తేనెపూలు జల్లుతావు నను పిలిచిన వేళలోన
ముత్యాలను రువ్వుతావు నువు నవ్విన వేళలోన
కన్నులలో వెండిపూల రేకులెన్ని కురిసాయో
చందమామ తనయలాగ నువు మెరిసిన వేళలోన
సుగంధాల జలధిలోన మునిగినట్లు ఉంటుంది
మాలలంటి చేతులతో నను చుట్టిన వేళలోన
గుండెలపై మెరుపులాగ వాలుతుంటె వదలలేను
వానమబ్బు ఉరిమినపుడు నువు బెదిరిన వేళలోన
మనసంతా వసంతాల పల్లకిలో ఊరేగెను
కొత్తపెళ్లికూతురిలా నువు వచ్చిన వేళలోన
నయనాలను రోజాలే అభిషిక్తం చేసాయి
వేనవేల చూపులతో నిను గుచ్చిన వేళలోన
స్వర్గలోక సుఖమంటే తెలిసినాది "నెలరాజా"
రతీదేవిలాగ వచ్చి నను కలిసిన వేళలోన
#శ్రీ
No comments:
Post a Comment