ఆషాఢం కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది గోరింట
నీ సుతిమెత్తని చేతిలో పండిపోవాలని
సిగ్గులజల్లుతో తడిపేస్తుంది గోరింట నీ చేతిని
హరితమేఘమై కమ్ముకుంటూ
నీ అరచేత పండిన గోరింట...
తొలి-మలిసంధ్యలకి
సూరీడు అద్దిన అధరాల అరుణాన్ని ధిక్కరిస్తుంది
అరచేతి మధ్యలోని గుండ్రని చందమామ...
వెన్నెల మైదానంలో పరుండిన
పగడాల జాబిలిని తలపిస్తుంది
పండిన గోరింటలు
నీ అరచేతి కాన్వాసులో
చిత్రవిచిత్రమైన చిత్రాలై మురిసిపోతాయి
గోరింట నవ్వులని కెంపులు కాజేస్తాయి...
నవరత్నాలలో మెరుగ్గా కనబడాలని
గోరింట ... నీకు కొత్త కాదులే
నీ బుగ్గల్లో పండుతుంది
సిగ్గులు ఒలికిపుడు
నీ కన్నుల్లో మండుతుంది
నాపై అలిగినపుడు
నీ చేతుల్లో కొలువౌతుంది
నా వేళ్ళు అసంఖ్యాక చిత్రాలు గీసినపుడు
నీ పాదాల్లో ఫక్కుమంటుంది
నా చేయి ఆధారమైనపుడు.
నీ మేనంతా పండుతుంది
నా చూపులు చేసిన గాయాలు...మందారాలై విచ్చుకున్నప్పుడు ...@శ్రీ
అక్షరాల ఆకులను రుబ్బి, చూడ ముచ్చటైన సూర్య వంకలనూ చంద్రవంకలనూ కవిత్వపు అరచేతిపై తీర్చి ముగ్ధ బుగ్గల్లోని సిగ్గులా ఎర్రబడ్డ భావాలను చూసి మురిసేలా ఉంది మీ "గోరింట పంట"
ReplyDelete