29/02/2012

ముద్దు






అరచేతి మీద ముద్దు...అరవిందం.
నుదిటి మీద ముద్దు... నీలాంబరం.
మెడ  మీద  ముద్దు...ముత్యాలసరం.
కంటి మీద ముద్దు ...కనకాంబరం.
ముక్కుమీద ముద్దు... ముద్ద మందారం.

చెంప మీద ముద్దు...చెప్పదు  అడ్డు
పాదం మీద ముద్దు...పారాణి అద్దు.
చెవి మీద ముద్దు... చెరిపేసే  హద్దు.

తొలిముద్దు... తొలకరి జల్లు.
పాపిటి మీద ముద్దు... పన్నీటి జల్లు.
పెదవి మీద ముద్దు...పులకరింతల హరివిల్లు.
ప్రియమైన ముద్దు....పరవశాల  విరి జల్లు.

ప్రియురాలి ముద్దు... వెన్నెల్లో మల్లెల జల్లు ,
అంతరంగాలలో దాచుకునే...సరసాల విల్లు.




















గెలుపా? ఓటమా?


ప్రభాత సమీరం,మెత్తటి నా మునివేళ్ళు...
చెదిరిన నీ ముంగురులను సరి చేయాలని
పోటీ పడుతున్నాయి...

సూర్యుని తొలి కిరణం...
నా పెదవి అరుణం ...
నీ నుదిటిపై సిందూరపు ముద్దు
అద్దాలని పోటీ పడుతున్నాయి.

కోకిల కలరవాలు...నా తీపి మాటల గుసగుసలు...
నీ చెవిని చేరాలని 
పోటీ పడుతున్నాయి.

చల్లని పిల్లగాలి ..... వెచ్చని నా కౌగిలి...
నిన్ను చుట్టేయాలని
పోటీ పడుతున్నాయి...

ఎవరిని గెలిపిస్తావు?
నన్ను గెలిపించి, నువ్వు గెలుస్తావా?
నన్ను ఓడించి, నువ్వోడిపోతావా ???

నీ ఆత్మనై....


నీతో ఉండాలనుకున్నా.... పూలతో తావిలా... 
కానీ, వాడిన  పూలతో తావి కూడా పోతుంది.

నీతో ఉండాలనుకున్నా....చంద్రునితో వెన్నెలలా ...
కానీ, పగలు ఆ రెండిటిని దూరం చేసేస్తుంది.

నీతో ఉండాలనుకున్నా.... నీ వెంట నీడలా.... 
కానీ, చీకటి నీనుంచి నీ నీడను దూరం చేస్తుంది...

అందుకే.....నీలో నీ ఆత్మనై  ఉంటా...
ఎవరూ వేరుచేయలేని నీ  ఆత్మనై  ఉంటా......