శ్రీ తన్మయ్ బుఖారియా జీ రచనకు స్వేఛ్చానువాదం
|| ఎప్పటికో ||
అన్ని దిక్కులలోని చీకట్లన్నీ ఒక్కటైపోయాయి.
కొడిగట్టిన నా చేతిదీపం
ఎప్పటిదాకా వెలుగుతుందో ?
ముసురుకుంటున్న తిమిరాలను
ఎప్పటికి తొలగిస్తుందో ?
ఎముకలుకొరికే చలిగాలులను చీల్చుకుంటూ...
అడుగుపెడుతున్న వసంతాన్ని అడ్డుకుంటున్నాయి...
ఎందుటాకుల కాలంతో
శాశ్వతసంధి చేసుకున్న సుడిగాలులు
కాపలా కాయల్సిన తోటమాలే ...
తోటకు శత్రువైపోతుంటే,
ఆపత్కాలంలో
కొమ్మలపైన గూళ్ళలో
చిక్కుకున్న పక్షిపిల్లల ఆర్తనాదాలను
ఎవరు వింటారో ?
వాటి ప్రాణాలను ఎవరు రక్షిస్తారో ?
వికృతంగా అరిచే గుడ్లగూబలు
సంగీతసామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంటే...
మధురస్వరాలాపన మాత్రమే తెలిసిన కోకిలలు
ప్రాణాలను త్యాగిస్తున్నాయి.
గతంలో కుహుకుహులతో కలకలలాడే ఈ వనానికి
పూర్వవైభవం ఎప్పటికి వస్తుందో ?
तन्मय बुखारिया जी की कविता :
संगठित सारे अँधेरे होगये
एक मेरा दीप कबतक टिमटिमाये ...
तम हटाये
आँधियों ने संधि करली ...पतझड़ों से
अल्पमत में होगई है अब बहारें
बाग़ का दुश्मन बना खुद बाग़बान
प्रश्न है बुलबुले किसको पुकारें
पद प्रतिष्टा बाँटलिए उल्लुओं ने
कोकिलाएं आत्मह्त्या कर रही है
इस चमन को कौन मरने से बचाएं
18/11/2016
|| వెలుగుతూనె ఉండాలి - తెలుగు గజల్ ||
మనసులోన వలపుదివ్వె వెలుగుతూనె ఉండాలి (ఉండాలీ)
ముసురుతున్న వియోగాన్ని తరుముతూనె ఉండాలి
కప్పుకున్న నివురంతా ఎగిరిఎగిరిపోవాలి
కల్లలన్ని నిజాలలో కాలుతూనె ఉండాలి
చీకట్లకు చూపులలో నిలువనీడనీయవద్దు
కన్నులలో పున్నములను నింపుతూనె ఉండాలి
కదులుతున్నపాదాలకు పూలస్పర్శ తగలాలి
బాటలోని ముళ్లన్నీ తొలగుతూనె ఉండాలి
రాయిలోన రప్పలోన అన్వేషణ ఆపాలి
మనిషిలోన మాధవుడిని వెదుకుతూనె ఉండాలి
మెడకుచుట్టినపుడు మనసు 'పట్టు' తప్పిపోతుంది
'సత్య'లాగ జడను...చెలియ విసురుతూనె ఉండాలి
పాషాణపు మనసనుకొని వదిలేయకు "నెలరాజా"
ప్రేమించే హృదయంతో చెక్కుతూనె ఉండాలి
16/11/2016
|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||
అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ స్వర్ణోత్సవం నాడు
భారతీయభాషల కవి సమ్మేళనంలో చదివిన కవిత.
|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||
అపరదానకర్ణులనిపించుకోవాలనేమో...
కనీ పెంచినందుకు కృతజ్ఞతను చూపకుండా
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు దానం చేసేస్తున్నారు
కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు.
“మదర్స్ డే” నాడు అమ్మ ఫోటోలను ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొని
తల్లిగురించి ఎవరో రాసిన కొటేషన్లు షేర్ చేసుకుంటూ
లోకుల దృష్టిలో తల్లిని దేవతలా పూజించేవారి జాబితాలో
మొదటిస్థానాన్ని కొట్టేస్తూ ఉంటారు.
ఫాదర్స్ డే నాడు తండ్రి చేసిన త్యాగాల లిస్టుతో
చదివేవాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగేంత గొప్పగా కవితలనల్లేస్తారు,
తల్లే కాదు తండ్రికూడా ఎంతో పూజనీయుడేనంటూ
ఎన్నో మాటలు మాట్లాడతారు.
తనను కన్యాదానం చేసేటప్పుడు
అమ్మిన పొలాలు , తాకట్టుపెట్టిన ఆస్తుల సంగతి
ఎప్పుడూ తలవనైనా తలవరు
కరిగిపోయిన అమ్మ పుస్తెల గురించి ఒక్కమాట కూడా మాట్లాడరు.
తల్లిదండ్రులను తమతో తీసుకెళ్లలేమని కుంటిసాకులు చెప్పే కూతుళ్ళు .
తమ చదువులకోసం తండ్రి చేసిన ఓవర్ టైములు
తీసుకున్న లోన్ల సంగతి ఎప్పుడూ గుర్తుచేసుకోవడానికే ఇష్టపడరు ...
రెండుచేతులా డాలర్లో ,రూపాయలో సంపాదించుకొనే కొడుకులు
తల్లైనా తండ్రైనా మరణించిన కబురు తెలియగానే
విద్యుత్ దహనవాటికల్లో దహన సంస్కారాలు చేయించి
గంగలోనో గోదారిలోనో చితాభస్మాన్ని కలిపి కాస్త పుణ్యాన్ని
తమకు మెయిల్ చేసే వెబ్ సైట్లకోసం వెదుకుతూ ఉంటారు...
పున్నామనరకాన్ని తప్పిస్తారని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న “కొడుకులు” .
ఆశీస్సులు మాత్రమే ఇస్తూ
పిల్లల ఉన్నతికోసం కనిపించే ప్రతీ దేవుళ్ళకీ
మొక్కుకునే తల్లిదండ్రులు మారాలి.
బతికుండగానే నరకాన్ని చూపించిన పిల్లలకి
కాస్తంత పుణ్యం కూడా దొరకకూడదనీ...
తమ ప్రేమను తలదన్నినందుకు,
వాళ్ళ పాపం వాళ్ళనే కాల్చేయాలనీ
కార్చే కన్నీటినే మంత్రజలంగా మార్చి జల్లడం నేర్చుకోవాలి ...
గుండెను బండరాయిగా చేసుకొని శపించడం నేర్చుకోవాలి ...
11/11/2016
|| అవసరం - తెలుగు గజల్ ||
బాధలన్నీ అణిచి పెదవులను విప్పుతూ నవ్వడం అవసరం
చిరునవ్వు విసురుతూ ద్వేషాన్ని నిలువునా చీల్చడం అవసరం
పనిలేనివారితో గడిపేటి సమయాలు ఎందుకూ కొరగావు
సద్గురువుతో ఉండి వెలలేని జ్ఞానాన్ని పొందడం అవసరం
మేధావితో చర్చ మధ్యలో ఆపడం మర్యాద కాదులే
పసలేని అవివేకి వాదనను మధ్యలో తుంచడం అవసరం
గాలించలేనపుడు బొగ్గుతో బాటుగా మండిపోతుంటాయి
కర్బనపు గనిలోని వెలలేని వజ్రాల్ని ఏరడం అవసరం
మోదాలు కొలువున్న కోవెలను పేల్చేసి కబ్జాలు చేస్తాయి
ఖేదాలు నిర్మించు ఆకాశ సౌధాలు కూల(ల్చ)డం అవసరం
జీవించి ఉన్నపుడు కష్టాల జ్వాలలో కాలుతూ ఉంటారు
పేదోళ్ళ చితులపై చందనపు చెక్కల్ని పేర్చడం అవసరం
ప్రేమరాహిత్యాన్ని మోయలేకున్నాను ఎందుకో "నెలరాజ"
ప్రియురాలి వలపుతో మదిలోని మంటల్ని ఆర్పడం అవసరం #శ్రీ
09/11/2016
|| ఈ రాతిరి - తెలుగు గజల్ ||
మనం ఒక్కటైనప్పుడు పండుతోంది ఈ రాతిరి
విరహాలను దూరంగా పంపుతోంది ఈ రాతిరి
వెలుగుపైన గెలవాలని యుద్ధకాంక్షతో ఉన్నది
చీకట్లను రణభూమికి పంపుతోంది ఈ రాతిరి
సుగంధాన్ని పూసుకొనే కోరికతో ఉంటుంది
విచ్చుకున్న మల్లెలపై జారుతోంది ఈ రాతిరి
పగటిలోని గాయాలకు లేపనాల కోసమేమొ
జాబిల్లిని రారమ్మని పిలుస్తోంది ఈ రాతిరి
కామునితో కలహించే సమయంలో నెలరాజా
ఇరువురమూ గెలవాలని మొక్కుతోంది ఈ రాతిరి ... #శ్రీ
08/11/2016
|| ఈ వెన్నెల - తెలుగు గజల్ ||
చీకటిపై కాంతిపూలు జల్లుతోంది ఈ వెన్నెల
చలచల్లని బాణాలను రువ్వుతోంది ఈ వెన్నెల
తీరకాంత కొప్పులోన మెరవాలని ఉన్నదేమొ
తరగలపై మల్లెలుగా మారుతోంది ఈ వెన్నెల
చందమామనొంటరిగా క్షణమైనా విడువదులే
కలువపూల కళ్ళలోకి జారుతోంది ఈ వెన్నెల
ప్రణయించే జంటలన్ని తనకంట్లో పడెనెమో
జాబిల్లిని మబ్బు(ముగ్గు)లోకి లాగుతోంది ఈ వెన్నెల
పున్నమంటి చెలిచిత్రం గీయాలని తలచాను
పుచ్చపూల కాన్వాసుగ మారుతోంది ఈ వెన్నెల
ఒంటరైన ప్రేమికులతొ వైరం తనకెందుకో
నేస్తమైన విరహానికి చూపుతోంది ఈ వెన్నెల
సుగంధాన్ని తనమేనికి పూసుకుంటు "నెలరాజా"
జాజిపూల తీగలపై పాకుతోంది ఈ వెన్నెల
06/11/2016
|| నా ప్రేయసి - తెలుగు గజల్ ||
చాందినీల పల్లకిలో కదులుతోంది నా ప్రేయసి
పాలపుంతలకు తళుకులనద్దుతోంది నా ప్రేయసి
మనసులోని వనాలన్ని శిశిరాలకు బలియైనవి
సుమదళాల ఉప్పెనలో ముంచుతోంది నా ప్రేయసి
మధురసుధలనెన్నిటినో పెదవులలో నింపుకుంది
కోరినపుడు కాస్త కాస్త పంచుతోంది నా ప్రేయసి
నిరీక్షణల పర్వాలకు ఉద్వాసన పలుకుతుంది
ప్రతిరేయిని రసధునిలా మార్చుతోంది నా ప్రేయసి
విరహంలో మండుతున్నమనసునెలా చూసిందో
శీతజలధి తరగలలో తడుపుతోంది నా ప్రేయసి
మదిలోపలి అమాసలకు నిలువనీడనీయదులే
సిరివెన్నెల దీపంలా వెలుగుతోంది నా ప్రేయసి
కనులలోన వాలుతున్న చీకట్లను " నెలరాజా "
తన చూపుల శరములతో తరుముతోంది నా ప్రేయసి
- శ్రీ
Subscribe to:
Posts (Atom)






