06/07/2013

అమరం




ఏనాడైనా ఒక్క సెల్యూట్ కొట్టావా?
దేశానికై ప్రాణమర్పించిన యోధునికి. 

ఏనాడైనా ఒక్క గులాబీని ఉంచావా?
వీరమరణం పొందిన సైనికుడి సమాధిపై. 

ఏనాడైనా భుజం పట్టావా?
సమర యోధుని పార్ధివ శరీరానికి 

ఏనాడైనా ఆప్యాయంగా కౌగిలించుకున్నావా?
దేశం కోసం పోరాడిన యోధుడు నేలకొరిగిన చోటుని.

ఏనాడైనా మోకరిల్లావా?
అమరవీరుల స్మృతిచిహ్నం ముందు.

ఏనాడైనా ప్రేమగా స్పృశించావా?
యుద్దవీరుని కృత్రిమపాదాన్ని

ఏనాడైనా మందు పూసావా?
క్షతగాత్రుడైన దేశ సైనికుని శరీరానికి.

ఏనాడైనా వీరతిలకం దిద్దావా?
యుద్ధానికెళ్ళే వీరుని నుదిటిపై.

ఏనాడైనా శిరస్సున అద్దుకున్నావా?
విజయపతాకంతో తిరిగొచ్చిన సైనికుని పాదధూళిని.

ఏనాడైనా ప్రత్యక్షంగా చూసావా?
అమరసైనికునికిచ్చే గౌరవ వందనం.

ఏనాడైనా ఒక్కరూక విరాళమిచ్చావా?
కంటికి రెప్పలా కాపాడే సైనికుల సంక్షేమనిధికి.

ఏనాడైనా కన్ను చెమ్మగిల్లిందా?
శత్రు తుపాకుల తూటాలకి
ఛిద్రమైన యోధుల శరీరాలను చూసి.

ఏనాడైనా సంకల్పించావా?
నీ ఇంట్లో ఒక్కరినైనా దేశరక్షణకై పంపాలని.

ఏనాడైనా అనుకున్నావా?
శత్రు శతఘ్నికి ఎదురునిలవాలని.
దేశరక్షణకై ప్రాణమర్పించాలని.               @శ్రీ 


19/06/2013

నేనెవరో చెప్పాలా ?

శ్రీ || నేనెవరో చెప్పాలా ||

నీ తలపు వెనుక
వలపును నేనై
పలకరించిపోతున్నా.
మదితంత్రులను మీటి పోతున్నా.

నా ఊహకి రెక్కలొచ్చి
ప్రణయసందేశాన్ని మోసుకుంటూ
శ్వేత కపోతమై
నీ భుజంపై వాలుతున్నా.

నా కెంపు పెదవిపై విరిసిన దరహాసమై
నీమదిని కోసే చంద్రహాసమై
సప్తవర్ణాలను నింపుకున్న
ధవళ కిరణమై
సమీరంలోని నిశ్శబ్ద ప్రేమలేఖనై
రాగాలపల్లకిలో నిను పలకరించే
మౌనగానమై మదిని తాకుతున్నా.

నీకై వ్రాసే కవనాన్నై
అక్షర నివేదన చేసే గీతాన్నై
నీ చక్షువులను తాకుతున్నా
నీ శ్రవణాలలోనికి చేరుకుంటున్నా

ఇంకా అడుగుతున్నావా
నేనెవరని?
ఇంకా ప్రశ్నిస్తున్నావా
నీదైన నా అస్తిత్వాన్ని.........శ్రీ


16/06/2013

నాన్న



॥ నాన్న॥ 

ఓ వులేన్ ప్యాంటు 
ఓ టెర్లిన్ షర్టు 
కోరమీసం 
చలువకళ్ళద్దాలతో నాన్న.

అమ్మకి పూలు
తాతకి మందులు
నాకు బిస్కెట్లు
చెల్లికి చాక్లెట్లతో నాన్న.

అమ్మ రోగానికి
నా చదువుకి
చెల్లి పెళ్ళికి
అప్పులతో నాన్న.

ఓ వాలుకుర్చీ
ఓ కళ్ళజోడు
ఓ న్యూస్ పేపరు
పక్కనో టీ కప్పుతో నాన్న

దుమ్ముపట్టిన ఫ్రేములో
వాడిన పూలదండతో
మా నిర్లక్ష్యానికి సాక్ష్యంగా
నవ్వుతూ అమ్మ పక్కన నాన్న. ... @ శ్రీ ...

(తెలుగు వన్ లో ప్రచురించబడిన కవిత )

http://www.teluguone.com/sahityam/single.php?content_id=260

18/05/2013

విరహోత్పాతం


నాటా మాట ఉగాది సంచిక-2013 లో ప్రచురించబడిన నా కవిత 



శ్రీ || విరహోత్పాతం ||

తొలిసారి విన్న నీ పలకరింపు
తీయగా నా చెవిలో
నాదనర్తనం చేస్తూనే ఉంది

తొలిసారి పంపిన నీ ప్రేమ సందేశం
చదివిన కళ్ళు
సిగ్గు పడిన విషయం
తలిచే నా మది...
నిత్యం మంకెనపూలు పూస్తూనే ఉంది.

తొలిసారి నిన్ను చూసిన క్షణం
నా కళ్ళలో మెరిసిన మెరుపు
నా చీకటి మదిని
కాంతివంతం చేస్తూనే ఉంది.

తొలిసారి నీ చేతిని తాకిన క్షణం.
మంచుపూలు సుకుమారంగా
ఎదపై జారిన ఆ అనుభూతి...
గ్రీష్మాన్ని సైతం హేమంతంగా మారుస్తూనే ఉంది.

'నిన్ను' మాత్రమే ప్రేమిస్తున్నాననే
అందమైన నిజాన్ని విన్న
విప్పారిన కళ్ళు ఆశ్యర్యంగా చూసిన
చూపుల తాకిడి నా ఎదలో సృష్టించిన
తరగల నురుగుల్ని నా మనసు
ముఖానికి రుద్దుకుంటూనే ఉంది.

నా ప్రేమ ఊసుల్ని బిడియంగా విన్న
నీ చెవి లోలకుల కదలిక
గుండె గడియారంలో
వలపు డోలనాలు చేస్తూ,
మనసుని ప్రతి క్షణం ఉల్లాసపరుస్తూనే ఉంది.

నీ చేతి గాజుల్ని సవరించిన
చూపుడువేలుతో
దేనిని తాకినా ఆ సవ్వడినే తలపిస్తూ
వళ్ళంతా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

నీతో కలిసి నడిచిన ప్రతి అడుగు
నీవు లేకుండా కాలు కదపనని
మొరాయిస్తూనే ఉంది.

నీ పెదవెంగిలి చేసిన శీతల పానీయపు గొట్టం
నీదైన జ్ఞాపకాల అలమరలో
ఇంకా భద్రంగానే ఉంది.

నీతో గడిపిన ప్రతి మధుర క్షణం
నీవు లేని చేదు జ్ఞాపకాన్ని సైతం
తీయని తేనియలా మార్చేస్తూనే ఉంది.

మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా,
ఆకలితో ఉన్న అజగరం...
చిక్కిన లేడిని నిదానంగా మింగుతున్నట్లు
నీ వియోగం నన్నుకబళిస్తూనే ఉంది,
విరహ తిమిరం... వలపు వెలుగుని తాగేస్తున్నట్లు
అంతులేని విషాదం
నా ఆనందాన్ని అహరహం అదిమేస్తూనే ఉంది. @శ్రీ.

11/05/2013

(తల్లి) ప్రేమంటే ?




గుక్క పెట్టి ఏడ్చే బిడ్డను 
అక్కున జేర్చుకొనే తల్లి కంట్లోని 
నీటి పొర చెబుతుంది 

వందమందిలో ఉన్నా 
ఆకలితో అల్లాడే పసి పాపకు 
చిరుగుల చీర కప్పి 
స్తన్యమందిస్తూ 
ఆ తల్లి మరిచే సిగ్గు చెబుతుంది 

మండువేసవిలో
ఆటలకి పరుగులెత్తే 
పిల్లడి జేబులో 
తల్లి ఉంచే ఉల్లి చెబుతుంది 

తడిసి వచ్చిన బిడ్డడి 
తల తుడిచి గుండెలపై 
తల్లి వ్రాసే విక్స్ వాసన చెబుతుంది 

బిడ్డకు సూదిమందు వేస్తుంటే 
బాధతో విలవిలలాడుతూ 
ఆ తల్లి మూసుకొనే కన్ను చెబుతుంది 

గడగడలాడించే చలిలో 
బిడ్డ పాదాల వేళ్ళపై 
కంబళి సరిచేసే 
అమ్మ వేళ్ళ వణుకు చెబుతుంది 

తల్లికి తలకొరివి పెట్టేందుకు 
నిప్పుకట్టె పట్టుకొనే బిడ్డ చేయి 
ఎక్కడ కాలుతుందో?
అని మూసిన కన్నుల చాటున 
ఆందోళన పడే నిర్జీవ నేత్రాలను 
అడిగితే  చెబుతుంది                    @శ్రీ

11/04/2013

"విజయోత్సాహాల ఉగాది "


ప్రేమను ప్రేమించు...ప్రేమకై!...గ్రూప్ నిర్వహించిన ఉగాది కవితల పోటీలో 'ప్రథమ బహుమతి' పొందిన నాకవిత...ఈ విజయాన్ని          శ్రీ విజయ నామ సంవత్సరంలో  అందరికీ పంచుతూ....మీ మిత్రుడు @శ్రీ 

||విజయోత్సాహాల యుగాది ||....(ఉగాది కవితల పోటీకి)

నవపల్లవ కుసుమ పరాగాన్ని మోసుకొచ్చే 'పిల్ల'గాలుల పరిమళాలు.
మామీచిగురు తిని మత్తెక్కిన కోకిల ఆలపించే మధుర గీతికలు.
సీతాకోక చిలుకల కోలాహలాలు
కొమ్మలకున్న ప్రతి సుమాన్నీ పలకరిస్తూ
మోహావేశంతో మధుసేవనానికి తొందరపడుతూ మధుపాలు చేసే ఝంకారాలు.

తేటికాటు తిన్న పూబాలలు సిగ్గుతో తలలు దించుతూ
పుప్పొడి అంటిన తుమ్మెద పాదాలనుమకరందాలతో అభిషేకిస్తూ,
ఆ పాదాలను తుడిచే సుమదళాలు.

వన్నెల వయ్యారుల కొప్పులలో మత్తెక్కించే మల్లెల సౌరభాలు.
జడ చాటున దాగి పరిమళాల జావళీలు పాడే విరజాజుల మాలికలు.
యువకుల మనసులలో దూసుకుపోయే మదనుని అదృశ్య శరాలు.

నలుదిశలా వేవేల వర్ణాలతో సర్వాలంకార శోభితమై
నందనవన సౌందర్యాన్ని తలదన్నేభూలోక ఉద్యానవనాలు.
శుకపికాల సంగీత సమ్మేళనాలు.

నన్ను గెలిచేందుకు కాముని తోడు తెచ్చుకున్నావంటూ,
విజయ వాసంతుని పరిహసించే వనకన్య విరిజల్లుల మందహాసాలు.
మనసున నవనవోత్సాహంతో
చైత్రరథానికి స్వాగతం పలుకుతున్న సుమవనాలు

మంచుపూల దుప్పటి కప్పుకున్న శిశిరాన్ని తరుముతూ
పూలతేరుపై వాసంతుని ఆగమనం.
ప్రకృతి కాంతపై వలపువిజయం సాధించాలని...
ఎల్లరకూ శుభాలు పంచాలని... 'శ్రీ'

06/04/2013

పద్యమాలిక




తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడిన  నా కవిత ....@శ్రీ