12/10/2012

పొరలు కరగవెందుకో???


బస్సు స్టాపుల్లో...
ఆడపిల్లల మందహాసాలు చూస్తూ
బైకులు ఆపి లిఫ్ట్ కావాలా?
అంటూ అడిగే యువకులకు 
వృద్ధులు చూపే చేతులు చూసి కూడా 
ఆగరెందుకో?...

సిటీ బస్సుల్లో... 
వనితల నడుము  ముడుతలు 
చూసి తాము కూర్చున్న చోటు 
త్యాగం చేసే అపర కర్ణులకు...
ఆ పక్కనే నిలుచున్న వృద్ధుల 
ముఖం మీది ముడుతలు కనపడవెందుకో?...

తమ అందాలకు కొత్త కొత్త మెరుగులు దిద్దుకోనేందుకు 
వేలకు వేలు ఖర్చు చేసే ఆడువారు
వృద్ధులైన  తమ అత్త మామలు 
తినే పట్టెడన్నం ఖర్చు లెక్కలు వ్రాస్తారెందుకో?...

భార్య చీర కొంగు రెపరెపలకు పరవశిస్తూ...
ఆ కొంగుముడికి బందీలయ్యే వారికి 
తమ తల్లి ముతక చీర చిరుగులు కనిపించవెందుకో?...

వృద్ధులైన తల్లిదండ్రులకు వచ్చే 
పెన్షన్లు దోచుకొనే చేయి...
వారి అనారోగ్యానికి మందులు కొనాల్సి వచ్చినపుడు 
ముందుకు రాదెందుకో?...

ఆదాయపు పన్నులో రాయితీ కోసం
వృద్ధాశ్రమాలకు దానాలు చేసే మహాదాతలు 
వారి తల్లిదండ్రులను కూడా 
ఆ ఆశ్రమాలకు దానం చేసేస్తూ ఉంటారు ఎందుకో?...

వృద్ధాప్యం తప్పదనీ...
మనలను కూడా ఆ శాపం వీడదనీ 
తెలిసి కూడా వర్తమానాన్ని చూడనివ్వని 
ఆ కళ్ళముందు కమ్ముకున్న పొరలు కరగవెందుకో???...... @శ్రీ 









30 comments:

  1. చాలా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. స్వాగతం కిషోర్ గారూ!
      ధన్యవాదాలు మీకు నా భావాలు నచ్చినందుకు...@శ్రీ

      Delete
  2. శ్రీ గారూ ..
    నిరాదరణకు గురవుతున్న వృద్ధుల వేదనను చక్కగా చెప్పారండీ..
    అమ్మరాజీనామా సినిమాలో "సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ"
    పాట గుర్తుకు వచ్చింది మీ కవిత చదవగానే..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజీ గారూ!
      మీరు చెప్పిన పాట బాగుంటుంది...
      నిత్య జీవితంలో మనం చూసే వాటినే సందేశాత్మకంగా వ్రాసే ప్రయత్నం చేసాను...
      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  3. శ్రీ గారూ, ప్రేమ కవితల్లో మంచి భావుకత చూపించే మీ అక్షరాలు ఇలా ఆత్మీయపు హెచ్చరికలు చేయగలవని నిరూపించుకున్నారు.
    వృద్దుల పట్ల నిరాదరణ చూపే వారికి ఇది ఒక చెంపపెట్టు. మనకూ వృద్దాప్యం తప్పదూ అనే ఓ హెచ్చరిక కూడా.. మాటలు చాలటం లేదు ఎంత బాగుందో చెప్పటానికి.
    ఇలాంటి కవితలు కావాలి సమాజ మార్పుకి.

    ReplyDelete
    Replies
    1. అవును మెరాజ్ గారూ!
      వారిపట్ల నిరాదరణ చూపించే వారిలో కొంతమందిలోనైనా
      మార్పు వస్తే మంచిదే...
      ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి...@శ్రీ

      Delete
  4. అద్భుతం గా రాసారు!


    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హర్షా!
      నా భావాలు నచ్చినందుకు...@శ్రీ

      Delete
  5. అన్నీ జీవితపు సత్యాలే
    అయినా నిరాధరణ ఎందుకో?
    చాలా బాగుంది మీ ఫీల్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు యోహాంత్ గారూ!
      అన్నీ తెలిసి కూడా నిరాదరించడమే బాధాకరం...@శ్రీ

      Delete
  6. పోరల మధ్యే బతకాలని వుందేమో,... మనిషి నొసటన..

    ReplyDelete
    Replies
    1. అవును భాస్కర్ గారూ!
      పొరలు తొలగాలి...
      కళ్ళు తెరవాలి...
      ధన్యవాదాలు మీకు...@శ్రీ

      Delete
  7. వృద్దుల పట్ల నిరాదరణ చూపేవారిలో పరివర్తన తీసుకురాగలిగే కవిత.
    చాలా బాగా వ్రాశారండి.

    ReplyDelete
    Replies
    1. అవును భారతి గారూ!
      సమాజంలో పరివర్తన కలిగితే
      అంతకంటే కావలసినదేమిటి చెప్పండి
      ధన్యవాదాలు భారతి గారూ!...@శ్రీ

      Delete
  8. "వృద్ధాప్యం తప్పదనీ...
    మనలను కూడా ఆ శాపం వీడదనీ
    తెలిసి కూడా వర్తమానాన్ని చూడనివ్వని
    ఆ కళ్ళముందు కమ్ముకున్న పొరలు కరగవెందుకో?"
    చాలా బాగారాసారు....

    ReplyDelete
    Replies
    1. నా భావాలు మీరు మెచ్చినందుకు
      ధన్యవాదాలు పద్మ గారూ!

      Delete
  9. Replies
    1. సత్యం కఠోరమైనదే...
      కానీ చూసే కళ్ళు సరిగా స్పందించ లేకపోతున్నాయి లక్ష్మి గారూ!
      అదే మనసుని కలిచేసే విషయం...
      ధన్యవాదాలు మీ స్పందనకు...@శ్రీ

      Delete
  10. yes the hard heart layers of the public of today may not dissolve because it is kaliyuga we experienced some of the relatives how rudish they behaved at their parents.ravindra.

    ReplyDelete
    Replies
    1. అవును రవీంద్రా!
      మన చుట్టాల్లో, స్నేహితుల్లో ఇలా నిరాదరించే వారిని
      నిరాదరణకు గురి అయిన వాళ్ళని చూస్తూనే ఉంటాం ప్రతి నిత్యం...
      ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  11. ప్రతి ఒక్కరి కళ్ళముందూ కనిపించే అనుభవంపొందే సత్యాల్ని చక్కని కవితలో చెప్పారు...
    నిజమే వృధాప్యం అంటే అందరికీ అంత చిన్నచూపెందుకో...

    ReplyDelete
    Replies
    1. ఆ వృద్ధాప్యం నన్ను చేరదు అనే భ్రమలో ఉంటూ
      వృద్ధులకు చేయూతనివ్వని యువత,
      ఇంట్లో వృద్ధులను సరిగా ఆదరించని భార్య భర్తలు....
      ఇదేగా నేటి నాగరిక సమాజంలో చూస్తున్నాం...

      మీ ప్రశంసకు
      ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!

      Delete
  12. నిరాదరించబడుతున్నారు కనుకనే....ఇన్ని ఓల్డ్ ఏజ్ హోం లు వెలుస్తున్నాయి రోజురోజుకి.

    ReplyDelete
  13. అవును పద్మారాణి గారూ!
    మీరన్నది నిజమే...
    పెద్దవారి విలువలు పిన్నలు గుర్తించే రోజులోస్తాయని ఆశిద్దాం...@శ్రీ

    ReplyDelete
  14. nati pillalu neti vrudhulani yendhuku grahincharo......CHAKRI

    ReplyDelete
  15. నాటి పిల్లలే నేటి వృద్ధులు...నిజమే...
    వారు వారి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న ప్రేమను
    మనకు పంచుతూ వచ్చారు...పంచుతున్నారు...
    కానీ నేడు ఆ ప్రేమను పొందికూడా ఆ ప్రేమను వారికి
    తిరిగి ఇవ్వక స్వార్థంతో బ్రతికే వారికి కొంచమైనా
    కనువిప్పు కలగాలని కోరుకుందాం...
    నా బ్లాగ్ కు స్వాగతం Q computers గారూ!
    మీ స్పందనకు ధన్యవాదాలు...@శ్రీ

    ReplyDelete
  16. శ్రీ..శ్రీ! మీ ఆలోచనలు వాస్తవమైనవే.. ఆకర్షణ సిధ్ధాంతానికి అతీతమైనవీ..
    ఎవరి జాగ్రత్తలలో వాళ్ళుండాల్సిన కాలం.వృధ్ధాప్యం ఇబ్బందికర పరిస్థితే..ఒకరు ఆదుకుంటే.. తీరేదా!! మీ మాటలు మనం మననం చేసుకుని నిట్టూర్చడానికే..
    కొత్తతరం లో మీ వేలు చూపించే వర్గానికి.. ఇవేమీ పట్టవ్.

    ReplyDelete
  17. స్వాగతం SKY గారూ!
    మీరన్నది నిజమే...మారారని మనం అనుకుంటాము...
    కానీ మార్పు రావాలని ఆశించడం తప్పు కాదు...
    వృద్ధులు ఎంత జాగ్రత్తగా ఉన్నా వారి శరీరం సహకరించక,
    కన్ను ,కాలు సహకరించక ఇబ్బంది పడుతుంటారు...
    అలాంటి వారిని చిన్న చూపు చూడకుండా చేయూతనిస్తే...
    వారి పట్ల మనలను కన్నందుకు కృతజ్ఞతా చూపిన వాళ్ళం అవుతాము...
    ఏమంటారు?...
    ధన్యవాదాలు మీ స్పందనకు....@శ్రీ

    ReplyDelete
  18. చాలా బాగా రాసారు శ్రీ గారు.....తల్లిదండ్రుల విలువ తెలుసుకోక ...వాళ్ళని హీనంగా చూసే పిల్లలకి చురకలు పెడుతుంది మీ కవిత....

    ReplyDelete
    Replies
    1. అవును కావ్యగారూ!...
      కొంతమంది కళ్ళకి కమ్మిన పొరలైనా విడితే...
      అది ఆనంద దాయకమైన విషయం...
      నాభావం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు @శ్రీ

      Delete