రాత్రంతా చీకటిని చీలికలు చేస్తూనే ఉంటాయి
కలలను వెదికే కనురెప్పల అంచులకత్తులు
కన్ను మూస్తే కనబడే దుస్వప్నాల కుత్తుకలను
తెగనరుకుతుంటాయి సుస్స్వప్నాల కాల్పనికఖడ్గాలు
గాయాల చీకట్లు నల్లని రుధిరాన్ని స్రవిస్తూనే ఉంటుంది
కొత్తవేట్లకి అప్రయత్నంగానే సంసిద్ధమౌతూ
తీయని స్వప్నసాక్షాత్కారం పొందని బాధతో
కళ్ళు కక్కే ఆమ్లాల దాడులకి చెక్కిళ్ళు కాలిపోతూనే ఉంటాయి.
మండుతున్న కలల పొగలు
సుడులు తిరుగుతూ ఊపిరాడకుండా చేస్తున్నాయి కళ్ళని.
నిశను చీల్చినా
రేయిని కాల్చినా
కలలని వ్రేల్చినా
కళ్ళు నిప్పులు చిమ్మినా
విషాదమే గెలుస్తుందని తెలిసినా...
మడమ తిప్పని యోధునిలా
కొత్త ఆశలు నింపుకుంటూ
రెట్టించిన సమరోత్సాహంతో
స్వాగతిస్తున్నాయి నాకన్నులు...మరో రాత్రిని సాదరంగా...
Last lines are inspiring.
ReplyDeleteనిజమే కదా ఏది ఏమైనా ఏం జరిగినా ఆశావహ దృక్పథం తో సాగవలసినదే చాలా బాగుందండి మీ కవిత
ReplyDelete