|| రాదో మరి - తెలుగు గజల్ ||
సూర్యుడు వెళిపోతున్నా రాత్రెందుకు రాదో మరి
రాత్రి వచ్చినాగానీ కలలెందుకు లేవో మరి
చివురు చూడకుండానే ఎండుటాకు రాలుతుంది
ఆనందం అడుగిడినా వెతలెందుకు పోవో మరి .
గజిబిజి గీతలలోనే బతుకు చిక్కుకుంటోంది
నుదిటిమీద భాగ్యరేఖ జాడెందుకు లేదో మరి
గుండెలోని శోకమంత పొంగిందని తెలుస్తోంది
పొడిబారిన కనులనుండి నీళ్ళెందుకు రావో మరి
కాలం మాన్పని గాయం లేనేలేదంటారు
యుగాలెళ్ళిపోతున్నా బాధెందుకు పోదో మరి
పగబట్టిన విధికూడా అనుక్షణం చంపుతోంది
ప్రాణాలను హరియించే యముడెందుకు రాడో మరి
ఆరు రుచుల మిశ్రమాన్ని సేవిస్తూ "నెలరాజా"
వేపవిత్తులను మింగని బతుకెందుకు చేదో మరి
#శ్రీ
No comments:
Post a Comment