03/03/2012

నీ మనసున నా తలపులు



ప్రియా!
వసంతం వచ్చేసింది...
మదనుడు
తన శృంగార రథపు అశ్వాలను..
నీ జడకొరడాతో  అదిలిస్తూ తరలి వస్తున్నాడు.

చెరకు వింటిని ఎక్కుబెట్టి 
నన్నే లక్ష్యంగా చేసుకొని
కుసుమశరాలను
గురి తప్పకుండా
వదులుతున్నాడు.

అనుక్షణం నీ తలపులతో జీవించే 
నాతో వైరం ఎందుకని
ప్రశ్నించాను.

దూరంగా ఉన్న 
నీ మదిలోని 
నా వలపు తలపులే....
తన శరములని బదులిచ్చాడు.
నీ మదిలోని
నా వలపు తలపులే.....
తన శరములని బదులిచ్చాడు.

02/03/2012

అంకితం







నీ పెదవుల ఎరుపులో ముంచిన కుంచెతో
నీకు రాసిన ప్రేమలేఖ నచ్చలేదన్నావు......
నీ కాలి పారాణిని అద్దిన వేలితో 
నీకు రాసిన ప్రేమలేఖ సరిగా లేదన్నావు....

నీ చిగురుటధరాలపై
నా నాలుక కొసతో రాస్తే
లేఖలే కాదు ప్రేమకావ్యం రాసినా..
స్వీకరిస్తానన్నావు.

అలాంటి ఎన్నో కావ్యాలని ...
నాకు  పదే పదే అంకితమిస్తానన్నావు...
నాకు పదే పదే అంకితమిస్తానన్నావు....








01/03/2012

ప్రేమ సంకెళ్ళు



తమస్సులో,ఉషస్సులో
నీకోసం వేచి చూసాను చెలీ!

నా కోసం,నీకోసం, 
మనకోసం, 
మన ప్రేమ కోసం,
వస్తావని వేచి చూసాను చెలీ!

బంధాలు,అనుబంధాలు
తెంచుకొని
చేసిన బాస కోసం వస్తావని
వేచి చూసాను చెలీ!

బంధాలు, అనుబంధాలు 
తెంచేసుకున్నావు  నాతో....
నీ కాలికి పాశమైన నా ప్రేమ సంకెళ్ళనే 
తెంచేసుకున్నావు చెలీ!....
నీ కాలికి పాశమైన నా ప్రేమ సంకెళ్ళనే 
తెంచేసుకున్నావు చెలీ!....








29/02/2012

ముద్దు






అరచేతి మీద ముద్దు...అరవిందం.
నుదిటి మీద ముద్దు... నీలాంబరం.
మెడ  మీద  ముద్దు...ముత్యాలసరం.
కంటి మీద ముద్దు ...కనకాంబరం.
ముక్కుమీద ముద్దు... ముద్ద మందారం.

చెంప మీద ముద్దు...చెప్పదు  అడ్డు
పాదం మీద ముద్దు...పారాణి అద్దు.
చెవి మీద ముద్దు... చెరిపేసే  హద్దు.

తొలిముద్దు... తొలకరి జల్లు.
పాపిటి మీద ముద్దు... పన్నీటి జల్లు.
పెదవి మీద ముద్దు...పులకరింతల హరివిల్లు.
ప్రియమైన ముద్దు....పరవశాల  విరి జల్లు.

ప్రియురాలి ముద్దు... వెన్నెల్లో మల్లెల జల్లు ,
అంతరంగాలలో దాచుకునే...సరసాల విల్లు.




















గెలుపా? ఓటమా?


ప్రభాత సమీరం,మెత్తటి నా మునివేళ్ళు...
చెదిరిన నీ ముంగురులను సరి చేయాలని
పోటీ పడుతున్నాయి...

సూర్యుని తొలి కిరణం...
నా పెదవి అరుణం ...
నీ నుదిటిపై సిందూరపు ముద్దు
అద్దాలని పోటీ పడుతున్నాయి.

కోకిల కలరవాలు...నా తీపి మాటల గుసగుసలు...
నీ చెవిని చేరాలని 
పోటీ పడుతున్నాయి.

చల్లని పిల్లగాలి ..... వెచ్చని నా కౌగిలి...
నిన్ను చుట్టేయాలని
పోటీ పడుతున్నాయి...

ఎవరిని గెలిపిస్తావు?
నన్ను గెలిపించి, నువ్వు గెలుస్తావా?
నన్ను ఓడించి, నువ్వోడిపోతావా ???

నీ ఆత్మనై....


నీతో ఉండాలనుకున్నా.... పూలతో తావిలా... 
కానీ, వాడిన  పూలతో తావి కూడా పోతుంది.

నీతో ఉండాలనుకున్నా....చంద్రునితో వెన్నెలలా ...
కానీ, పగలు ఆ రెండిటిని దూరం చేసేస్తుంది.

నీతో ఉండాలనుకున్నా.... నీ వెంట నీడలా.... 
కానీ, చీకటి నీనుంచి నీ నీడను దూరం చేస్తుంది...

అందుకే.....నీలో నీ ఆత్మనై  ఉంటా...
ఎవరూ వేరుచేయలేని నీ  ఆత్మనై  ఉంటా......


28/02/2012

వెన్నెల కురిపించవా?




లోకమంతా చంద్రుని చల్లని వెన్నెలలో తడుస్తోంది..
ఎర్రకలువ రేకుల మెత్తదనంతో పోటీ పడే నీ పాదాలు 
వెన్నెల కాంతిలో మెరుస్తుంటే చూడాలని ఉంది.


'నీలో మచ్చ ఉంది'.
'నాలో మచ్చ లేదు' అని చంద్రుని ఎగతాళి చేసే
నీ ముఖ చంద్రబింబాన్ని చూడాలని ఉంది.

ఎగిరే నీ ముంగురులలో  వెన్నెల  ప్రతిఫలింప జేసి...
వింతశోభను నీ ముంగురులకు అందించిన
ఆ చంద్రబింబాన్ని చూడటం కంటే,
నీ మోములోని చంద్రుని  చూడటమే నాకు ఇష్టం  ప్రియా!....

కరుణించవా?
నా చీకటి  జీవితంలో వెన్నెల కురిపించవా?