27/01/2013

మోస్తూనే ఉంటావు.


పుట్టినపుడు
'అయ్యో ...ఆడపిల్లా!' 
అనే లోకం నిట్టూర్పులు మోసావు...

వైవాహిక జీవితంలో
మెట్టినింటి 
బరువు బాధ్యతలు మోసావు... 

బిడ్డను ప్రసవించడానికి 
గర్భంలో నవమాసాలు 
నీ చిన్నారిని మోసావు...

పిల్లల వెంట వారి 
పుస్తకాల సంచులు 
మోసావు...

ఇల్లు గడవక 
బైట (పని) బరువులు 
మోస్తున్నావు...

ఆఖరికి "నీ బరువు"
మరో నలుగురు మోసేదాకా...
జీవితాంతం 
ఏదో  ఒకటి మోస్తూనే ఉంటావు...










23/01/2013

నీ చూపులు...





ప్రేమగా
 నా కళ్ళలోకి  
చూసే లోతైన  చూపులు 
చిరుకోపంతో  చురుక్కుమంటూ
గుచ్చే  చూపులు

మదన  శరాలను   సానపట్టి
సంధించే  చూపులు 
తలుపు  వెనుకనుంచి
ఓరగా  చూసే  చూపులు 

నా
  గుండెని  తాకే
వెన్నెల  తూపుల  చూపులు 
సిగ్గుతో  నా  వంక  చూస్తూ
నా మనసు దోచే చూపులు 

సాయం  సంధ్యలో  నాకోసం
వేచి  చూసే  చూపులు 
ఆలస్యమైతే  చూసే
వాడి  వేడి చూపులు

నన్ను   గారంగా
పూలతీగలా అల్లుకునే  చూపులు ...
నేను  అలిగితే 
నను  ప్రసన్నం  చేసుకునే  చూపులు

నను అలరించే  చూపులు 
నను  కవ్వించే  చూపులు 
నన్నారాధించే 
అర్థనిమిలీత  నేత్రాల చూపులు


నా మది వాకిలిలో 
రంగవల్లులేసిన చూపులు.
ప్రియ సమాగమంలో 
సిగ్గుతో స్వీట్ నథింగ్స్ చెప్పే చూపులు 

నిశ్శబ్ద సంగీతమాలపించే చూపులు
మది వేణువుని పలికించే చూపులు 
నా హృదయం భేదించిన చూపులు.
మన ప్రేమకి మూలమైన చూపులు.
మన బంధాన్ని శాశ్వతం చేసిన చూపులు.                        @శ్రీ 









19/01/2013

మిథునం అద్భుతః

                                                                  

  
                     "అద్భుతః" సినిమా గురించి చెప్తానంటూ ఇలా అంటున్నానని ఆశ్చర్యపోతున్నారా?...సినిమా చూసాక మీ నోటినుంచి కూడా అదే మాట వస్తుంది 
                        సుమారు ఓ దశాబ్దం క్రిందట 'రచన' మాస పత్రికలో శ్రీరమణ గారి కథ చదివాక అనుకున్నాను.
ఈ కథను అదృశ్యంగా మా అమ్మమ్మ,తాతయ్య గార్లను చూసి వ్రాసారేమో అని. ఈ కథని చక్కని నాటకంగా రెండు పాత్రలతో ప్రదర్శిస్తే అద్భుతంగా ఉంటుందని అనిపించింది...క్రిందటేడాది తెలిసింది భరణి గారు ఈ కథని చలన చిత్రంగా  తీస్తున్నారు అని...పాటలు రిలీజ్ అయ్యాక ఎంత జనాదరణ పొందాయో మీకు వేరే చెప్పక్కర్లేదు...
కాఫీ ప్రియులకు కాఫీ దండకం...భోజన ప్రియులకు ఆవకాయ మన అందరిదీ..ఇంకా ఆటకదరా శివా అంటూ జీవిత సత్యాన్ని చెప్పే పాట...అన్నీ నచ్చేసాయి నాకు...(చిత్రీకరణ కూడా)
                         

                        30+...40+ వారికి ఇందులో ఆకాశవాణి కార్యక్రమాలతో అప్పాదాసు పనులను లింక్ చేయడం బాగా అర్ధమౌతుంది బహుశా...చిత్రంలో సన్నివేశానికి తగినట్లుగా ఆ కార్యక్రమాల సిగ్నేచర్ ట్యూన్ (వాటిని A I R లో అలాగే అంటారు లెండి.)వినిపిస్తుంటుంది...
                        వృద్ధాప్యం మరో బాల్యం అంటూ అప్పదాసు పాత్రలో అతని అల్లరి...చపలత్వం అమాయకత్వం చూపిస్తూనే...భోజన ప్రియత్వంలో ఏ దినుసు ఎలా వాడాలో చెప్పడం ద్వారా ...అతని జిహ్వ చాపల్యాన్ని మనకి రుచిగా చెప్పారు భరణి. మీనాక్షికి సహాయం చేయటంలో ఆతని పరిపక్వత కనిపిస్తుంది...పిల్లల మీద ఉన్న ప్రేమని భార్యకి తెలియకుండా దాచుకోవడంలో గాంభీర్యం కనిపిస్తుంది...దర్శకుడు అన్ని రంగుల్లో అన్ని కోణాల్లో ఆ పాత్రని మలచడంలో సఫలమయ్యారు.
                         " నువ్వు లేనప్పుడు నీ చీర కప్పుకొని పడుకుంటాను...నేను ఎ చీర కప్పుకుంటే...నువ్వు ఆ చీర కట్టుకొని ఎదురుగా కనిపిస్తావు "అంటాడు అప్పదాసు.కనిపించని శృంగారం ఎంత ఉందొ...విరహం ఎన్ని పాళ్ళుందో చెప్పగలమా అసలు?..."ఎన్ని తిట్లైనా భరిస్తావు... పొగడ్త ఒక్కటి కూడా భరించవు కదా!."..అంటాడు...ఇలాంటివి మాటలు వ్రాయడం చాలా కష్టం.
                           భార్య ఏ చీర ఆరోజు ఉదయం కట్టుకుందో, మధ్యాహ్నం కూర ఏమి చేసిందో, ఆమె రెగ్యులర్ గా చేతికి వేసుకునే గాజులు ఎన్నో...ఇలాంటివి గుర్తుండని(గుర్తించని) భర్తలు సిగ్గుపడేలా...తన భార్య కాపురానికోచ్చిన నాటి నుంచి అప్పటి దాకా ఏ సందర్భంలో ఎ చీర కట్టిందో తడుముకోకుండా అదే ఫీల్ తొ చెప్తాడు అప్పదాసు.
                           ప్రతి ఫ్రేం లోనూ ఆమె అతన్ని ఎక్కువ ప్రేమిస్తోందేమోననే భావాన్ని పుట్టిస్తూ...అతనే ఎక్కువ ప్రేమిస్తున్నాడంటూ అతని చేతల్లో చూపించేసాడు. ఇలా చూపడం కత్తి మీద సాము వంటిదే...
                           అప్పదాసుకి తెలు కుట్టినపుడు మంత్రం వేస్తానంటూ...తర్వాత నాకే మంత్రము రాదు దేముడిని నీ బాధని నాకు ఇచ్చేయమని ప్రార్ధించాను అంటుంది బుచ్చి లక్ష్మి. ఒక్క సారి "Night of the Scorpion" గుర్తొ చ్చేస్తుంది అందరికీ...
                            ముగించే ముందు మా అమ్మమ్మ తాతయ్య గార్ల గురించి చెప్పకపోతే ఈ సమీక్ష అసంపూర్ణం 
అవుతుంది. తాత గారి వయసు 10 అమ్మమ్మ వయసు 3 సంవత్సరాల వయసు ఉన్నపుడు వారికి పెళ్లైంది.
మేనత్త మేనమామ పిల్లలు వాళ్ళు.ఒకేచోట పెరిగారు చిన్నప్పటి నుంచి.ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ, కేరింగ్.
ఎప్పుడూ అంటుండేది అమ్మమ్మ."నేను ముందుగా పోతే మీకు వండి పెట్టేవాళ్ళు...చూసే వాళ్ళు ఉండరు."..అచ్చు బుచ్చిలక్ష్మిలా. ఆయన 77 ఏళ్ళ  వయసులో కాలం చేసారు, సరిగ్గా 7 వ రోజున పసుపుకుంకుమలు తీయకుండానే అమ్మమ్మ వెళ్లి పోయింది ఆయనకు స్వర్గంలో కూడా తోడు  ఉందామని. 7 సంవత్సారాల వయసు తేడాతో 7 అంకెతో ఉన్న బంధం బహుశా 7 జన్మలదేమో అనుకున్నాను నేను...
                               

                                అస్తమానం ద్రాక్షారం సంబంధం అంటూ అప్పదాసుని హేళన చేసే బుచ్చి...ఆ సంబంధం  అసలు లేదని చెప్పేసరికి అందరికీ ఆనందంగా గెంతుతూ చెప్తాడు అప్పాదాసు.ఆ సంతోషంతోనో... జబ్బు పడిన భార్య ముందు చనిపోతున్దేమోననే బెంగ తోనో అప్పాదాసు కన్ను మూయడంతో చిత్రం పూర్తవుతుంది.
                                 
                              కథకి అనుగుణంగా  చేసిన మార్పులు కథ అందాన్ని ఎక్కడా తగ్గించలేదు.బుచ్చి లక్ష్మి పాత్రలో జాతీయ నటి 'లక్ష్మి' పరకాయ ప్రవేశం చేసింది.అప్పదాసు పాత్రలో బాలసుబ్రహ్మణ్యం నటన కూడా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ 2 గంటల కాలాన్ని వెచ్చించి తప్పక చూడదగ్గ సినిమా ఈ "మిథునం".
                              
                               త్రిపాత్రాభినయం చేసిన (కథ...మాటలు...దర్శకత్వం) భరణి గారు అభినందనీయులు...
కళాదర్శకుడు సంగీత దర్శకులు పూర్తిగా న్యాయం చేసారు. చిత్రం ఎలా ఉంది అని మళ్ళీ చెప్పాలంటారా?...
"అద్భుతః "
       

చివరగా చిన్నమాట : 'అప్పదాసు 'పాత్ర భరణి గారు చేసి ఉంటె ఇంకా బాగుండేది.నటుడిగా ఆయన్ను పలు చిత్రాల్లో చూసాక నా మనసులో పుట్టిన భావం ఇది..............
                                                                                                            @శ్రీ 





09/01/2013

కృత్రిమ బంధమేల?



మదనుని విల్లు
 
దొంగిలించి
 
కనురెప్పల నారి సారించి
 
నీ నేత్రాలు వదిలే
 
సుమశరమ్ములకి
 
ఎపుడో సమ్మోహితుడిని చేసావ్!
 

నీ బాహులతల
 
అల్లికతో
 
నీ కౌగిలి చెరసాలలో
 
రోజూ ఖైదీగా బంధిస్తావ్!
 


నీ చూపు
 
నీ మాట...
నీ హొయలు
 
నీ సొగసు
నీ ప్రేమ...
నీ అలుక
 
ఇన్ని ఆయుధాలలో
 
ఏ ఒక్కటి ప్రయోగించినా
 

ఈ సత్యాపతి కాదంటాడా?


చెంత
 
మన్మథుని కొరడా లాంటి
 
నీ వాలు జడ ఉండగా
 

ఈ పట్టు పగ్గమేల?


నీ ప్రేమకే బందీని అయిన
 
నాకు ఈ కృత్రిమ బంధాలేల?

నేనుండేది నీతోనే...
నీనడిగేది నీ తోడే...
నీ మదిలో దాగి ఉన్న
 
నా మనసునడిగి చూడు
 
నీకే తెలుస్తుంది...
నా మాటల్లో ఉన్న నిజమెంతో?
నీమీద నాకున్న ప్రేమెంతో?                  @శ్రీ
 







06/01/2013

ఎవరి ప్రేమది పైచేయి?




నీ పదముల సవ్వడి
వేల మైళ్ళ  దూరం నుంచే 
నా చెవులు ఎలా పసిగడతాయో  తెలియదు...

నీ సిగలోని పూల పరిమళం 
కోసుల దూరం నుంచే 
నా నాసిక ఎలా ఆఘ్రాణిస్తుందో తెలియదు...

నీవక్కడ నవ్విన చిరునవ్వులవెలుగులు 
ఇక్కడ నా కంటిలో 
ఎందుకు ప్రతిఫలిస్తాయో తెలియదు... 

నీవక్కడ నను తలచిన విషయానికి 
ఇక్కడ నా మనసుకి 
ఎందుకు పొర మారుతుందో  తెలియదు...

నీవక్కడ  నా చిత్రాన్ని తాకితే 
ఇక్కడ నా మేను
ఎందుకు పులకరిస్తుందో తెలియదు...


కానీ....
ఇక్కడ  నా కంట కన్నీరొలికితే 
అక్కడ నీ  చెక్కిళ్ళు 
ఎందుకు తడుస్తున్నాయో మాత్రం  తెలుసు 

నా  గుండెలోని విరహపు కాట్లు 
అక్కడ నీ  ఎదలో 
ఎందుకు పలుగు పోట్లౌతున్నాయో  మాత్రం తెలుసు.

నీ వియోగం నన్నిక్కడ అనుక్షణం  మింగేస్తుంటే 
అక్కడ నీకు ఊపిరి
ఎందుకు సలపదో మాత్రం  తెలుసు.

తెలిసీ తెలియనిదల్లా ఒక్కటే.
అర్ధమైనా...ఎప్పటికీ అర్ధం కానిదొక్కటే.
ఎవరి  ప్రేమది 'పై చేయో'?                            @శ్రీ