07/10/2016

|| రాదో మరి - తెలుగు గజల్ ||




సూర్యుడు వెళిపోతుంటే రేయెందుకు రాదో మరి రాత్రి కరిగిపోతుంటే కునుకెందుకు రాదో మరి మనసులోన పొంగుతున్న శోకమంత ఏమైనదొ పొడిబారిన కనులనుండి నీరెందుకు రాదో మరి గుండెగదికి వలపు తోరణాలను కట్టేసాను స్వప్నాలను చూపించిన చెలియెందుకు రాదో మరి ప్రేమికులను ప్రతీక్షణం వేధిస్తూ ఉంటాయి వెన్నెలకీ విరహానికి విసుగెందుకు రాదో మరి బాధలున్న కడలిలోన వేనవేల తూఫానులు తీరానికి నను చేర్చే పడవెందుకు రాదో మరి కదలననే యుగాలన్ని మదికి భారమౌతున్నవి ప్రేమరూపి వరమిచ్చే రోజెందుకు రాదో మరి కాంతులకై నిరీక్షించు వేళలోన "నెలరాజా" చీకట్లకు చూపులపై జాలెందుకు రాదో మరి

03/10/2016

|| వింత కాదు - తెలుగు గజల్ ||





నేలదిగిన చంద్రసుతను చూసినాను వింతకాదు 
వెన్నెలలో నిలువెల్లా మునిగినాను వింతకాదు 

నేలస్పర్శ తెలియని సుకుమారపు పాదాలు తనవి 
బాటపైన వసంతాన్ని జల్లినాను వింతకాదు 

సౌందర్యపు వాహినిలా నా కనులకు కనబడింది 
చూపులన్ని నౌకలుగా చేసినాను  వింతకాదు 

రెప్పలపై చుంబిస్తూ నేనే తన ప్రాణమంది
కలగన్నానేమోనని తలచినాను వింతకాదు 

తలంబ్రాల వేడుకలో తన తలపై జార్చాలి 
నక్షత్రాలెన్నిటినో  తెచ్చినాను వింతకాదు

చందమామ కబురంపెను తనయను చేపట్టమని
పున్నమినే కట్నంగా కోరినాను వింతకాదు

ప్రేమరాణి త్వరలోనే వస్తుందని నెలరాజా
మనసంతా పుప్పొడితో అలికినాను వింతకాదు


 

27/09/2016

|| ఉన్నదోయి - తెలుగు గజల్ ||






పాదాలకు పట్టుదలను పూయాలని ఉన్నదోయి
గమ్యాలకు వందనాన్ని నేర్పాలని ఉన్నదోయి

ద్వేషంతో రగులుతున్న వారిని గాలించాలి 
వలపుచువ్వతో వాతలు పెట్టాలని ఉన్నదోయి

ముడిరవ్వలతో సమమే భాషలోని అక్షరాలు 
సద్భావముతోటి సానపెట్టాలని ఉన్నదోయి

మమతకన్న త్వరితంగా మదిలోపల పెరుగుతుంది 
అహంకారమనే కలుపునేరాలని ఉన్నదోయి

ప్రబలుతున్న హింసచూసి కన్ను చెమ్మగిల్లుతోంది
విశ్వశాంతి నెలకొంటే చూడాలని ఉన్నదోయి

మూఢభక్తులందరికీ కొత్తదారి చూపాలి
మానవతకు ఒక కోవెల కట్టాలని ఉన్నదోయి

ప్రేమశరములన్నిటినీ సంధిస్తూ "నెలరాజా" 
పగలకు గాయాలెన్నో చేయాలని ఉన్నదోయి




23/09/2016

|| చేయగలదు(దూ) - తెలుగు గజల్ ||



చందమామే వెలుగుతుంటే చీకటేమిటి చేయగలదు(దూ)
అమావాస్యే కోపగిస్తే వెన్నెలేమిటి చేయగలదు(దూ)

నిన్ను నీవే ఆయుధంగా మలచుకుంటూ సాగిపోవలె
బెదిరిపోయే వైరి పట్టిన శస్త్రమేమిటి చేయగల(దు)దూ

నిదురపోతే ఆలసించక చెంగుచెంగున వాలిపోదా 
రెప్పలార్పని కన్నులుంటే  స్వప్నమేమిటి చేయగల(దు)దూ

పట్టుదలతో అడుగులేస్తే గమ్యమే తల వంచుతుంది 
కాలుకదపని మనుషులుంటే బాట ఏమిటి చేయగల(దు)దూ

మనువు చెప్పిన మాటలన్నీ ఈ యుగానికి పనికిరావు  
కులములన్నీ ఒక్కటైతే శాస్త్రమేమిటి చేయగలదూ

స్వయంశక్తిని నమ్ముకుంటే భాగ్యమంతా నీదికాదా 
బ్రహ్మరాతలతోటి నిండిన ఫాలమేమిటి చేయగల(దు)దూ

కలియుగంలో అసత్యాలే రాజ్యమేలును  "ఓ నెలరాజ"
సాక్షులందరు అమ్ముడైతే  న్యాయమేమిటి చేయగల(దు)దూ

22/09/2016

|| తెలియలేదు - తెలుగు గజల్ ||








|| తెలియలేదు - తెలుగు గజల్  ||

కనులలోన మాయలెన్నొ ఉంటాయని తెలియలేదు 
చూపులతో  మంత్రమేదొ వేస్తావని తెలియలేదు 

తెలతెల్లని మల్లెలకై తీవెలెన్నొ తడిమాను 
నీ నవ్వుల తోటలలో(తోటలోన) పూస్తాయని తెలియలేదు 

పూలలోన మధువుందని నేటివరకు భ్రమించాను 
అధరాలను చిలుకుతుంటె పుడతాయని తెలియలేదు 

రెప్పలపై తీపివాన పడుతుంటే కొత్తగుంది
తేనెలున్న కలలమబ్బు కురిసిందని తెలియలేదు 

తపిస్తున్న గుండెలలో చల్లదనం చేరినది 
విరహాగ్నిని ప్రేమజల్లు తడిపిందని తెలియలేదు

జన్మలుగా మనం కలిసి ఉండడమొక చిత్రమే 
కాలమనే హంసకూడ(రాజహంస) ఓడిందని తెలియలేదు 

వెన్నెలతో పోటీపడు వెలుగేదో "నెలరాజా"
నను అల్లిన మేనిలోన విరిసిందని తెలియలేదు 

( నెలవంక నెమలీక మాసపత్రికలో  ప్రచురించబడిన గజల్ ) 



20/09/2016

|| శాంతికపోతాలెపుడూ ఎగురుతూనె ఉండాలీ - తెలుగు గజల్ ||







శాంతికపోతాలెపుడూ ఎగురుతూనె ఉండాలీ  
వైరులు పన్నిన వలలను తెంచుతూనె ఉండాలీ 

తెగువను చూపాలంటే చల్లదనం పనికిరాదు 
వీరుల రక్తము ఎపుడూ మరుగుతూనె ఉండాలీ 

పదికి బదులు వేయి తలలు నరికి తెచ్చి చూపాలీ 
యోధులలో పౌరుషాగ్ని రగులుతూనె ఉండాలీ  

సూచీముఖ వ్యూహంతో మున్ముందుకి సాగాలీ 
ప్రత్యర్ధుల దళాలన్ని చీల్చుతూనె ఉండాలీ 

కంచెదాటి ఒక్క అడుగు దేశంలో పడకూడదు
హద్దునుండి శత్రువులను తరుముతూనె ఉండాలీ

నిప్పులుకక్కే క్షిపణిగ ఒక్కొక్కడు మారాలీ 
యుద్ధంలో పగవారిని కూల్చుతూనె ఉండాలీ 

విజయోత్సాహం నిండిన కనులలోన "నెలరాజా"
దేశభక్తి పొంగిపొంగి పొర్లుతూనె ఉండాలీ  

|| నాపాక్ ఇరాదోంకా రక్షా (సమర్ధన్) కరనే వాలే .... ||







దేశభక్తి మీకూ ఉండాలి
మాకు ఉన్నట్లే ...
మా దేశాన్ని రక్షించే సైనికులకు ఉన్నట్లే ...

ఆయుధాలు మీకూ ఉండాలి 
దాడి చేస్తే తిప్పికొట్టడానికి...
శత్రువులని హతమార్చడానికి

యుద్ధనీతి అనేది మీకూ తెలియాలి 
నిద్రిస్తున్న వారిమీద కత్తిదూయకూడదని
అమానుషంగా వాళ్ళ పీకలు కోయకూడదని

మీకూ కొన్ని నిజాలు తెలియాలి
ముఖాముఖీ తలపడితే 
నీ దేశం ఓ బూడిదకుప్పగా మారిపోతుందనీ 
"నాపాక్ ఇరాదోంకా దేశ్" సర్వనాశనమైపోతుందనీ.

నువ్వు నీ నేతలూ తెలుసుకోవాలి 
శాంతికాముకత్వంతో ఉన్నప్పటికీ
మా దేశపు రక్షకులు ఆయుధం పడితే 
శత్రువుని నరకానికి పంపిగానీ వదలరనీ
ఒక్కొక్కడూ నిప్పులుగక్కే  ఓ గైడెడ్ మిస్సైల్^తో సమానమని
శత్రువుల గుండెల్ని చీల్చే కరవాలంతో సమానమని

ఈరోజునుంచీ భయపడడం నేర్చుకో... 
18మంది పోతేనే 18 అక్షౌహిణులకంటే
 బలమైన సేనాబలం యుద్ధానికి సంసిద్ధమైతే .... 
నరికిన ఒక్కో తలకూ బదులుగా వేయి తలలే తెగుతాయో ?
ఒక్కొక్కరికి ఒకో లక్ష చొప్పున 
యుద్ధభూమిలో ప్రాణాలు వదులుతారో ?

ప్రేమకు బదులు ప్రేమను ఇచ్చే దేశంలోని
 ప్రజలంతా నపుంసకులనుకుకోకు
ఒక్కసారి అంతా కలిసి పిడికిలి బిగిస్తే...
నేలకూలిన నీ దేశపు సైనికులకు 
సమాధులు కట్టడానికి చందాలు వసూలు చేసుకోవాలి.