వలపుల్ని పంచేటి మనసొకటి కావాలి
మధువుల్ని నింపేటి పలుకొకటి కావాలి
ఏడురంగులు చూసి ఎన్నాళ్ళు అయినదో
వర్ణాల్ని వంచేటి విల్లొకటి కావాలి
పుడమిలో కణములకు గొంతెండిపోతోంది
మేఘాన్ని చరిచేటి మెరుపొకటి కావాలి
దుస్వప్నరాజ్యాన్ని తుడిచిపెట్టేయాలి
ప్రియురాల్ని చూపేటి కలయొకటి కావాలి
ఎండుటాకుల ధ్వనులు చెవికింపుగా లేవు
శిశిరాన్ని తుంచేటి చివురొకటి కావాలి
విరహమే రాహువై మదిని కబళిస్తోంది
గ్రహణాన్ని మింగేటి వెలుగొకటి కావాలి
పూలతో బాటలను నింపాలి "నెలరాజ"
ముళ్లన్ని ఏరేటి చేయొకటి కావాలి
No comments:
Post a Comment