27/10/2016

|| జాబిలెచట ఉంటుంది - తెలుగు గజల్ ||




నల్లరంగు పూసుకున్న జాబిలెచట ఉంటుంది చీకట్లను తరమలేని పున్నమెచట ఉంటుంది తపిస్తున్న కణాలన్ని కంటబడితె ఊరుకోదు తీరాలను ముద్దాడని కెరటమెచట ఉంటుంది గ్రీష్మమెళ్లిపోగానే మేఘాలను మథిస్తుంది అంకురాన్ని గెలిపించని తొలకరెచట ఉంటుంది ఎంత మధువు తాగిననూ తనివితీరదనుకుంటా పూబాలలపై వాలని తుమ్మెదెచట ఉంటుంది పూర్వభూమిలో చిందే రుధిరానికి భయపడడదు తమస్సుతో పోరాడని ఉదయమెచట ఉంటుంది తనువునొదిలి ఎగిరేందుకు ఎప్పటికీ సిద్ధపడదు మృత్యువు వలలో చిక్కని ప్రాణమెచట ఉంటుంది అల్లుకున్న నెలరాజుని ఏనాడూ నిందించవు వెన్నెలపై మండిపడని తార ఎచట ఉంటుంది

No comments:

Post a Comment