12/03/2012

నేను బయటపడేదెలా?

నేను బయటపడేదెలా?


అలికిడైతే  చాలు...
నీ మోహన మురళీగానమేమోనని 
ఉలికిపడి నిద్రలోంచి లేచి చూడటం 
అలవాటుగా మారిపోయింది  నాకు.




గది కిటికీ నుంచి నా నుదుటిని 
తాకే ప్రభాత కిరణం...
నీ వెచ్చని కరస్పర్శేమోనని భ్రమించడం
అలవాటుగా మారిపోయింది  నాకు.


నిత్యం నీ మనో'సందేశమే'....
మేలుకొలుపుల 
శుభ ప్రభాతం అవుతోంది  నాకు.


ఇంటి నలుమూలలా నిన్నే చూస్తున్నాను...
రేయింబవళ్ళు  నిన్నే చూస్తున్నాను...
ప్రతిక్షణం నీ మాటలే  వినిపిస్తున్నాయి...


అంతెందుకు ప్రియతమా!
నన్ను నేను చూసుకొనే అద్దంలో కూడా 
నీ రూపమే కనిపిస్తుంటే యెలా?
నీ ఆలోచనల నుంచి నేను బయటపడేదెలా?
నీ వలపుల తలపుల 'వల' నుంచి నేను బయటపడేదెలా?













09/03/2012

జీవన మురళి




జీవం లేని వెదురు నా మనసు.
మన్మధ బాణం లాంటి   నీ చూపుతో.. 
నా మనసుకి చేసావు గాయం.

నెమ్మదిగా ఆ గాయం
అందమైన ఎనిమిది గాయాలుగా మారింది.
జీవం లేని ఆ వెదురుని
'మోహనమురళి'గా మార్చింది.
గాయపు బాధ కూడా తీయగా ఉంటుందని
నాడు తెలిసింది తొలిసారి.
నాటినుంచి ఆ మురళి 
నీ పేరే గానం చేస్తోంది...
నీ మాటనే అనుకరిస్తోంది....
నీ ప్రేమ సంగీతాన్నే ఆలపిస్తోంది.

నీకు తెలుసు...నీ ప్రేమే ఆ మురళికి శ్వాస అని.
నీప్రేమనెందుకు నానుంచి దూరం చేసావ్?
అపుడు  ప్రేమ సంగీతాన్ని ఆలపించిన మురళి 
ఇపుడు విరహరాగంలో  నిశ్సబ్దంగా  విలపిస్తోంది.

పాతగాయాలు మళ్ళీ రేగుతున్నాయి....
ఆ గాయాల్ని మాన్పే శక్తి నీ ప్రేమ లేపనానికే ఉంది.
మళ్ళీ మధుర సంగీతాన్ని పలికించే శక్తి నీ ప్రేమకే ఉంది.....
మళ్ళీ జీవన సంగీతాన్ని పలికించే శక్తి నీ ప్రేమలోనే ఉంది.
                                                                                         @శ్రీ 

08/03/2012

పుష్పాల హోలీ




మురళీధరా!
నీవు పంపిన చేమంతులు నా'చెంప'ను తాకితే
ముద్దబంతులు నా 'పెదవి'ని ముద్దాడాయి.

పున్నాగ పూలు పాలకడలి లాంటి పొట్టను తాకితే..
పొగడపూలు పొక్కిలికి చక్కిలిగింతలు పెట్టాయి.

సంపెంగలు సిగలో చేరితే
మరుమల్లెలు ముఖం మీదుగా  జారాయి.

మందారాలు బుగ్గల సిగ్గుని తాకితే 
కెందామరలు పాదాల ఎరుపుని పలకరించాయి 


సన్నజాజులు సరసమాడితే
విరజాజులు వెన్నెలై కురిసాయి.
పారిజాతాలు పై పైన పడుతూనే ఉన్నా
గులాబీలు గుండెకు చేరువైతే
వాటి గుబాళింపులు 
నా గుండెగుడిలోని నిన్ను ప్రేమతో  స్పృశించాయి

నీ పుష్పవర్షంతో నా తనువంతా 
పులకరించి పరవశించింది....
నీ ప్రణయ పుష్పవర్షంలో తడిసి 
నీకై మరింత కలవరించింది.                                     శ్రీ
                
        ( రాధ కృష్ణుల పూలతో ఆడే హోలీ గురించి విన్నాక ఈ హోలీ నాడు ఈ కవిత అక్షర రూపం  దాల్చింది)

                                                                                                                            

   



















06/03/2012

నిజమైన అందం


నిజమైన అందం


నీ కొప్పున ఉన్న మల్లెలకెంత
 గర్వం? 

ఆ కొప్పుకి వాటి వలెనే  అందం వచ్చిందట.
నా ముఖంపై చెదిరినప్పటి నీ కురుల అందం
అవెప్పుడైనా చూసాయేమో అడుగు?


నీవు కట్టిన తెల్లచీరకెంత బడాయి?
ఆ చీర వలెనే నీ మేనికి అందం వచ్చిందట.
నా ప్రేమతో నేసిన చీర మాత్రమే నీ శరీరానికి
సొగసులద్దుతుందని  ఆ తెల్లచీరకెలా చెప్పను?


ప్రియా!
జీవం లేని వాటి  వల్ల వచ్చే అందం తాత్కాలికం.
జీవంతమైన వాటి వల్ల వచ్చే అందం శాశ్వతం.


నా ప్రేమ లోని ఇంద్ర ధనుస్సు మెరుపులతో 
నీ అందం ద్విగుణీకృతం అవుతుంది.....
నా వలపుతలపుల  వెండి జల్లులోతడిసి
ఆ అందం యింకా మెరుస్తుంది...


అదే అందం నన్ను మరింత మురిపిస్తుంది.
అదే అందం నన్ను మరింత మురిపిస్తుంది.



                                                                    @శ్రీ















































వసంతం





లేత మావిచివుళ్ళను   
ఆరగించిన గండు కోయిల 
మత్తెక్కి చేస్తున్న
మధుర గానలహరి 
ఒకవైపు వీనులవిందు చేస్తోంది.......

లేత  వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తున్న చిలుకలు  
మరొక వైపు సందడి చేస్తున్నాయి.

నవ పల్లవ కుసుమ పరాగాన్ని
మోసుకొచ్చే 'పిల్ల'గాలుల పరిమళం
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

వన్నెల వయ్యారుల 
కొప్పుల మల్లెమాలలు
కొత్త పరిమళాలతో, 
మనసున చెలరేగే 
ఊహలకు
మరింత మత్తెక్కిస్తున్నాయి.

ప్రకృతి కాంత పచ్చని చీరతో...
లతల ఆభరణాలతో...
పూల తేనియ తీయదనంతో...
వసంతపు కొత్త సొగసులద్దుకొని
వలపు వానల ఋతురాజు రాకకై 
ఎదురు చూస్తోంది.
వలపు వానల ఋతురాజు రాకకై 
ఎదురు చూస్తోంది.





05/03/2012

మనో సాగరంలో తుఫాను




నా మనోసాగరంలో 
నీవు రేపిన అలజడి..
ఒక తుఫానుగా మారింది.
నీవు నిశ్చలమైన చెలియలికట్టవై....
నిన్ను తాకాలనుకొని, తాకలేకపోతున్న 
నా మనోసాగర తరంగాలను
పరిహసిస్తున్నావు.



ఇది నీకు న్యాయమా?
ప్రతి క్షణం చేసే ప్రయత్నంలో 
ఎప్పటికైనా సఫలీకృతుడనౌతాను.
ఈ తుఫాను క్షణ క్షణానికీ 
మరింత  ఉధృతమౌతుంది.
కెరటాలు మరింత ఎగసి పడి
నిన్నో రోజు తప్పక తాకుతాయి.
తాకడమే కాదు ఆ కెరటాలు
నా ప్రేమ ప్రవాహంలో
నిన్నుముంచేస్తాయి.


ఆ ప్రేమ విద్యుద్ఘాతంతో 
నా ప్రేమ స్పర్శను గ్రహిస్తావ్.
నా ప్రేమను అంగీకరిస్తావ్.                                                  -----------@శ్రీ






















04/03/2012

దాంపత్యం




నేను, నాది...  అనే  స్థితి నుండి
మనం, మనది ...అనే స్థితిలోకి మారితే  
అది దాంపత్యం.

నా ఇష్టం..  నీ ఇష్టంగా
నీ ఇష్టమే... నా ఇష్టంగా
మార్చుకుంటే 
అది దాంపత్యం.

నీ సంతోషం...నా కంట పన్నీరయి,
నా దుఃఖం...నీ కంట కన్నీరైతే
అది దాంపత్యం.

నా నోటి తాంబూలం... నీ నోట పండి,
నీ మేని పరిమళం...నామేని గంధమైతే
అది దాంపత్యం.

నేనే నువ్వై...నువ్వే నేనై
నా తోడు... నీవై
నీ నీడ... నేనై
ఒక జీవితకాలం కలిసుంటే
అదే దాంపత్యం.....
ఒక జీవితకాలం కలిసుంటే 
అదే దాంపత్యం.                                                            -----------@శ్రీ