బస్సు స్టాపుల్లో...
ఆడపిల్లల మందహాసాలు చూస్తూ
బైకులు ఆపి లిఫ్ట్ కావాలా?
అంటూ అడిగే యువకులకు
వృద్ధులు చూపే చేతులు చూసి కూడా
ఆగరెందుకో?...
సిటీ బస్సుల్లో...
వనితల నడుము ముడుతలు
చూసి తాము కూర్చున్న చోటు
త్యాగం చేసే అపర కర్ణులకు...
ఆ పక్కనే నిలుచున్న వృద్ధుల
ముఖం మీది ముడుతలు కనపడవెందుకో?...
తమ అందాలకు కొత్త కొత్త మెరుగులు దిద్దుకోనేందుకు
వేలకు వేలు ఖర్చు చేసే ఆడువారు
వృద్ధులైన తమ అత్త మామలు
తినే పట్టెడన్నం ఖర్చు లెక్కలు వ్రాస్తారెందుకో?...
భార్య చీర కొంగు రెపరెపలకు పరవశిస్తూ...
ఆ కొంగుముడికి బందీలయ్యే వారికి
తమ తల్లి ముతక చీర చిరుగులు కనిపించవెందుకో?...
వృద్ధులైన తల్లిదండ్రులకు వచ్చే
పెన్షన్లు దోచుకొనే చేయి...
వారి అనారోగ్యానికి మందులు కొనాల్సి వచ్చినపుడు
ముందుకు రాదెందుకో?...
ఆదాయపు పన్నులో రాయితీ కోసం
వృద్ధాశ్రమాలకు దానాలు చేసే మహాదాతలు
వారి తల్లిదండ్రులను కూడా
ఆ ఆశ్రమాలకు దానం చేసేస్తూ ఉంటారు ఎందుకో?...
వృద్ధాప్యం తప్పదనీ...
వృద్ధాప్యం తప్పదనీ...
మనలను కూడా ఆ శాపం వీడదనీ
తెలిసి కూడా వర్తమానాన్ని చూడనివ్వని
ఆ కళ్ళముందు కమ్ముకున్న పొరలు కరగవెందుకో???...... @శ్రీ