16/11/2016

|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||



అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ స్వర్ణోత్సవం నాడు 
భారతీయభాషల కవి సమ్మేళనంలో చదివిన కవిత. 


|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||

అపరదానకర్ణులనిపించుకోవాలనేమో...
కనీ పెంచినందుకు కృతజ్ఞతను చూపకుండా 
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు దానం చేసేస్తున్నారు
కృతఘ్నులైన  కొంతమంది బిడ్డలు.  

“మదర్స్ డే” నాడు అమ్మ ఫోటోలను ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొని 
తల్లిగురించి ఎవరో రాసిన కొటేషన్లు షేర్ చేసుకుంటూ 
లోకుల దృష్టిలో తల్లిని దేవతలా పూజించేవారి జాబితాలో 
మొదటిస్థానాన్ని కొట్టేస్తూ ఉంటారు.

ఫాదర్స్ డే నాడు తండ్రి చేసిన త్యాగాల లిస్టుతో 
చదివేవాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగేంత గొప్పగా కవితలనల్లేస్తారు,
తల్లే కాదు తండ్రికూడా ఎంతో పూజనీయుడేనంటూ 
ఎన్నో మాటలు మాట్లాడతారు.

తనను కన్యాదానం చేసేటప్పుడు
అమ్మిన పొలాలు , తాకట్టుపెట్టిన ఆస్తుల సంగతి 
ఎప్పుడూ తలవనైనా తలవరు 
కరిగిపోయిన అమ్మ పుస్తెల గురించి ఒక్కమాట కూడా మాట్లాడరు.
తల్లిదండ్రులను తమతో తీసుకెళ్లలేమని కుంటిసాకులు చెప్పే కూతుళ్ళు .

తమ చదువులకోసం తండ్రి చేసిన ఓవర్ టైములు 
తీసుకున్న లోన్ల సంగతి ఎప్పుడూ గుర్తుచేసుకోవడానికే  ఇష్టపడరు ... 
రెండుచేతులా డాలర్లో ,రూపాయలో సంపాదించుకొనే కొడుకులు 

తల్లైనా తండ్రైనా మరణించిన కబురు తెలియగానే 
విద్యుత్‌ దహనవాటికల్లో దహన సంస్కారాలు చేయించి 
గంగలోనో గోదారిలోనో చితాభస్మాన్ని కలిపి కాస్త పుణ్యాన్ని
తమకు మెయిల్ చేసే వెబ్ సైట్లకోసం వెదుకుతూ ఉంటారు...
పున్నామనరకాన్ని తప్పిస్తారని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న “కొడుకులు” .

ఆశీస్సులు మాత్రమే ఇస్తూ 
పిల్లల ఉన్నతికోసం కనిపించే ప్రతీ దేవుళ్ళకీ
మొక్కుకునే తల్లిదండ్రులు మారాలి. 
బతికుండగానే నరకాన్ని చూపించిన పిల్లలకి 
కాస్తంత పుణ్యం కూడా దొరకకూడదనీ...
తమ ప్రేమను తలదన్నినందుకు, 
వాళ్ళ పాపం వాళ్ళనే కాల్చేయాలనీ 
కార్చే కన్నీటినే మంత్రజలంగా మార్చి జల్లడం నేర్చుకోవాలి ...
గుండెను బండరాయిగా చేసుకొని శపించడం నేర్చుకోవాలి ... 


No comments:

Post a Comment