31/03/2014

జయ ఉగాది







(అందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు )


|| జయ ఉగాది  ||

మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల 
మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే

వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే

ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ
వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే

ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని 
ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే

కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు 
పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే

తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ
విరికన్నెల ప్రసాదాలకై  ప్రదక్షిణలు చేస్తుంటే

చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ 
తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే

శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని
చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ

తరువులన్నిటినీ  పలకరిస్తూ...సుమగంధాలను ఆఘ్రాణిస్తూ
శిశిరాన్ని తరిమి కొడుతూ...విజయదుందుభి మ్రోగిస్తూ

జయకేతనం ఎగురవేస్తూ...విచ్చేసాడు ఋతురాజు
అపజయమెరుగని 'జయ'నామధేయుడు.                    ...@శ్రీ 



(చిత్రకారులు వాసు గారికి ధన్యవాదాలతో ...)

1 comment:

  1. శ్రీ జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...... తమ్ము :)

    ReplyDelete