06/11/2016

|| నా ప్రేయసి - తెలుగు గజల్ ||




చాందినీల పల్లకిలో కదులుతోంది నా ప్రేయసి  
పాలపుంతలకు తళుకులనద్దుతోంది నా ప్రేయసి 

మనసులోని వనాలన్ని శిశిరాలకు బలియైనవి
సుమదళాల ఉప్పెనలో ముంచుతోంది నా ప్రేయసి

మధురసుధలనెన్నిటినో  పెదవులలో నింపుకుంది
కోరినపుడు కాస్త కాస్త పంచుతోంది నా ప్రేయసి

నిరీక్షణల పర్వాలకు ఉద్వాసన పలుకుతుంది 
ప్రతిరేయిని రసధునిలా  మార్చుతోంది నా ప్రేయసి

విరహంలో మండుతున్నమనసునెలా చూసిందో
శీతజలధి తరగలలో తడుపుతోంది నా ప్రేయసి 

మదిలోపలి అమాసలకు నిలువనీడనీయదులే
సిరివెన్నెల దీపంలా వెలుగుతోంది నా ప్రేయసి 

కనులలోన వాలుతున్న చీకట్లను " నెలరాజా " 
తన చూపుల శరములతో తరుముతోంది నా ప్రేయసి    
                                                   - శ్రీ 

No comments:

Post a Comment