25/10/2016

|| వాలినట్లు ఉన్నదిలే - తెలుగు గజల్ ||



కనులలోన నీ రూపము వాలినట్లు ఉన్నదిలే
కనుపాపలలో వెన్నెల జారినట్లు ఉన్నదిలే

శ్రీచందనభరితమైన నీ ఊపిరి తగిలెనేమొ
శ్వాసలోన మల్లెవీణ మోగినట్లు ఉన్నదిలే

నీ తలపుల బాణాలను ప్రయోగించి చూసాను
విరహమంత నన్నువదిలి పోయినట్లు ఉన్నదిలే

నీ మోవికి మధువెక్కడ దొరికిందో తెలుపలేదు 
పెదవులపై తేనెపూలు పూసినట్లు ఉన్నదిలే

మధురమైన కలలన్నీ రేయంతా కురిసాయి 
రెప్పలపై నెమిలీకతొ  రాసినట్లు ఉన్నదిలే

ముంగురులను పదేపదే సవరిస్తూ ఉంటావు  
మబ్బుచాటు చందమామ చూసినట్లు ఉన్నదిలే 

నీ నవ్వుల మౌక్తికాలు చెదురుతుంటె "నెలరాజా" 
మెరుపులన్ని ఒక్కసారి నవ్వినట్లు ఉన్నదిలే

No comments:

Post a Comment