08/03/2012

పుష్పాల హోలీ




మురళీధరా!
నీవు పంపిన చేమంతులు నా'చెంప'ను తాకితే
ముద్దబంతులు నా 'పెదవి'ని ముద్దాడాయి.

పున్నాగ పూలు పాలకడలి లాంటి పొట్టను తాకితే..
పొగడపూలు పొక్కిలికి చక్కిలిగింతలు పెట్టాయి.

సంపెంగలు సిగలో చేరితే
మరుమల్లెలు ముఖం మీదుగా  జారాయి.

మందారాలు బుగ్గల సిగ్గుని తాకితే 
కెందామరలు పాదాల ఎరుపుని పలకరించాయి 


సన్నజాజులు సరసమాడితే
విరజాజులు వెన్నెలై కురిసాయి.
పారిజాతాలు పై పైన పడుతూనే ఉన్నా
గులాబీలు గుండెకు చేరువైతే
వాటి గుబాళింపులు 
నా గుండెగుడిలోని నిన్ను ప్రేమతో  స్పృశించాయి

నీ పుష్పవర్షంతో నా తనువంతా 
పులకరించి పరవశించింది....
నీ ప్రణయ పుష్పవర్షంలో తడిసి 
నీకై మరింత కలవరించింది.                                     శ్రీ
                
        ( రాధ కృష్ణుల పూలతో ఆడే హోలీ గురించి విన్నాక ఈ హోలీ నాడు ఈ కవిత అక్షర రూపం  దాల్చింది)