పూతనను చంపుట గొప్పకాదు కృష్ణా!
నాలోని కామ రక్కసిని చంపి చూపవయ్యా!
బండిని కూల్చుట ఏమి గొప్ప గోవిందా!
నా బాధ్యతల బండిని మోసి చూపవయ్యా!
సుడిగాలిని చుట్టేసానని గర్వం ఎందుకు గదాధరా!
మోహపు దారినుంచి నాదారి మళ్ళించి చూపవయ్యా!
లేగదూడను చంపి పొగడ్తలందుకోవడం కాదు ముకుందా!
నాలోని క్రోధగుణాన్ని అణగార్చి చూపవయ్యా!
కొండచిలువను చీల్చడం ఏమి ప్రతాపం పురుషోత్తమా!
నాలోని లోభగుణాన్ని చీల్చి చూపవయ్యా!
ఖరాన్ని చంపడం ఏమంత పెద్ద పని పంకజనాభా!
నాలోని మదాన్ని దునుమాడి చూపవయ్యా!
బకాన్ని సంహరించడం బాలుర పని భక్తరక్షకా!
నాలోన్ని మాత్సర్యాన్ని తెగనరికి చూపవయ్యా!
కాళీయునిపై నాట్యం చేయుట బ్రహ్మవిద్య కాదు బ్రహ్మాండ నాయకా!
నాలోని పాపాలఫణిని పాతాళానికి తొక్కి చూపవయ్యా!
మద్దిచెట్లను కూల్చడానికి నీకు రోలు సాయపడింది మురారీ!
నాలో పెరిగిన అహంకారాన్ని ఎలా కూలుస్తావో చెప్పవయ్యా!
కుబ్జకున్న వక్రాలు తీసావేమోగాని కౌస్తుభధరా!
నా వక్రబుద్ధిని సరి చేసి చూపవేమయ్యా!
ఎద్దుని చంపి ఎదురులేదని గర్వించకు గరుడధ్వజా!
నాకెదురు లేదనే గర్వాన్ని అణచి చూపవయ్యా!
అశ్వాన్ని చంపి వీరత్వాన్ని చూపకు వనమాలీ!
ఇలా నిన్ను ప్రశ్నించే నా అల్పత్వాన్ని క్షమించి చూపవయ్యా!
( కృష్ణుడు బాల్యంలో చంపిన రాక్షసులకంటే మనుషుల లోని
ReplyDeleteఅవగుణాలు,అరిషడ్వర్గాలు... ఇంకా శక్తివంతమైనవని..
వాటిని సంహరించమని ఆ కృష్ణుని వేడుకొంటూ చేసిన నిందాస్తుతి.. @శ్రీ )
శ్రీ గారు చాలా చాలా బాగుంది మీ నిందాస్తుతి...
ReplyDeletekeep writing..
-- జై శ్రీ కృష్ణ
బోలెడు ధన్యవాదాలు సాయీ!
Deleteనిందాస్తుతి నచ్చినందుకు...
@శ్రీ
Excellent !!
ReplyDeletecomparison chaalaa baavundi..Sreenivas gaaru.
ధన్యవాదాలు వనజ గారూ!
Deleteమీకు నా కవితాభావం నచ్చినందుకు...
@శ్రీ
నిందాస్తుతి చాలా బాగుందండీ..
ReplyDeleteకృష్ణయ్యకి మంచి పనులు అప్పగించారు!!
ధన్యవాదాలు రాజి గారూ!
Deleteకవిత మీరు మెచ్చినందుకు.
మనకి సాధ్యపాడని ఈ పనులు ఆయనకే అప్పగించాలి...
@శ్రీ
శ్రీ గారూ, నిందాస్తుతి అనేది కుడా బక్తి బావనే కదా కాని ఆ భక్తిలో ఓ విదమైన దగ్గరితనం కనిపిస్తుంది. మిత్రులంతా మొదట మీ బ్లాగ్ దర్శించి ఈ సారి కన్నయ్య ఏమి కొంటె పని చేసాడో చూసి తర్వాతా మిగతా కవితలు చూస్తున్నారు అనుకుంటా, సర్, బాగ రాస్తున్నారు.
ReplyDeleteనాకు గుర్తు లేదు పద్యం ఏదో ఉంది...
Deleteప్రేమలో భక్తిలో యుద్ధంలో రా అనవచ్చు అని...
(అంటే దగ్గర తనం ఉండవచ్చు)
ధన్యవాదాలు ఫాతిమా గారూ!
మీ విశ్లేషణకి...
@శ్రీ
శ్రీ గారు!
ReplyDeleteచాలా బాగుంది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో, ది బెస్ట్ పోస్ట్.
(అంటే పాత పోస్ట్స్ నాసిరకం అని కాదు :)
హర్ష గారూ!
Deleteపొంగి పోయి బరువు పెరిగిపోతున్నాను...:-))
ధన్యవాదాలు మీ ప్రశంసకి...
@శ్రీ
నిందాస్తుతి చక్కగా రాశారు, అభినందనలు. నేను కూడా ఎప్పుడన్నా సుమా మీద ప్రయత్నిస్తా,
ReplyDeleteశ్రీ గారు.hi.
ధన్యవాదాలు భాస్కర్ గారూ!
Deleteమీకు కవిత నచ్చినందుకు...
మీ కవితల్లో సుమానిందాస్తుతి చాలావరకు కనిపిస్తుంది సుమా!
ప్రత్యేకంగా ఎందుకండీ!..:-)
అయినా వ్రాసేయండి...చదివేస్తాం...:-))
@శ్రీ
శ్రీ గారు.....
ReplyDeleteభలే ఉంది అండీ...:-)
-- జై శ్రీ కృష్ణ
సీతగారికి నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు...
Deleteకృష్ణం వందే జగద్గురుమ్....
@శ్రీ
రాక్షసులలో ఒక్కొక్క చెడ్డ గుణాన్నీ ఇమిడ్చి వాటిని తాను సం హరించి చూపాడు కదా....!!
Deleteఅలాగే మనలో చెడు గుణాలు ఉంటే అలాగే నాశనం అవుతారని చెప్పకనే చూపించాడు కదా అండీ కృష్ణుడు.
మనల్ని సరిదిద్దుకోవడం మన చేతుల్లో పెట్టి నేనంతా చూస్తున్నా అంటాడు కదా ఆయన...!!
మరలా ప్రత్యేకించి ఆయనే చేయాలంటారా ఇలా??
ఏమీ అనుకోకండి శ్రీ గారు....
నిన్న అంతా ఆలోచించాను నాకు పైలా అనిపించింది ...
కాస్త చెప్పగలరా?
దయచేసి తప్పు గా అనుకోవద్దు.
అన్ని అవగుణాలను మనం జయించగలిగితే మనం భగవత్సమానమే అవుతాము...
Deleteఅప్పుడు రాముడు కృష్ణుడు అని పురుషోత్తములుగా వాళ్ళని అసలు గుర్తు చేసుకోమేమో!.:-)
అన్నిటినీ జయించినవారు వేరే భగవంతుని పూజించక్కర్లేదు
ఎందుకంటే అలాంటి సత్పురుషులని మనం పూజించడం మొదలు పెడతాం...(భగవత్స్వరూపంగా)
మన పరిస్థితి వేరు..అవసరానికైనా అబద్ధం ఆడని ఒక్క రోజుండదు మన జీవితంలో...
పరిక్షలకెడుతూ భగవంతుని ఎందుకూ ప్రార్థించడం?
మన తెలివితేటలమీద కదా ఆధారపడాలి...
అలాగే మన అవలక్షణాలను తీసేయడానికి భగవంతుని సహాయం
అర్థిస్తున్నామిక్కడ అంటే గానీ కృష్ణయ్య వచ్చి తీసేయాలని కాదు...:-)
ఆఖరి వాక్యం లోని క్షమాయాచన చదివితే మీకు తెలుస్తుంది...
అదీ గాక మీ ప్రశ్నలోనే మీ సమాధానం ఉంది...
రాక్షసులకు ఆ దుర్గుణాల వలెనే మృత్యువు వచ్చింది కదా!
మరి అవి ఉంటే నాశనం అవుతామని గ్రహించి వాటినే తీసేయడానికి కృష్ణయ్య సహాయం కావాలని
వేడుకోవడం...
సీత గారూ! ఎన్ని రూపాలలో పూజించినా మంచి అంటే దేముడు...చెడు అంటే రాక్షసుడు...
మనలోని చెడు పై మంచి గెలవాలి. యుద్ధంలో మంచి వైపు పరమాత్మ ఉన్నాడు కనుక ఆయనే
తీస్తాడు మన చెడు గుణాలని....
గీతాసారంలో అన్నిటికీ నేనే అంటూ నువ్వు నీ కర్మ చేయాలంటాడు ఆయన...
మరి అపుడు అన్నే ఆయన మీద పెట్టేస్తామా? మన ప్రయత్నం మనం చేస్తామా?
ఈ చర్చ చాలా పెద్దది అయ్యేలా ఉంది.. మీకు ఇంకా సందేహం ఉంటే మీ ప్రతిస్పందనకి ఎదురు చూస్తుంటాను...
ధన్యవాదాలు...@శ్రీ
శ్రీ గారు...ఇంక పెద్దది కాదు లేండి.ఇద్దరి భావం ఒకటే.
Deleteవిడమరిచి చెప్పినందుకు ధన్యవాదాలు :-)
కామ,క్రోధ లోభ,మోహ,మద,మాత్సర్యాలను తొలగించుకోవాల్సిన అవసరాన్నినొక్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.
ReplyDeleteరవి శేఖర్ గారూ!
Deleteమీ వ్యాసాల ప్రభావం సార్...:-)
అరిషడ్వర్గాలను జయిస్తే అంతకంటే కావల్సిందేమిటి?
మీ అభినందనలకు...కృతజ్ఞుడిని...
@శ్రీ
చిత్రాలు,కవిత బాగున్నాయి....
ReplyDeleteకృష్ణప్రియ
ఏమిటి ప్రియ గారూ!
Deleteఈమధ్య శీతకన్నేసారు నా బ్లాగ్ మీద?
ధన్యవాదాలు చిత్రాలు...కవిత మీకు నచ్చినందుకు...
@శ్రీ
రాక్షసుల కంటే ప్రమాదకారులైన మానవులలోని చెడుని సంహరించి, మంచిని ప్రసాదించమని
ReplyDeleteశ్రీ కృష్ణుడిని వేడుకుంటూ రాసిన కవిత చాలా...చాలా...బాగుంది 'శ్రీ' గారు!
అవును నాగేంద్ర గారూ!
ReplyDeleteమనవులలోని ఆ చెడు గుణాలు నశిస్తే...
లోకకల్యాణమే కదా!
బోలెడు ధన్యవాదాలు మీ స్నేహపూర్వకమైన ప్రశంసకి...
@శ్రీ
శ్రీకృష్ణచరితము కళ్ళకు కట్టేస్తున్నారు మీ కవితలలో. అభినందనలు
ReplyDeleteసృజన గారూ!
Deleteఎనిమిది భక్తి సుమాలు ఆయనకి అర్పించాలనే చిన్న ప్రయత్నంలో
మిత్రమండలి సహకారంతో ప్రోత్సాహంతో పురోగమిస్తున్నాను.
మీ ప్రశంసకి ధన్యవాదాలు..
@శ్రీ
అందమైన చిత్రాలతో,
ReplyDeleteఅద్భుతమైన భావాలతో
భక్తి శ్రధ్ధలతో...అలరించారు.
పద్మ గారూ!
Deleteకవితలోని భావాలు మీకు నచ్చినందుకు,
మీ ప్రశంసకి ధన్యవాదాలు...
@శ్రీ
చిన్ని కృష్ణుని ప్రతాపాలకి పరమార్ధం మనిషిలోని రాక్షస గుణాలని సం"హరి"ంచటమే అని చక్కగా చెప్పారీ కవితలో.
ReplyDeleteచాలా బాగుంది.
పెయింటింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇండియన్ ఆర్టిస్ట్ వేసినవేనా అనిపించింది ఎందుకో.
మీ ప్రశంసకి ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
ReplyDeleteఈ కవితలోని చిత్రాలన్నీ వెన్నెల గారు పంపినవి...
చిత్రకారులెవరో తెలియదు కానీ మీరన్నట్లు చాలా బాగున్నాయి చిత్రాలు..
@శ్రీ