11/10/2016

|| నా మనసును - తెలుగు గజల్ ||



ప్రేమజలధి తరగలలో  కలిపినావు  నా మనసును
నురుగుపూల వెన్నెలతో అలికినావు నామనసును 


చూపులతో లడాయీలనెపుడు నేర్చుకున్నావో
తియతీయని ములుకులతో చీల్చినావు  నా మనసును

కబళించే గ్రహణాలకు గ్రహణంలా పట్టినావు 
నిశలంటని పున్నమిలో నిలిపినావు నా మనసును

ఫక్కుమంటు నువు నవ్వితె నక్షత్రపు జల్లులే 
చీకట్లకు దూరంగా జరిపినావు నా మనసును

మదనునడిగి కొత్తకొత్త వ్యూహాలను రచించావు     
అప్సరసలనోడిస్తూ గెలిచినావు నా మనసును 

కనిపిస్తే వేధించక మానదనే తెలుసు నీకు 
విరహానికి దొరకకుండ దాచినావు నా మనసును

వలపునేలు రాణివలే కనిపిస్తూ "నెలరాజా"
బందిపోటు దొంగలాగ దోచినావు నా మనసును 

 

1 comment: