చీకటిపై కాంతిపూలు జల్లుతోంది ఈ వెన్నెల
చలచల్లని బాణాలను రువ్వుతోంది ఈ వెన్నెల
తీరకాంత కొప్పులోన మెరవాలని ఉన్నదేమొ
తరగలపై మల్లెలుగా మారుతోంది ఈ వెన్నెల
చందమామనొంటరిగా క్షణమైనా విడువదులే
కలువపూల కళ్ళలోకి జారుతోంది ఈ వెన్నెల
ప్రణయించే జంటలన్ని తనకంట్లో పడెనెమో
జాబిల్లిని మబ్బు(ముగ్గు)లోకి లాగుతోంది ఈ వెన్నెల
పున్నమంటి చెలిచిత్రం గీయాలని తలచాను
పుచ్చపూల కాన్వాసుగ మారుతోంది ఈ వెన్నెల
ఒంటరైన ప్రేమికులతొ వైరం తనకెందుకో
నేస్తమైన విరహానికి చూపుతోంది ఈ వెన్నెల
సుగంధాన్ని తనమేనికి పూసుకుంటు "నెలరాజా"
జాజిపూల తీగలపై పాకుతోంది ఈ వెన్నెల
No comments:
Post a Comment