30/06/2012

ఏకంలో అనేకమా?...అనేకంలో ఏకమా?...






ఒక పుష్పం తావి 
మరో  పుష్పానికి లేదు...
ఒక వస్తువు  రంగు
మరొక  వస్తువుకి  లేదు...
ఒక  మనిషి  రూపు
మరో  మనిషికి  లేదు ...
అయినా భిన్నవర్ణాల  మేళవింపుతో  ప్రపంచం 
కంటికి ఇంపుగా కనిపిస్తుంది.


నింగి,నేల ఒకే వర్ణంలో ఉంటే
ఒకదానికొకటి ప్రతిబింబాలేమో
అని భ్రమిస్తామేమో!

అందరి మనసును ఆహ్లాదపరిచే
సప్తవర్ణాల ఇంద్ర ధనసు ఏర్పడేది
శ్వేత వర్ణం, వర్షపు బిందువులో వక్రీభవిస్తేనే కదా!
సప్త స్వరాలు వేరైనా 
అవి కలిస్తేనే కదా సుమధుర సంగీతం!

ప్రకృతిలో స్త్రీ ,పురుషులు వేరైనా,
వారి భావాలు, ఇష్టాలు వేరైనా, 
వారిద్దరి మధురమైన కలయికలోనే కదా
మరో జీవి ప్రాణం పోసుకోనేది!

పగలు... 
కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగుతో ప్రకాశిస్తే,
రాత్రి...
అంధకార బంధురంలో మునిగిపోతుంది.
అవి రెండూ కలిస్తేనే కదా ఒక దినం ఏర్పడేది!

జన్మ వెలుగైతే...
మృత్యువు చీకటి...
ఈ రెంటి మధ్యే కదా జీవితం!

తెలుపు నుండి నలుపు వరకూ ఉండే జీవితంలో
అసంఖ్యాకమైన వర్ణాల్లో మునిగి తేలుతుంటాం.
పరస్పరం విరుద్ధమైన భావాలతో కనిపించినా,
వాస్తవానికి ఒకదానికింకోటి పూరకమే!

భిన్నత్వంలో ఏకత్వం.
ఏకత్వంలో భిన్నత్వం.
ఇదే జీవన తత్వం
ఇదే గ్రహించాల్సిన సత్యం.           @శ్రీ 

26/06/2012

తెలిసీ....అలిగితే ఎలా???




నీకోసం వ్రాసే కవితలన్నీ
నీకు అందించమంటూ
తరచి తరచి అడుగుతుంటావు.

శ్వేత కపోతాలకై
మొదలెట్టాను వేట.
సిద్ధం చేసుకున్నాను...
కట్టేందుకు పట్టు తాళ్ళు.
లేఖలు గమ్యం చేరవేమో
అనుకుంటూ భయపడ్డాను.

ప్రతి కవితనీ 
అందమైన పత్రాలపై వ్రాసాను...
శ్వేత సరోజాల రేకులను
రెక్కలుగా చేసాను...
హరివిల్లుని కొంచెం కిందికి దించి
ఆ వర్ణాల్లో ముంచి తీసాను...
వాటి అందానికి 
నాలో నేనే మురిసి పోయాను...
నా మనసు వేగాన్ని
ఆ లేఖలకిచ్చేసాను...

సుధాంశుని అంశవైన 
నీ ముందు వాలిపోయాయి..
ప్రణయ రాగ వాయులీన నాదాలకి
పరవశించాయి...
రెక్కలు విప్పి 
సిరివెన్నెల నాట్యంలో భాగమయ్యాయి...

నాకోసమే  వ్రాస్తానని
మోసం చేసానన్నావు...
అన్నీ  మనిద్దరి కోసం 
వ్రాసానని  అలిగి కూర్చున్నావు...

నీకోసం వ్రాద్దామనే మొదలెడుతున్నాను...
ముగింపు మాత్రం 'నువ్వు-నేనుతోనే పూర్తవుతోంది...
నా ప్రతికవితకి ఊహవు నీవైతేఉత్తేజం నేనని,
నీతోనే నేను సంపూర్ణం అని
నీకు తెలిసీ....అలిగితే ఎలా???      
(చిత్రం ఆధారంగా అల్లిన అక్షర మాలిక...@శ్రీ )

21/06/2012

మనసుని హరించే విద్య నేర్పవూ???






ప్రవాహాలలో చురుకుగా కదిలే 
మీనాల పదచిహ్నాలు
లెక్కించడం వచ్చు నాకు... 


చిక్కటి నిశీధిలో 
కనిపించని నల్లని అంధకారాన్ని  
వెదికి పట్టుకోవడం తెలుసు నాకు...

మిరుమిట్లు గొలిపే వెలుతురులో 
మిణుగురుల కదలికను గుర్తించడం
వెన్నతో పెట్టిన విద్య నాకు...

కంటికి తెలియకుండా 
కనుపాపను సైతం 
దొంగిలించగల నేర్పు
ఈ మధ్యే అలవడింది నాకు...
   
ఇన్ని నేర్చుకున్నా 
నీ ప్రావీణ్యం ముందు 
నా కౌశలం తల వంచింది...


అందుకే...
నీకు మాత్రమే తెలిసిన...
"మనసుకి తెలియకుండా  
మనసుని హరించే విద్య"
నాకు కూడా కాస్తంత నేర్పవూ??? 

          


16/06/2012

మా నాన్న...



పిల్లల్ని నవమాసాలు మోసిన అమ్మ గొప్పతనం ఒక వైపుంటే,
ఆ సంతానాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే నాన్న గొప్పతనం వేరొకవైపు ఉంది.



మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,
ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా!

దెబ్బ తగిలితే అమ్మా!అంటూ అరుస్తాం...
కాని మందు వేయించేది నాన్నే కదా!



పాకెట్ మనీ కోసం రికమండేషన్ చేసేది అమ్మ  అయితే..
మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా!

చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది...
సమస్య జటిలమైతే పరుగెత్తేది నాన్న వద్దకే కదా!






భూదేవంత ఓర్పు, సహనం  అమ్మదైతే 
ఆకాశమంత   ఔన్నత్యం  నాన్నది.
చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం...
పెద్దయ్యాక కనీసం  ఆ రెక్కల భారాన్ని పంచుకునే 
ప్రయత్నం కూడా చేయం...




కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
ఆ కొబ్బరి నీళ్ళ  తీపి...
ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
నాన్నను ఎప్పటికీ వదలం....





'అమ్మ' వర్తమానాన్ని చూస్తే...
మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేదీ,
మనకు లక్ష్యాలను  చూపేదీ,
వాటిని సాధించుకొనేందుకు  బంగారు  బాటలు వేసేది  'నాన్నే' కదా!



                             (నేను పురుషుడిని కావటం వలన ఈ కవిత వ్రాయలేదు...
                             నాకు దొరికినట్లుగా మంచి తండ్రిని పొందిన ప్రతి ఆడవారు, మగవారు 
                             నాతొ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను....ఈ నెల 17వ తేదీ "ఫాదర్స్ డే "
                              సందర్భంగా మా నాన్న కోసం వ్రాసిన చిరు  కవిత...@శ్రీ )


13/06/2012

చావు....మిస్టరీ




ప్రతి ఆదివారం జరుగుతోంది 
అదే తంతు...
సరిగ్గా ఉదయం పదకొండయ్యేసరికి...


ఆ ఆసుపత్రి  I C U లో జరుగుతోందీ ఘటన...
ఆ  మంచం మీద పడుకున్న వారెవ్వరూ 
చావునుంచి తప్పించుకోలేక పోతున్నారు. 

ఇదేదో 'మానవాతీత శక్తి చేసే పని' అని
అందరు డాక్టర్లు అనుకున్నారు.
బైటనుంచి ప్రఖ్యాత వైద్యులని పిలిచారు...
వాళ్ళని బృందంగా చేసారు...

ఆదివారం వచ్చింది...
మంచానికి దూరంగా  చాటుగా నక్కి 
కూర్చున్నారంతా...

పరిశోధన మొదలైంది...
తొమ్మిదయింది...టెన్షన్ మొదలైంది...
పదయింది...పదిన్నర అయింది...
సరిగ్గా పదకొండు అవడానికి 
ఐదు నిముషాలు మాత్రమే ఉంది...
అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి..
ఇంకో ఐదు నిముషాల్లో 
మరో చావు చూడాలేమోనని భయపడుతున్నారు...

ఇంతలో వచ్చింది 'ఆదివారం పార్ట్ టైం స్వీపర్' 
రాములమ్మ...
నెమ్మదిగా ఆ మంచం దగ్గరికొచ్చింది...
చేతి సంచిలోని మొబైల్ తీసింది...
చార్జర్ తీసింది...
......
......
.....
ఆ బెడ్ కి ఉన్న life support system ప్లగ్ తీసింది...
అందులో చార్జర్ పెట్టి ...కూనిరాగం తీస్తూ 
చీపురందుకుంది........  :-)




తొలకరి జల్లు



నల్లని మబ్బులు నెమ్మది నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి..
వెలుతురును  మింగేసే చీకటిలా....

కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని బయలుదేరిన శచీంద్రుని 
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీ ,మృదంగ ధ్వనులతో.....

ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని  వెంట బడుతూ,
చుట్టుకుంటున్న  విద్యుల్లతల మెరుపులతో....
  
సాయం సంధ్యలో దేవ సేనాని   మయూరం
పురి విప్పినట్లుగా...
సప్త వర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...

ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం 
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి 
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటి వంతెన వేస్తున్నట్లు 
కురిసింది
తొలకరి జల్లు.

( నిన్న సాయంత్రం కురిసిన తొలిజల్లుని చూస్తూ అల్లిన కవిత.. @శ్రీ )

11/06/2012

ముద్దాడుతున్నాయి మరి....


  

నా  పేరు 
"పవన్ ,
ఫాల్గున్, 
బాలు, 
భార్గవ్, 
మురళి "
వీటిల్లో  ఏదీ కాలేదు ఎందుకో???

నా పేరు మార్చేసుకుందామని  ఉంది .
ఎందుకంటావా ?

ఆ  పేర్లు  పలికిన ప్రతీ సారీ 
ఆ పేర్లలోని మొదటి  అక్షరాలు 
నీ  పెదవులను  ముద్దాడుతున్నాయి మరి...


..............
.........
............
..........

(కవిత చదివిన ప్రతి వారూ ఒక్కసారి ఈ పేర్లు పలికి చూస్తారు)
:-)....:-).....:-).......:-) :-)....:-).....:-).......:-):-)....:-).....:-).......:-)



08/06/2012

నా వశంలో లేని 'నా మనసు'

చీకటి తెరలను పటాపంచలు చేస్తూ
తీవ్ర గతితో  ధరిత్రిని తాకేందుకు తొందరపడే 
భానుని తొలి కిరణంలా....

రెప్పలు తెరిచి ఆకాశం వంక ఆశగా చూసే 
ముత్యపు చిప్పలో పడి ముత్యమయ్యేందుకు
తపన పడే  స్వాతి చినుకులా...

చీకటైతే చాలు ముకుళిత పత్రాల కలువని తాకి,
పులకింప చేసి, వికసింప చేసేందుకు
వేగిరపడే వెన్నెలసోనలా...


తీరాన్ని తాకాలనే తొందరలో  వడి వడిగా పరుగులెత్తే 
పున్నమి రాత్రి  పోటెక్కిన 
సాగర తరంగంలా ......

'నీ రాక ' కోసమే ఎదురు చూస్తోంది  
నా వశంలో లేని 'నా మనసు',
నీవే కావాలని మారాము చేస్తున్న 'నా అల్లరి వయసు'.

03/06/2012

"నా ఏకాంతం......అత్యంత స్పష్టంగా"






నిను  చూడాలని ఉన్నప్పుడు 
కనులు మూసి.....నీ రూపాన్ని తలచుకుంటూ..
నీతో గడిపిన వెన్నెల రాత్రులు గుర్తు చేసుకుంటూ...
నీతో ఉన్నప్పటి మధుర క్షణాలను
మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటూ.... 
అలా స్వప్నాల  లోనికి మెల్లగా జారుకుంటాను.... 

నీ ప్రణయ పరిమళాన్ని చూస్తాను...
నీ స్నేహసౌరభాన్నీ  చూస్తాను....
ఇంకా ఎన్నో.......కంటికి కనిపించని భావాలు... 
అనుభూతుల ద్వారా మాత్రమే తెలుసుకోనేవి..
ఒకదాని వెనుక మరొకటి...
చలనచిత్రం లోని దృశ్యాల్లా కదులుతూ ఉంటాయి మెల్లగా...

నీ రూపం మాత్రం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది...
మంచు  తెరల చాటు ముగ్ధ కుసుమంలా...
మేఘ మాలికల చాటు చంద్రబింబంలా...

కనులు తెరిస్తే స్వప్నం చెదిరి పోతుందేమోనని 
భయపడుతూనే....
నిన్ను చూడాలనే తపనతో
కనులు తెరిచి చూస్తాను.....

నా ఎదురుగా నను వెక్కిరిస్తూ కనిపిస్తుంది  
"నా ఏకాంతం......అత్యంత  స్పష్టంగా" .....