...

ఎలా చెప్పేది?
ఎప్పటినుంచో 
వెదుకుతున్న 
ఆత్మీయతల నిధి 
ఇప్పటికి దొరికిందని.
అనురాగాల సన్నిధి 
నేటికి దొరికిందని...

భావ సారూప్యం
ఉన్న నేస్తం దొరకటం
నింగినున్న జాబిలి 
ఒక్క సారి దోసిలిలో పడినంత 
చల్లని అనుభూతినిస్తుందని 
ఇప్పటిదాకా తెలియదు సుమా!...

స్నేహం చేయడం 
ఎంతో సులువు.
అది నిలుపుకోవటం
చాలా కష్టమంటూ 
వ్రాసిన సూక్తులు ఎందుకో నచ్చావు నాకు.
అమలిన స్నేహాన్ని కష్టపడి 
వెతుక్కోగలిగితే 
ఆ స్నేహం నిలుపుకోవడం 
ఎంత సులభమో  అనిపిస్తుంది.

ఎన్ని  గనులు వెదికానో తెలుసా...
నాకు కావలసిన 
వరాల వజ్రాన్ని
పట్టేందుకు.
ఎన్ని వనాలుతిరిగానో 
నెయ్యాల నేమలీకను 
సాధించేందుకు...

శుక్లపక్ష పాడ్యమినాడు
మసక వెలుతురులా 
కనిపిస్తూ... 
దినదిన ప్రవర్ధమానమౌతూ 
నిండు పున్నమి నాటికి 
కోటిదివ్వెల కాంతులతో 
వేలతారల వెలుగులా 
శ్వేతప్రభలతో వెలిగే 
వెండివెన్నెలలా 
ఎప్పటికీ వన్నె తగ్గనిదై ఉండాలి 
మన స్నేహం.

ప్రాతఃకాలపు నీడలా 
ఉండకూడదు
మన స్నేహం...
అపరాహ్నపు ఎండలో... 
బిందువు నుంచి క్రమక్రమంగా 
పెరుగుతూ మనకంటే ఎత్తుగా ఎదిగి పోతూ 
అనంతంగా పెరిగిపోతూ... 
నిశీధిలో కలిసి కరిగిపోయే 
నీడలా ఉండాలి మన స్నేహం.

రెండు స్వార్థపూరితమైన 
మనసుల మధ్య స్నేహం 
కలకాలం నిలవదు...
నీ బాధ నాకన్నీరవ్వాలనే స్వార్థం నాది...
నా సంతోషంలో నీ కంట పన్నీరొలకాలనే స్వార్థం నీది...
ఇలాంటి స్వార్థాల స్నేహం మాత్రం కలకాలం నిలవాలి సుమా!...@శ్రీ