05/11/2016

|| ఎప్పుడూ సరికాదు - తెలుగు గజల్ || అనువదించిన గజల్



జనాబ్ నిదా ఫాజలీ జీ రచించిన ఒక అద్భుతమైన గజల్ ని అనువదించే 
ప్రయత్నం చేసాను. అనువాదంలో స్వేచ్ఛ తీసుకోకుంటే భావాలు 
ఎప్పుడూ మాచ్ అవ్వవు. మూలానికి అతి దగ్గరగా నా అనువాదం 
ఉండేలా చూసుకున్నాను 

|| ఎప్పుడూ సరికాదు - తెలుగు గజల్ || అనువదించిన గజల్ 

వదిలేటి పొగలతో  చంద్రుడిని కమ్మడం ఎప్పుడూ సరికాదు 
పసివారి స్వప్నాల్ని నిలువునా దోచడం ఎప్పుడూ సరికాదు

ప్రాణాలు వదిలాక ప్రేమికుల సంగమం దాదాపు దుర్లభం 
ఆత్మలెగిరే దార్లు ఒకటవక పోవడం ఎప్పుడూ సరికాదు 

భూమిపై  జీవించి ఉండేది తక్కువని ఎవరికీ తెలియదు
పదునాల్గు వర్షాల్ని బాల్యాన గడపడం ఎప్పుడూ సరికాదు 

నువు నమ్మినటువంటి ధర్మాన్ని పాటించి జీవనం సాగించు 
గోప్పోళ్ళ సూక్తులను వల్లిస్తు ఉండడం ఎప్పుడూ సరికాదు 

ఏకాంత వేళలో నీలోని నీవుతో అపుడపుడు మాట్లాడు 
సభలున్న ప్రతిచోట హాజరౌతుండడం ఎప్పుడూ సరికాదు 

తన్హాయి కనబడితె ఎగిరొచ్చి వాలిపోతుంటాయి "నెలరాజ"
నిదురించు తలపుల్ని మేల్కొల్పుతుండడం ఎప్పుడూ సరికాదు  #శ్రీ 

                                  ***
మూలం :  

जनाब निदा फाजली की गजलें सभी को पसंद है 
उन गजलों में एक मोतीको आपके सामने लाया 
और तेलुगु में अनुवाद भी प्रस्तुत कर रहा हूँ | 

धुआँ उड़ाकर चाँद बुझाना अच्छी बात नहीं 
बच्चों के सपनों को चुराना अच्छी बात नहीं

जिस्मोंके बाहर भी मिलना जुलना नामुमकिन है 
रस्ते में  रस्ता कतराना अच्छी बात नहीं

उम्र ही कितनी मिलती है दुनिया में जीने को 
इस पर चौदह साल गवाना अच्छी बात नहीं

तेरा अपना जिया हुआ ही तेरा अपना है 
औरों की बाते दोहराना अच्छी बात नहीं

कभी अकेले में खुद से भी बाते करके देख 
हर महफ़िल में आना - जाना अच्छी बात नहीं

तन्हाई में भूली बिसरी यादें बसती है 
सोतोंको नींद से जगाना  अच्छी बात नहीं
 

03/11/2016

|| వారెవ్వరు - తెలుగు గజల్ ||



|| వారెవ్వరు - తెలుగు గజల్ || 

తొలకరిలో చినుకుపూలు జల్లుతున్న వారెవ్వరు 
హరివింటిని రంగులలో వంచుతున్న వారెవ్వరు

చీకటిలో మగ్గుతున్న తిథులు వెలిగిపోతున్నవి 
ఈ జగతిని వెన్నెలలో ముంచుతున్న వారెవ్వరు

పాకుతున్న పురుగొక్కటి రెక్కలొచ్చి ఎగురుతోంది 
సీతకోక చిలుకలాగా మార్చుతున్న వారెవ్వరు 

పడిలేచే తత్వానికి గురువులాగ అనిపించును 
కెరటానికి పట్టుదలను నేర్పుతున్న వారెవ్వరు

కిరణాలే కుంచెలైతె బిందువులే రంగులగును
సప్తవర్ణ చిత్రాలను  గీయుచున్న వారెవ్వరు

నిశలనాక్రమించేందుకు గుంపులుగా ఎగురుతాయి  
కాంతుల దివిటీలెన్నో మోయుచున్న వారెవ్వరు 

తారలకళ్ళకు గంతలు కట్టివేసి  "నెలరాజా" 
కలువలతో సరసాలను ఆడుతున్న వారెవ్వరు

02/11/2016

|| మరువలేను - తెలుగు గజల్ ||






మొదటిసారి నినుచూసిన సమయమెపుడు మరువలేను 
మనసులు పెనవేసుకున్న రేయినెపుడు మరువలేను

పాణిగ్రహణమైనట్లే అనిపించిన కాలము అది 
చేతిలోన చేయేసిన వేళనెపుడు మరువలేను

మార్చుకున్న దండలలో పూలు వాడవెప్పటికీ  
కళ్యాణము చేసుకున్న ఘడియనెపుడు మరువలేను

మౌనంతో చంపాలని ఎందుకు అనుకుంటావో
ప్రాణమంటు నను పిలిచిన పిలుపునెపుడు మరువలేను 

సుదూరాన నీవుంటే చిత్రవధే "నెలరాజా" 
ఒక్కటిగా కరిగించిన రాత్రినెపుడు  మరువలేను






|| కనిపిస్తూ ఉంటావు - తెలుగు గజల్ ||



విచ్చుకున్న వెన్నెలలా కనిపిస్తూ ఉంటావు ( ఉంటావూ ) 
నిను మాత్రమె చూడాలని కలహిస్తూ ఉంటావు

కన్నులలో శ్రీరాగము ఎలా గొంతు విప్పినదో 
చూపులలో సరసపదిని వినిపిస్తూ ఉంటావు

*వలపుపూల శరములతో గుండెను భేదిస్తావు
రేకులతో నీ పేరును ముద్రిస్తూ ఉంటావు

షాయరీలతో దోస్తీ కలమెప్పుడు చేసినదో
ప్రేమగజళ్ళెన్నిటినో వ్రాయిస్తూ ఉంటావు

వియోగాల జ్వాలలన్ని ఆర్పుటెలా తెలిసిందో 
నీ నవ్వుల మేఘాలను పంపిస్తూ ఉంటావు

విరహంతో వేగుతున్న మనసునెపుడు చూసావో
హేమంతపు హృదయంతో స్పర్శిస్తూ ఉంటావు

నా మదిలో మోదాలను పండిస్తూ "నెలరాజా" 
ఖేదాలకు చుక్కలనే చూపిస్తూ ఉంటావు

పూర్వం రాజులు బంగారపు మొనలున్న బాణాలను , ఇనుపబాణాలను(నారాచము)... ఇంకా వేర్వేరు ముఖాలు , గుర్తులు ఉన్న బాణాలను శత్రువులపై ప్రయోగించేవారు . అలాగే వాళ్ళ వాళ్ళ పేర్లు ఉన్న 
బాణాలను ప్రయోగించేవారు . ఇక్కడ అదే భావాన్ని ప్రేయసి ప్రయోగించిన 
వలపుపూల బాణాలు గుండెను చీల్చాయనీ , ఆ పూల రేకులపై ఉన్న ఆమె పేరు 
గుండెలో ఎన్నోసార్లు ముద్రించబడినదని వ్రాసాను. రస హృదయలు ఈ షేర్^ని ఆస్వాదిస్తారని ఇలా విపులంగా ఈ షేర్ గురించి చెప్పాను 

30/10/2016

|| వింటవి కన్నులు - తెలుగు గజల్ ||



రాత్రులలోనే తీయనికలలను కంటవి కన్నులు ప్రేయసి కళలను రెప్పలలోనే దాస్తవి కన్నులు అందాలెన్నో కనబడుతుంటే ఊరకనుండవు చూపుల దొంగల సాయంతోనే దోస్తవి కన్నులు కోరిన నెచ్చెలి రూపును చూస్తే కాంతుల మునుగును వెన్నెలవెలుగుల లేఖలనెన్నో రాస్తవి కన్నులు చెలి అందాలను పొగడాలంటే మాటలు ఎందుకు ? సైగలతోనే వర్ణనలెన్నో చేస్తవి కన్నులు ప్రేమే దేవిగ ఎదురుగ నిలిచిన పూజలు చేయును ఆరాధనతో హారతులెన్నో ఇస్తవి కన్నులు మెత్తని చూపుల తూపులనెన్నో సంధిస్తాయి గుండెను గుచ్చే బాధలముళ్ళను తీస్తవి కన్నులు సరసం చిందే సమయంలోనే ఓ నెలరాజ రెప్పలనల్లిన రెప్పల ఊసులు వింటవి కన్నులు

27/10/2016

|| జాబిలెచట ఉంటుంది - తెలుగు గజల్ ||




నల్లరంగు పూసుకున్న జాబిలెచట ఉంటుంది చీకట్లను తరమలేని పున్నమెచట ఉంటుంది తపిస్తున్న కణాలన్ని కంటబడితె ఊరుకోదు తీరాలను ముద్దాడని కెరటమెచట ఉంటుంది గ్రీష్మమెళ్లిపోగానే మేఘాలను మథిస్తుంది అంకురాన్ని గెలిపించని తొలకరెచట ఉంటుంది ఎంత మధువు తాగిననూ తనివితీరదనుకుంటా పూబాలలపై వాలని తుమ్మెదెచట ఉంటుంది పూర్వభూమిలో చిందే రుధిరానికి భయపడడదు తమస్సుతో పోరాడని ఉదయమెచట ఉంటుంది తనువునొదిలి ఎగిరేందుకు ఎప్పటికీ సిద్ధపడదు మృత్యువు వలలో చిక్కని ప్రాణమెచట ఉంటుంది అల్లుకున్న నెలరాజుని ఏనాడూ నిందించవు వెన్నెలపై మండిపడని తార ఎచట ఉంటుంది

25/10/2016

|| చూడాలి నేస్తమా - తెలుగు గజల్ (అనువాదపు గజల్ ) ||




ప్రముఖ గజల్ కవి , సినీగీతాల రచయిత నిదా ఫాజలీ రచించిన గజల్^ని 
అనువదించే ప్రయత్నం చేసాను. అనువాదంలో స్వేచ్ఛ తీసుకోవడం ఎప్పుడూ తప్పనిసరే. 


ఎండలో మండుతూ మబ్బులో స్నానించి చూడాలి నేస్తమా 
జీవితం ఏమిటో చదువుల్ని తప్పించి చూడాలి  నేస్తమా  

కళ్లుంటె సరిపోదు లోకాన్ని చూడాలి అనుకొనేవారికి 
గుండెచప్పుడులోని చూపుల్ని సారించి చూడాలి నేస్తమా

రాళ్ళలో హృదయాలు మాటాడుతుంటాయి ఒకసారి వినిచూడు 
నీ ఇంటి గోడలకి ఒకటొకటి అతికించి చూడాలి నేస్తమా  

మెరిసేటి తారల్ని చెలి తనువులో తాను నింపింది కాబోలు 
కనులలో వెలిగేటి దీపాల్ని తప్పించి చూడాలి  నేస్తమా

నీలాల నింగిలో నెలరాజు అందడని ఎప్పుడూ అనుకోకు 
కనబడితె చేతుల్ని తనవైపు కదిలించి చూడాలి నేస్తమా    


निदा फाजली की गजल  :

धूप में निकलो घटाओं में नहाकर देखो 
जिन्दगी क्या है किताबों को हटाकर देखो 

सिर्फ आँखों से ही दुनिया नहीं देखी जाती 
दिल की धड़कन को भी बीनाई बनाकर देखो 

पत्थरों में भी जबाँ होती है , दिल होती है 
अपने घर के दर - ओ - दीवार सजाकर देखो 

वो सितारा है चमकने दो यूं ही आँखों में 
क्या जरूरी है उसे जिसम बनाकर देखो 

फासला नज़रों का धोका भी तो हो सकता है 
चाँद जब चमके ज़रा हाथ बढ़ाकर देखो