20/03/2012

'చెలి'కి మేలుకొలుపు



నిత్యం నీ ప్రేమ పలకరింపులతో
నా నుదిటిపై నీ వెచ్చని పెదవుల స్పర్శతో
నన్ను మేలుకొలుపుతావు నువ్వు.
నేడు నీకంటే ముందుగా నిద్ర లేచి,
నిన్ను నిద్ర లేపాలనుకున్నాను.

నిద్రిస్తున్న నిన్ను చూసేదాకా నాకు తెలియదుసుమా!
అలసి సొలసి నిద్రించిన అందం ఇంత అందంగా ఉంటుందని..
చెదిరిన కుంకుమ నుదిటికి కొత్త అందాన్ని తెస్తే...
పాపిట సిందూరం ముంగురులకి వింత సోయగాన్ని ఇచ్చింది.
సిగలో వాడిన మల్లెలు కొత్త కథలేవో చెప్తున్నాయి.

పగలంతా వంపు సొంపుల వయ్యారి నదిలా ప్రవహించి,
రాత్రి వేల ఉరుకుల పరుగుల జలపాతంగా మారి...
చివరికి సముద్రంలో కలిసిన నదిలా ఎంత ప్రశాంతంగా ఉన్నావ్?

'నిద్రిస్తున్న అందమైన ప్రియురాలి ఎర్రని పెదవులను ముద్దు పెట్టుకున్నాను..
ఎంత అందమైన దొంగతనం అది' అంటాడు గాలిబ్....
ఆ దొంగతనం రుచి నేడే తెలిసింది...
ఆ పెదవి మాధుర్యం ఇపుడే తెలిసింది...

ఆ దొంగతనమే నీ మేలుకొలుపుకి నాంది...
ఆ దొంగతనమే నీ మేని మేలుకొలుపుకి నాంది...





No comments:

Post a Comment