వలపుల్ని పంచేటి మనసొకటి కావాలి
మధువుల్ని నింపేటి పలుకొకటి కావాలి
ఏడురంగులు చూసి ఎన్నాళ్ళు అయినదో
వర్ణాల్ని వంచేటి విల్లొకటి కావాలి
పుడమిలో కణములకు గొంతెండిపోతోంది
మేఘాన్ని చరిచేటి మెరుపొకటి కావాలి
దుస్వప్నరాజ్యాన్ని తుడిచిపెట్టేయాలి
ప్రియురాల్ని చూపేటి కలయొకటి కావాలి
ఎండుటాకుల ధ్వనులు చెవికింపుగా లేవు
శిశిరాన్ని తుంచేటి చివురొకటి కావాలి
విరహమే రాహువై మదిని కబళిస్తోంది
గ్రహణాన్ని మింగేటి వెలుగొకటి కావాలి
పూలతో బాటలను నింపాలి "నెలరాజ"
ముళ్లన్ని ఏరేటి చేయొకటి కావాలి
24/10/2016
|| ఈ నాటికి - తెలుగు గజల్ ||
మరందాల మబ్బు ఒకటి కలగ దొరికె ఈనాటికి
కనుపాపకు తీపికడలి తరగ దొరికె ఈనాటికి
ప్రేమగీతి పాడేందుకు యుగాలుగా వెదికాను
పల్లవించు చరణాలే జతగ దొరికె ఈనాటికి
మనసుకున్న దాహమంత ఒక్కసారి తీరినది
చెలిమిలోని మధురిమతో చెలమ దొరికె ఈనాటికి
సరసమైన గీతాలను ఒకటొకటే నేర్పుతోంది
ఇష్టపదులనాలపించు లలన దొరికె ఈనాటికి
పేరులోని తీయదనం ఇపుడిపుడే తెలుస్తోంది
నను పిలిచే అందమైన చిలక దొరికె ఈనాటికి
వెన్నెలబాణాలేస్తూ వేధించాడిన్నాళ్ళూ
నెలరాజుని ఓడించే నెలత దొరికె ఈ నాటికి
11/10/2016
|| నా మనసును - తెలుగు గజల్ ||
నురుగుపూల వెన్నెలతో అలికినావు నామనసును
చూపులతో లడాయీలనెపుడు నేర్చుకున్నావో
తియతీయని ములుకులతో చీల్చినావు నా మనసును
కబళించే గ్రహణాలకు గ్రహణంలా పట్టినావు
కబళించే గ్రహణాలకు గ్రహణంలా పట్టినావు
నిశలంటని పున్నమిలో నిలిపినావు నా మనసును
ఫక్కుమంటు నువు నవ్వితె నక్షత్రపు జల్లులే
చీకట్లకు దూరంగా జరిపినావు నా మనసును
మదనునడిగి కొత్తకొత్త వ్యూహాలను రచించావు
అప్సరసలనోడిస్తూ గెలిచినావు నా మనసును
కనిపిస్తే వేధించక మానదనే తెలుసు నీకు
విరహానికి దొరకకుండ దాచినావు నా మనసును
వలపునేలు రాణివలే కనిపిస్తూ "నెలరాజా"
బందిపోటు దొంగలాగ దోచినావు నా మనసును
10/10/2016
|| పున్నమిపూలు ... నెలరాజు గజళ్ళు ఆవిష్కరణ ||
" ఆనందానికి అవధులు లేని వేళంటే ఇదే "
$$ ... కొన్నికొన్నివిషయాలు ఎప్పుడూ కలలోకూడా ఊహించనివే.
నేను తెలుగులో గజళ్ళు వ్రాస్తానని ,ఆ గజళ్ళను ఒక పుస్తకరూపంలో
ముద్రిస్తానని. ఒక భవ్యమైన వేడుకలో తెలుగు గజల్^కి పట్టాభిషేకం లాంటి ఒక ప్రత్యేకమైన ఉత్సవంలో ఆ పుస్తకం ఆవిష్కరించబడుతుందనీ.
$$ ... స్వప్నించని స్వప్నం సాకారమయ్యే ఆరోజు వచ్చేసింది.
$$ ... ఈ నెల 14వతేదీ (అక్టోబరు 14) సాయంకాలం 05:00 గంటలకు
మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి అద్వితీయమైన 40 వసంతాల గజల్ గమనాన్ని
పురస్కరించుకొని విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో జరుగుతున్న
కార్యక్రమంలో నా గజళ్ళ పుస్తకం " పున్నమిపూలు ...నెలరాజు గజళ్ళు "
ఎంతోమంది ప్రముఖుల సమక్షంలో ఆవిష్కృతమౌతోందని సహర్షంగా తెలియజేస్తున్నాను.
ఆత్మీయులైన మిత్రులందరినీ భవ్యమైన ఈ కార్యక్రమానికి విచ్చేసి
విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.
పుస్తకం : " పున్నమిపూలు "
ఆవిష్కరణ తేదీ : 14 - 10 - 2016.
సమయం : సాయంకాలం 05 :00 గంటలకు
వేదిక : శ్రీమతి గోకరాజు లైలా గంగరాజు కళావేదిక (ఘంటసాల సంగీత కళాశాల)
దుర్గాపురం , బావాజీపేట , విజయవాడ.(ఆంధ్రప్రదేశ్ )
https://www.facebook.com/events/1197580390281011/
భవదీయుడు
ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్.
07/10/2016
|| రాదో మరి - తెలుగు గజల్ ||
సూర్యుడు వెళిపోతుంటే రేయెందుకు రాదో మరి
రాత్రి కరిగిపోతుంటే కునుకెందుకు రాదో మరి
మనసులోన పొంగుతున్న శోకమంత ఏమైనదొ
పొడిబారిన కనులనుండి నీరెందుకు రాదో మరి
గుండెగదికి వలపు తోరణాలను కట్టేసాను
స్వప్నాలను చూపించిన చెలియెందుకు రాదో మరి
ప్రేమికులను ప్రతీక్షణం వేధిస్తూ ఉంటాయి
వెన్నెలకీ విరహానికి విసుగెందుకు రాదో మరి
బాధలున్న కడలిలోన వేనవేల తూఫానులు
తీరానికి నను చేర్చే పడవెందుకు రాదో మరి
కదలననే యుగాలన్ని మదికి భారమౌతున్నవి
ప్రేమరూపి వరమిచ్చే రోజెందుకు రాదో మరి
కాంతులకై నిరీక్షించు వేళలోన "నెలరాజా"
చీకట్లకు చూపులపై జాలెందుకు రాదో మరి
03/10/2016
|| వింత కాదు - తెలుగు గజల్ ||
వెన్నెలలో నిలువెల్లా మునిగినాను వింతకాదు
నేలస్పర్శ తెలియని సుకుమారపు పాదాలు తనవి
బాటపైన వసంతాన్ని జల్లినాను వింతకాదు
సౌందర్యపు వాహినిలా నా కనులకు కనబడింది
చూపులన్ని నౌకలుగా చేసినాను వింతకాదు
రెప్పలపై చుంబిస్తూ నేనే తన ప్రాణమంది
కలగన్నానేమోనని తలచినాను వింతకాదు
తలంబ్రాల వేడుకలో తన తలపై జార్చాలి
నక్షత్రాలెన్నిటినో తెచ్చినాను వింతకాదు
చందమామ కబురంపెను తనయను చేపట్టమని
పున్నమినే కట్నంగా కోరినాను వింతకాదు
ప్రేమరాణి త్వరలోనే వస్తుందని నెలరాజా
మనసంతా పుప్పొడితో అలికినాను వింతకాదు
27/09/2016
|| ఉన్నదోయి - తెలుగు గజల్ ||
పాదాలకు
పట్టుదలను పూయాలని ఉన్నదోయి
గమ్యాలకు వందనాన్ని
నేర్పాలని ఉన్నదోయి
ద్వేషంతో రగులుతున్న
వారిని గాలించాలి
వలపుచువ్వతో వాతలు
పెట్టాలని ఉన్నదోయి
ముడిరవ్వలతో సమమే భాషలోని
అక్షరాలు
సద్భావముతోటి సానపెట్టాలని
ఉన్నదోయి
మమతకన్న త్వరితంగా మదిలోపల
పెరుగుతుంది
అహంకారమనే కలుపునేరాలని
ఉన్నదోయి
ప్రబలుతున్న హింసచూసి
కన్ను చెమ్మగిల్లుతోంది
విశ్వశాంతి నెలకొంటే
చూడాలని ఉన్నదోయి
మూఢభక్తులందరికీ కొత్తదారి
చూపాలి
మానవతకు ఒక కోవెల కట్టాలని
ఉన్నదోయి
ప్రేమశరములన్నిటినీ
సంధిస్తూ "నెలరాజా"
పగలకు గాయాలెన్నో చేయాలని
ఉన్నదోయి
Subscribe to:
Posts (Atom)







