18/02/2013

స్వార్ధం



వేకువ చీకటిని చీల్చే క్షణంలో
మంచుతెరలను తొలగిస్తూ 
నీ నుదుటిని తాకే తొలికిరణం 
నేనే కావాలనుకొనే స్వార్ధం నాది.

నిదుర లేచిన నీ కనులు 
మొదట చూసే దృశ్యం 
నా ముఖమవ్వాలనుకొనే స్వార్ధం నాది.

నీ తడికురులు నా పెదవులపై 
చేసే లాస్యంతో 
మేలుకోవాలనే స్వార్ధం.నాది.

కన్ను తెరిచి మబ్బుకమ్మిన 
మచ్చలేని చందమామను 
ఉదయాన్నేచూడాలనే 
స్వార్ధం నాది.

చక్కర కలిపిన తేనీటికి
తేనెల మాధుర్యం తోడుగా 
నిత్యం నాకందించాలనే స్వార్ధం నాది.

ఈ కుందనపు బొమ్మనొదిలి 
ఏ కొమ్మతో ఉన్నావో ?
అనే అపనమ్మకపు మాటల్లో
తొణికిసలాడే ప్రేమను 
నేనే అవ్వాలనే స్వార్ధం నాది.

ప్రతి రాత్రి నీ చెవి నా గుండెసవ్వడి వింటూ 
నీతల నా ఎదనే తలగడగ చేసుకోవాలనే 
అందమైన స్వార్ధం నాది.

నీ ప్రతి ఆనందానికీ కారణం నేనే కావాలనీ 
ఎ చిన్ని బాధకూ కారణం నే కారాదనీ 
కోరుకునే స్వార్ధం నాది.

నా ప్రేమలోని నిస్వార్ధాన్ని నువ్వెప్పుడూ గుర్తిస్తూ 
నీ ప్రేమనంతా  నేనే పొందాలనే 
నిస్వార్ధమైన స్వార్ధం నాది.

(నా బ్లాగ్ లోని కవితలను ఆదరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు...అభివాదాలు.మీ వలెనే నేను ఎదిగింది.అందుకే నన్ను ప్రోత్సహించిన మిత్రులకి అందరికీ నా వ్రాతలు అంకితం.)...@శ్రీ 















19 comments:

  1. నా ప్రేమలోని నిస్వార్ధాన్ని నువ్వెప్పుడూ గుర్తిస్తూ
    నీ ప్రేమనంతా నేనే పొందాలనే
    నిస్వార్ధమైన స్వార్ధం నాది. రియల్లీ సుపర్బ్ , కడిగిన ముత్యంలా ప్రతి పదం ఎంతో అందంగా ఉంది , చాల బాగా రాసావు , నువ్వు ఇలాగే మరిన్ని రాయాలని కోరుకుంటూ మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తీ చేసుకున్న సందర్భంగా నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు , god bless you

    ReplyDelete
    Replies
    1. బోలెడు ధన్యవాదాలు శ్రీ లక్ష్మి..నీ ప్రశంసకి.....@శ్రీ

      Delete
  2. " ఈ కుందనపు బొమ్మనొదిలి
    ఏ కొమ్మతో ఉన్నావో ?
    అనే అపనమ్మకపు మాటల్లో
    తొణికిసలాడే ప్రేమను
    నేనే అవ్వాలనే స్వార్ధం నాది."

    నిజమైన అనురాగానికి అనుమానం క్షణికమే..ఆరాధన శాశ్వతమని గుర్తించిన మీ ప్రేమ స్వార్ధంపురూపంగా ఉంది... ప్రేమ సాహిత్యపు పరవళ్ళలో తొలి శతపు మజిలీ చేరినందుకు అభినందనలతో ఇదే ఒరవడితో శీఘ్రగతిని సహస్రానికి చేరుకోవాలని అభిలషిస్తూ....

    ReplyDelete
    Replies
    1. అవును పద్మ గారూ!...మీరన్నది నిజమే...అపార్ధాల మబ్బులు తోలిగిపోతే జీవితం పండు వెన్నెల్లో పండువెన్నెలే గా...మీ స్నేహపూర్వకమైన స్పనదనకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  3. బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు. అభినందనలు శ్రీ గారు
    చాలా చాలా బావుంది :)


    ReplyDelete
    Replies
    1. బోలెడు ధన్యవాదాలు మంజు గారూ!...మీ ప్రశంసకి, మీ అభినందనలకి...@శ్రీ

      Delete
  4. నీ ప్రతి ఆనందానికీ కారణం నేనే కావాలనీ
    ఎ చిన్ని బాధకూ కారణం నే కారాదనీ
    కోరుకునే స్వార్ధం నాది.

    wonder ful.

    Congrats!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వనజ గారూ!...మొదటినుంచీ చివరిదాకా ఇలా స్పందనలతో నన్ను ముందుకి నడిపించారు...@శ్రీ

      Delete
  5. మీ కవితల వెనుక మీ క్రుషి ఉంది, మీ మంచి మనసుంది, సత్ప్రవర్తన ఉంది, దాదాపు యేడాదిగా మీరు బ్లాగ్ మిత్రులు నాకు, యెన్నొ సందర్భాలలో మీ ఓర్పు చూసాను, వివేకం చూశాను. నేను మీలా రాయగలనా అని మీరు చాలా సార్లు అనేవారు,కానీ మీరు అప్పటికే బాగా రాస్తున్నారు.మంచి,బాషా,సాహిత్యం మీ సొంతం.ఎప్పుడూ తొణకని మనస్తత్వం మీ సొంతం.శ్రీ గారూ మీ కవిత వదిలేసి మీ గురించి చెప్తున్నాను కదా. నేను అభిమానించే మిత్రుల్లొ మీరు ఒకరు.చక్కర కలిపిన తేనీటికి
    తేనెల మాధుర్యం తోడుగా
    నిత్యం నాకందించాలనే స్వార్ధం నాది.
    ఇది నచ్హింది నాకu

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మేరాజ్ గారూ!...నా ప్రతి కవితకి చక్కగా స్పందిస్తూ నేను ఇలా ఇన్ని కవితలను వ్రాసేందుకు ప్రేరణనిచ్చిన స్నేహితురాలిగా మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను...ధన్యవాదాలు మీకు ...నేను కవిగా కాదు మంచి మనిషిగా బ్రతకాలనుకుంటాను,,,మీ స్పందన ఆవిషయాన్ని తెలియజేస్తుంది...@శ్రీ

      Delete
  6. " నీ ప్రతి ఆనందానికీ కారణం నేనే కావాలనీ
    ఎ చిన్ని బాధకూ కారణం నే కారాదనీ
    కోరుకునే స్వార్ధం నాది"

    ఇలాంటి స్వార్ధాన్ని ప్రతి మనసూ కోరుకుంటుందేమో...

    "శ్రీ" గారూ..
    మా అందరికీ నచ్చే శ్రీ కవితలకు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు రాజి గారూ!...
      మీలాంటి వారి ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది...
      ఇలా ప్రతికవితకీ స్పందిస్తూ ప్రోత్సాహాన్నివ్వడం గోప్పవిషయమే...
      మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ....@శ్రీ

      Delete
  7. శ్రీ గారూ, ప్రేమ కవితల్లో Century కొట్టేశారు ఒక్క సంవత్సరంలోనే. Congratulations!
    నిజమే, ప్రేమలో అన్నీ నాకే కావాలన్న స్వార్ధం ఉంటుంది. కానీ అది నిశ్వార్ధమైన స్వార్ధం. స్వార్ధం లోనూ మంచి ఉంటుంది అంటే అది ప్రేమ లోనే సాధ్యం!
    మీ బ్లాగ్ పుట్టినరోజు న నాడు వందవ కవిత రాయటం, అది ప్రేమ మీదే కావటమూ మంచి విశేషమే.
    ప్రేమోన్నమః !
    ఇంకా మంచి మంచి కవితలు చాలా రాయాలనీ, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ...
    - మీ చిట్టి, పండు.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ (చిట్టి పండు ) లకు బోలెడు ధన్యవాదాలు....
      ప్రతి కవితకీ వెన్ను తట్టి అది ఎలా ఉన్నా బాగుందంటూ మెచ్చుకుంటూ ముందుకి నడిపించిన మీకు కృతజ్ఞుడిని.
      ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ పోస్ట్ నెంబర్ 143 :-)
      అనుకోకుండా ఇలా జరిగింది...
      మీ శుభాకాంక్షలను స్వీకరిస్తూ బోలెడు ధన్యవాదాలను మీముందుంచుతున్నాను...@శ్రీ

      Delete
  8. SRI KAVITHALAKU puttina roju SUBHAKANKSHALU
    KRISHNA AND VISHNUPRIYA

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణ & ప్రియ...మీ శుభాకాంక్షలకు...@శ్రీ

      Delete
  9. శ్రీ గారు , చాలా లేట్ గా చూసానండి. మీ శాకుంతలం చూసినప్పుడు కూడా ఈ పోస్ట్ చూడలేదు... మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు....! మీరిలాగే ఎల్లప్పుడు చక్కటి కవితలు రాసి మమ్మల్ని అలరించాలని కోరిక...

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి వెన్నెల గారూ!...మీరు శుభాకాంక్షలు చెప్పలేదని కించిత్ అలిగాను కూడా....:-)...మీ అభినందనలకి ప్రత్యభివందనలు...@శ్రీ

      Delete
  10. శ్రీ కవితలకు పుట్టునరోజు శుభాకాంక్షలు :)
    సెంచురీ కొట్టినందుకు అభినందనలు

    ReplyDelete