నల్లని మబ్బులు నెమ్మది నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి..
వెలుతురును మింగేసే చీకటిలా....
కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని బయలుదేరిన శచీంద్రుని
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీ ,మృదంగ ధ్వనులతో.....
ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని వెంట బడుతూ,
చుట్టుకుంటున్న విద్యుల్లతల మెరుపులతో....
సాయం సంధ్యలో దేవ సేనాని మయూరం
పురి విప్పినట్లుగా...
సప్త వర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...
ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటి వంతెన వేస్తున్నట్లు
కురిసింది
తొలకరి జల్లు.
( నిన్న సాయంత్రం కురిసిన తొలిజల్లుని చూస్తూ అల్లిన కవిత.. @శ్రీ )













