27/12/2016

|| గెలిచాయి ఎందుకో - తెలుగు గజల్ 453 ||

కన్నీటి బుడగలే పగిలాయి ఎందుకో చెక్కిలిని ఆర్తిగా తడిమాయి ఎందుకో పూలున్న హృదయాన్ని ఆక్రమించేసాయి ముళ్ళున్న పొదలెన్నొ మొలిచాయి ఎందుకో నావలో అడుగేయబోయాయి మోదాలు ఖేదాల కడలిలో మునిగాయి ఎందుకో తొలిఋతువులో పికము పాట వినబడలేదు రాగాలు శిశిరాన్ని వలచాయి ఎందుకో రెప్పలను వెలివేసి వెళ్ళాయి స్వప్నాలు కనులలో చీకట్లు మిగిలాయి ఎందుకో హేమంత ధూపాలు దయచూపలేదులే అంగార కుసుమాలు విరిసాయి ఎందుకో నీతోడు లేనపుడు నామీద "నెలరాజ" పలుమార్లు విరహాలు గెలిచాయి ఎందుకో ... #శ్రీ

21/12/2016

|| నీ నవ్వులకెలా తెలుసు – తెలుగు గజల్ ||


గులాబీలు  పూయించుట నీ సిగ్గులకెలా తెలుసు
మల్లెపూలు కురిపించుట నీ నవ్వులకెలా తెలుసు

నిశినెరుగని లోకాలకు దారులు వేస్తుంటాయి 
పున్నములను పండించుట నీ చూపులకెలా తెలుసు 

అమరత్వమునే కానుకనిచ్చిన చెలి నీవుకదా 
అమృతాన్ని అందించుట నీ పెదవులకెలా తెలుసు

చీకటిలో మగ్గుతున్న మదిని ఊరడిస్తావు
వెన్నెలలో తేలించుట నీ కన్నులకెలా తెలుసు  

నా జీవనగమనంలో సహచరివై “ నెలరాజా “ 
వసంతాల నడిపించుట నీ పదములకెలా తెలుసు   #శ్రీ 

19/12/2016

|| చెప్పవలెనా - తెలుగు గజల్ ||




కలలు గుచ్చిన సూదులన్నీ తీయలేనని చెప్పవలెనా
కనుల పొంగిన రుధిరధారను ఆపలేనని చెప్పవలెనా

దారితప్పిన  వసంతానికి చేరువయ్యే రోజులెపుడో
చివురులేసిన వియోగాలను తుంచలేనని చెప్పవలెనా

కలిసి గడిపిన క్షణములన్నీ నన్ను విడిచినవెందుకోమరి 
ఎదురుచూపుల యుగాలన్నీ మోయలేనని చెప్పవలెనా

దిక్కు తెలియని ఒడ్డునెరుగని చోటులోనే వదలినావు  
సుడులుతిరిగే  శోకనదమును ఈదలేనని చెప్పవలెనా

ప్రాణమంటే తీపిలేదు మరణమంటే భయములేదు 
నిన్నుచూడక నిమిషమైనా బతకలేనని చెప్పవలెనా

మనసునిండా వెన్నెలిచ్చిన చందమామవు నీవుకాదా 
నీవు లేనిచొ  నిశలసేనను గెలవలేనని చెప్పవలెనా

నీవు చేసిన బాసలన్నీ నీటిరాతలు  "ఓ నెలరాజ"
చేయిపట్టిన చేతినెపుడూ వదలలేనని చెప్పవలెనా   #శ్రీ .

18/12/2016

|| నీలోనే ఉన్నవిలే – తెలుగు గజల్ ||


వెన్నెలలో వెలుగులన్ని నీలోనే ఉన్నవిలే
తారలలో తళుకులన్ని నీలోనే ఉన్నవిలే

కనులలోని చీకట్లకు చుక్కలు చూపిస్తావు
పున్నమిలో కాంతులన్ని నీలోనే ఉన్నవిలే

ప్రేమమబ్బుపైన చరిచి చినుకులు కురిపిస్తావు
తొలకరిలో మెరుపులన్ని నీలోనే ఉన్నవిలే

స్ఫటికమంటి తనువులోన ఏ కిరణం వంగినదో
ఇంద్రధనువు విరుపులన్ని నీలోనే ఉన్నవిలే

చూపులన్ని మధుపాలై ప్రదక్షిణలు చేస్తున్నవి 
మధువనాల సొబగులన్ని నీలోనే ఉన్నవిలే

ప్రాణాలను ఐదింటిని వేటలాడుతుంటావు
కందర్పుని శరములన్ని నీలోనే ఉన్నవిలే

నింగిలోన చందమామ ఒకటేలే నెలరాజా
చౌదసీల చాందులన్ని నీలోనే ఉన్నవిలే
(ప్రతీ ఏటా వచ్చే 12 శుక్లపక్షాల చందమామలన్నమాట )





17/12/2016

|| వింతకదా - తెలుగు గజల్ ||




కన్నీటిని చిందించని కనులుంటే వింతకదా
బాధనెపుడు చవిచూడని మనసుంటే వింతకదా.

మోదాన్నీ ఖేదాన్నీ పరిచయిస్తు ఉంటుంది   
విరహాలను పంచనట్టి వలపుంటే వింతకదా

చివరి ఋతువు కాళ్ళకింద ఆకులన్నిచిట్లుతాయి  
పంతముతో చివురించని వనముంటే వింతకదా

వెలుగుతున్నసూరీడే వేకువలో జనిస్తాడు 
తూర్పుదిక్కులో చీకటి నిలుచుంటే వింతకదా

పుడుతూనే పరుగులతో కడలిదరికి ఉరుకుతాయి  
సంగమాన్ని కోరుకోని నదులుంటే వింతకదా 

పాతాళంలోకి కూడ వేర్లు పెంచి ఉంటుంది 
అవినీతిని పెళ్లగించు పలుగుంటే వింతకదా 

ఎండమావిలో తీయని జలములాగ "నెలరాజా" 
మూర్ఖునికడ పాండిత్యపు నిధులుంటే వింతకదా   #శ్రీ 

09/12/2016

|| ఉంటుంది - తెలుగు గజల్ ||





తూర్పులో నిద్రించు సూర్యుడిని తొలిసంధ్య లేపుతూ ఉంటుంది 
రాతిరిని పాలించు చీకటికి వీడ్కోలు పలుకుతూ ఉంటుంది

రేపులుగు చల్లగా గీతికలు పాడడం అబ్బురం కాదులే
కౌముదుల జారేటి వెన్నెలను ఆర్తిగా తాగుతూ ఉంటుంది

తిమిరాల సేనపై వేటాడు గగనమే విరుచుకొని పడుతుంది    
పదునైన ఓ చంద్రహాసాన్ని గురిచూసి విసురుతూ ఉంటుంది 

సప్తాశ్వములపైన పయనించు కాలాన్ని అడ్డుతూ ఉంటుంది  
వేధించు తన్హాయి...రాత్రులను మెల్లగా కదుపుతూ ఉంటుంది

చెలి మందహాసాలు కరువైన వేళలో బాధతో  "నెలరాజ"
దుఖించు మదిలోన మరిగేటి కన్నీరు పొంగుతూ  ఉంటుంది 
                                                                              - శ్రీ 

05/12/2016

|| ఓ సశేషం ||


కెరటాలలో హాలాహలాన్ని నింపుకొన్న కాలసాగరం కరాళనృత్యం చేసుకుంటూ ... కబళించేందుకు మీదికొస్తున్నట్లనిపించే కలలన్నీ వాస్తవాలుగా మారి కళ్ళముందు కనిపిస్తున్నాయి మనం కలిసి నడిచినప్పుడు పాదాలకింద చందనపుముద్దలా తగిలిన తీరంలోని ఇసుకతడి... హేమంతంలో కూడా చండ్రనిప్పుల్ని కక్కుతోంది పరిమళాన్ని ఆవాహనం చేసుకున్న మన కబుర్లపూలన్నీ ఎప్పుడు వాడిపోయాయో... ఎండిన రేకులన్నీ సాగరగర్భంలో ఎప్పుడు కలిసిపోయాయో వియోగాన్ని కొన్ని యుగాలపాటు నిస్సహాయంగా మోస్తున్న మనసుకు తెలియలేదంటే ఆశ్చర్యమేముంది శుక్లపక్ష రాత్రులలో వెన్నెలపూలు తురుముకొని లాస్యమాడే అలలకన్నెలు... కృష్ణపక్షపు తిమిరాన్ని నింపుకొని కోరలు చాచి ఒడ్డుని కాటేసేందుకు పడగలు విసురుతున్నట్లే ఉంది మూసుకున్న నీ మదిగోడలపై నా తలపులేసిన చిత్రాలన్నీనీ కంటబడితే మరలివస్తావనుకుంటున్నా. గుప్పెడు జ్ఞాపకాల గవ్వలకోసం జల్లెడపట్టిన సైకతరేణువులు నీ పాదాలపై నా చిరునామా వ్రాస్తాయనే నమ్మకం మాత్రమే మిగిలింది అదే నమ్మకం ... అనుక్షణం నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ ఉంటుంది ... #శ్రీ

03/12/2016

|| చూసావా ఎపుడైనా - తెలుగు గజల్ ||



కాలమెలా పొడిచిందో చూసావా ఎపుడైనా 
రుధిరమెలా చిందిందో కన్నావా ఎపుడైనా

నా కన్నుల నీరు చూసి గేలిచేస్తు ఉంటావు 
శోకమెంత  కురిసిందో అడిగావా ఎపుడైనా

ఆరాధన నీదేనని గర్వించుట నీకు తెలుసు 
మనసుతోటి నీరాజనమిచ్చావా ఎపుడైనా

నను కమ్మిన వేళలోన ముఖం చాటుచేస్తావు 
చూపులతో చీకట్లను తరిమావా ఎపుడైనా

పోరాడిన ప్రతిసారీ నన్ను గెలిచిపోతున్నది 
వేదనతో యుద్ధాలను చేసావా ఎపుడైనా

గుండెకైన గాయాలను మౌనంతో రేపుతావు 
మాటలతో నవనీతం పూసావా ఎపుడైనా

ఇద్దరిదీ ఒకేబాట అంటూనే "నెలరాజా"  
అడుగులోన అడుగువేసి నడిచావా ఎపుడైనా   
                                                                          #శ్రీ 

02/12/2016

|| కురిసిపోతే వింత కాదా - తెలుగు గజల్ ||



పట్టపగలే పండువెన్నెల కురిసిపోతే వింతకాదా
అర్ధరాతిరి సూర్యబింబము వెలిగిపోతే వింతకాదా

సూర్యకిరణము నీటిబిందువు సంగమిస్తే వర్ణమయమే 
వాన పడితే ఇంద్రచాపము వెలిసిపోతే వింతకాదా

విశ్వమంతా అంధకారపు ఆక్రమణలో మగ్గుతున్నది 
"వెలుగు"ధాటికి  నిశలగర్వము తొలగిపోతే వింతకాదా

మనిషివేటకు నీటిలోపల జీవులన్నీ తరుగుతున్నవి  
వలలు అన్నీ చేపనోటికి చిక్కిపోతే వింతకాదా 

రక్తమోడ్చే మనసుబాధను కన్నులే చూపిస్తవి 
దుఃఖమంతా రెప్పలోపల దాగిపోతే వింతకాదా

తెలివితక్కువ వా(దన)దములతో మిడిసిపడితే భంగపాటే 
జ్ఞానధనులను  మూర్ఖుడొక్కడు గెలిచిపోతే వింతకాదా

తుంచబడినా పరిమళాలను చేతికిచ్చును ఓ నెలరాజ
పూలరేకులు కంటకాలుగ మారిపోతే వింత కాదా    #శ్రీ  

01/12/2016

|| నను పిలిచిన వేళలోన - తెలుగు గజల్ ||



తేనెపూలు జల్లుతావు నను పిలిచిన వేళలోన 
ముత్యాలను రువ్వుతావు నువు నవ్విన వేళలోన 

కన్నులలో వెండిపూల రేకులెన్ని కురిసాయో                                     
చందమామ తనయలాగ నువు మెరిసిన వేళలోన

సుగంధాల జలధిలోన మునిగినట్లు ఉంటుంది 
మాలలంటి చేతులతో నను చుట్టిన వేళలోన

గుండెలపై మెరుపులాగ వాలుతుంటె వదలలేను  
వానమబ్బు ఉరిమినపుడు నువు బెదిరిన వేళలోన

మనసంతా వసంతాల పల్లకిలో ఊరేగెను
కొత్తపెళ్లికూతురిలా నువు వచ్చిన వేళలోన
                                                               
నయనాలను రోజాలే అభిషిక్తం చేసాయి 
వేనవేల చూపులతో నిను గుచ్చిన వేళలోన 

స్వర్గలోక సుఖమంటే తెలిసినాది "నెలరాజా" 
రతీదేవిలాగ వచ్చి నను కలిసిన వేళలోన
                                                                       #శ్రీ 

27/11/2016

|| ఇరుచోట్లా ఉన్నారు - తెలుగు గజల్ || అనువాదపు గజల్



జనాబ్ నిదా ఫాజలీ జీ వ్రాసిన ఈ గజల్ చూడండి
(ఏ దేశమైనా గానీ) దేశాన్నిగానీ, నివసించే ఎక్కువశాతం ప్రజలనుగానీ
ధర్మం( మతం) పేరుతో దూషించడంగానీ నిజంగా నేరమేననిపిస్తుంది 
అతితక్కువమంది దుష్టులవలన దేశం పేరు అపఖ్యాతిపాలౌతుంది 
మతాన్ని కూడా అదే దృష్టితో చూడడం అలవాటు చేసేసుకుంటాం.

నేను ఆమధ్య ఒక సభలో మాట్లాడుతూ అన్నాను
"విశ్వంలో వెలుతురుకంటే చీకటే ఎక్కువ ఉంది  
లోకులలో  చెడుకంటే  మంచితనమే ఎక్కువ ఉంది" అని. 
మంచితనానికి పెద్దపీట వేద్దాం. చెడుని కూకటివేళ్ళతో పెకలించేద్దాం... #శ్రీ .   


पाकिस्तान से लौटने के बाद 
लिखी गयी जनाब निदा  फ़ाज़ली जी की इस ग़ज़ल को पढ़ने के बाद 
लगा कि देश कभी गलत नहीं होसक्ता है, 
जनता भी गलत नहीं होसकती है 
केवल कुछ कट्टरलोगों की वजह से देश बदनाम होता है 

इस विश्व में  रोशनी से अन्धेरा ज्यादा है 
पर लोगों में बुराई से अच्छाई  ज्यादा है 

अच्छाई के साथ चलेंगे। .. बुराई को नाश कर देंगे। 

||  ఇరుచోట్లా ఉన్నారు - తెలుగు గజల్ || అనువాదపు గజల్ 

మనుషుల్లో రాకాసులు ఇరుచోట్లా ఉన్నారు 
అల్లా విష్ణువు శివుడు  ఇరుచోట్లా ఉన్నారు

హింసను పెంచే వ్యక్తులు వేరేగా ఉంటారు 
నగరాల్లో దుర్మార్గులు ఇరుచోట్లా ఉన్నారు

ఈశ్వరుడూ రెహమానూ వేరువేరు కాదులే 
పూజలు చేసే భక్తులు ఇరుచోట్లా ఉన్నారు 
( అనువాదంలో కాస్త స్వేచ్ఛను తీసుకున్నాను ఈ షేర్ కి ) 

హిందువులూ ముస్లిములూ ఖుషీగానె(కలిసిమెలిసి)ఉంటారు 
ఇబ్బందులు పడే ప్రజలు ఇరుచోట్లా ఉన్నారు

ఆతని పాటలు(కవితలు) వింటూ పరవశించిపోతారు 
మీర్^కున్న అభిమానులు ఇరుచోట్లా ఉన్నారు


जनाब निदा  फ़ाज़ली जी की  ग़ज़ल 
(पाकिस्तान से लौटने के बाद ) 

इन्सान में हैवान यहाँ भी है वहाँ भी
अल्लाह निगहबान यहाँ भी है वहाँ भी |

खूँख्वार दरिंदों के फ़क़त नाम अलग हैं
शहरों में बयाबान यहाँ भी है वहाँ भी |

रहमान की कुदरत हो या भगवान की मूरत
हर खेल का मैदान यहाँ भी है वहाँ भी |

हिन्दू भी मज़े में हैमुसलमाँ भी मज़े में
इन्सान परेशान यहाँ भी है वहाँ भी |

उठता* है दिलो-जाँ से धुआँ दोनों तरफ़ ही
ये 'मीर' का दीवान यहाँ भी है वहाँ भी |

26/11/2016

|| రాదో మరి - తెలుగు గజల్ ||



|| రాదో మరి - తెలుగు గజల్ || 

సూర్యుడు వెళిపోతున్నా రాత్రెందుకు రాదో మరి
రాత్రి వచ్చినాగానీ కలలెందుకు లేవో మరి

చివురు చూడకుండానే ఎండుటాకు రాలుతుంది 
ఆనందం అడుగిడినా వెతలెందుకు పోవో మరి .

గజిబిజి గీతలలోనే బతుకు చిక్కుకుంటోంది
నుదిటిమీద భాగ్యరేఖ జాడెందుకు లేదో మరి 

గుండెలోని శోకమంత పొంగిందని తెలుస్తోంది 
పొడిబారిన కనులనుండి నీళ్ళెందుకు రావో మరి

కాలం మాన్పని గాయం లేనేలేదంటారు 
యుగాలెళ్ళిపోతున్నా బాధెందుకు పోదో మరి

పగబట్టిన విధికూడా అనుక్షణం చంపుతోంది 
ప్రాణాలను హరియించే యముడెందుకు రాడో మరి

ఆరు రుచుల మిశ్రమాన్ని సేవిస్తూ "నెలరాజా"
వేపవిత్తులను మింగని బతుకెందుకు చేదో మరి 

                                                  #శ్రీ 

20/11/2016

|| విడువను ఎపుడూ - తెలుగు గజల్ ||



నిను వలచేందుకు సుముహూర్తాలను వెదకను ఎపుడూ 
పెండ్లాడేందుకు పంచాంగాలను చూడను ఎపుడూ

నీ మదిలోనే వలపుల వేల్పుని చేస్తివి చెలియా
కపటపు ప్రేమను చూపే వారిని చేరను ఎపుడూ 

నీ సన్నిధిలో పగలూ రేయీ పున్నములేగా 
వెన్నెలనొంపే శరత్కాలమును తలవను ఎపుడూ

నీ నవ్వులలో నందనవనులే విరిసెను సఖియా 
గాలికి గంధము పూసే పూలను కోయను ఎపుడూ 

కాముడు మలచిన బంగరుశిల్పం నను వరియించెను
కలలోనైనా వేరే భామను కోరను ఎపుడూ

నీ ప్రేమంతా కొంచెంకొంచెం దోచుట తెలియును 
వలలను వేస్తూ పట్టాలంటే  దొరకను ఎపుడూ 

ప్రళయం రానీ యుగాలు పోనీ  ఓ "నెలరాజా" 
దేవుని ఎదుటన పట్టిన చేతిని విడువను ఎపుడూ


18/11/2016

|| ఎప్పటికో ||



శ్రీ తన్మయ్ బుఖారియా జీ రచనకు స్వేఛ్చానువాదం || ఎప్పటికో || అన్ని దిక్కులలోని చీకట్లన్నీ ఒక్కటైపోయాయి. కొడిగట్టిన నా చేతిదీపం ఎప్పటిదాకా వెలుగుతుందో ? ముసురుకుంటున్న తిమిరాలను ఎప్పటికి తొలగిస్తుందో ? ఎముకలుకొరికే చలిగాలులను చీల్చుకుంటూ... అడుగుపెడుతున్న వసంతాన్ని అడ్డుకుంటున్నాయి... ఎందుటాకుల కాలంతో శాశ్వతసంధి చేసుకున్న సుడిగాలులు కాపలా కాయల్సిన తోటమాలే ... తోటకు శత్రువైపోతుంటే, ఆపత్కాలంలో కొమ్మలపైన గూళ్ళలో చిక్కుకున్న పక్షిపిల్లల ఆర్తనాదాలను ఎవరు వింటారో ? వాటి ప్రాణాలను ఎవరు రక్షిస్తారో ? వికృతంగా అరిచే గుడ్లగూబలు సంగీతసామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంటే... మధురస్వరాలాపన మాత్రమే తెలిసిన కోకిలలు ప్రాణాలను త్యాగిస్తున్నాయి. గతంలో కుహుకుహులతో కలకలలాడే ఈ వనానికి పూర్వవైభవం ఎప్పటికి వస్తుందో ? तन्मय बुखारिया जी की कविता : संगठित सारे अँधेरे होगये एक मेरा दीप कबतक टिमटिमाये ... तम हटाये आँधियों ने संधि करली ...पतझड़ों से अल्पमत में होगई है अब बहारें बाग़ का दुश्मन बना खुद बाग़बान प्रश्न है बुलबुले किसको पुकारें पद प्रतिष्टा बाँटलिए उल्लुओं ने कोकिलाएं आत्मह्त्या कर रही है इस चमन को कौन मरने से बचाएं

|| వెలుగుతూనె ఉండాలి - తెలుగు గజల్ ||



మనసులోన వలపుదివ్వె వెలుగుతూనె ఉండాలి (ఉండాలీ) 
ముసురుతున్న వియోగాన్ని తరుముతూనె ఉండాలి

కప్పుకున్న నివురంతా ఎగిరిఎగిరిపోవాలి
కల్లలన్ని  నిజాలలో కాలుతూనె ఉండాలి

చీకట్లకు చూపులలో నిలువనీడనీయవద్దు
కన్నులలో పున్నములను నింపుతూనె ఉండాలి

కదులుతున్నపాదాలకు పూలస్పర్శ తగలాలి  
బాటలోని ముళ్లన్నీ తొలగుతూనె ఉండాలి

రాయిలోన రప్పలోన అన్వేషణ ఆపాలి 
మనిషిలోన మాధవుడిని వెదుకుతూనె ఉండాలి

మెడకుచుట్టినపుడు మనసు 'పట్టు' తప్పిపోతుంది 
'సత్య'లాగ జడను...చెలియ విసురుతూనె ఉండాలి

పాషాణపు మనసనుకొని వదిలేయకు "నెలరాజా" 
ప్రేమించే హృదయంతో చెక్కుతూనె ఉండాలి   

16/11/2016

|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||



అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ స్వర్ణోత్సవం నాడు 
భారతీయభాషల కవి సమ్మేళనంలో చదివిన కవిత. 


|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||

అపరదానకర్ణులనిపించుకోవాలనేమో...
కనీ పెంచినందుకు కృతజ్ఞతను చూపకుండా 
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు దానం చేసేస్తున్నారు
కృతఘ్నులైన  కొంతమంది బిడ్డలు.  

“మదర్స్ డే” నాడు అమ్మ ఫోటోలను ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొని 
తల్లిగురించి ఎవరో రాసిన కొటేషన్లు షేర్ చేసుకుంటూ 
లోకుల దృష్టిలో తల్లిని దేవతలా పూజించేవారి జాబితాలో 
మొదటిస్థానాన్ని కొట్టేస్తూ ఉంటారు.

ఫాదర్స్ డే నాడు తండ్రి చేసిన త్యాగాల లిస్టుతో 
చదివేవాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగేంత గొప్పగా కవితలనల్లేస్తారు,
తల్లే కాదు తండ్రికూడా ఎంతో పూజనీయుడేనంటూ 
ఎన్నో మాటలు మాట్లాడతారు.

తనను కన్యాదానం చేసేటప్పుడు
అమ్మిన పొలాలు , తాకట్టుపెట్టిన ఆస్తుల సంగతి 
ఎప్పుడూ తలవనైనా తలవరు 
కరిగిపోయిన అమ్మ పుస్తెల గురించి ఒక్కమాట కూడా మాట్లాడరు.
తల్లిదండ్రులను తమతో తీసుకెళ్లలేమని కుంటిసాకులు చెప్పే కూతుళ్ళు .

తమ చదువులకోసం తండ్రి చేసిన ఓవర్ టైములు 
తీసుకున్న లోన్ల సంగతి ఎప్పుడూ గుర్తుచేసుకోవడానికే  ఇష్టపడరు ... 
రెండుచేతులా డాలర్లో ,రూపాయలో సంపాదించుకొనే కొడుకులు 

తల్లైనా తండ్రైనా మరణించిన కబురు తెలియగానే 
విద్యుత్‌ దహనవాటికల్లో దహన సంస్కారాలు చేయించి 
గంగలోనో గోదారిలోనో చితాభస్మాన్ని కలిపి కాస్త పుణ్యాన్ని
తమకు మెయిల్ చేసే వెబ్ సైట్లకోసం వెదుకుతూ ఉంటారు...
పున్నామనరకాన్ని తప్పిస్తారని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న “కొడుకులు” .

ఆశీస్సులు మాత్రమే ఇస్తూ 
పిల్లల ఉన్నతికోసం కనిపించే ప్రతీ దేవుళ్ళకీ
మొక్కుకునే తల్లిదండ్రులు మారాలి. 
బతికుండగానే నరకాన్ని చూపించిన పిల్లలకి 
కాస్తంత పుణ్యం కూడా దొరకకూడదనీ...
తమ ప్రేమను తలదన్నినందుకు, 
వాళ్ళ పాపం వాళ్ళనే కాల్చేయాలనీ 
కార్చే కన్నీటినే మంత్రజలంగా మార్చి జల్లడం నేర్చుకోవాలి ...
గుండెను బండరాయిగా చేసుకొని శపించడం నేర్చుకోవాలి ... 


11/11/2016

|| అవసరం - తెలుగు గజల్ ||




బాధలన్నీ అణిచి పెదవులను విప్పుతూ నవ్వడం అవసరం
చిరునవ్వు విసురుతూ ద్వేషాన్ని నిలువునా చీల్చడం అవసరం పనిలేనివారితో గడిపేటి సమయాలు ఎందుకూ కొరగావు సద్గురువుతో ఉండి వెలలేని జ్ఞానాన్ని పొందడం అవసరం మేధావితో చర్చ మధ్యలో ఆపడం మర్యాద కాదులే పసలేని అవివేకి వాదనను మధ్యలో తుంచడం అవసరం గాలించలేనపుడు బొగ్గుతో బాటుగా మండిపోతుంటాయి కర్బనపు గనిలోని వెలలేని వజ్రాల్ని ఏరడం అవసరం మోదాలు కొలువున్న కోవెలను పేల్చేసి కబ్జాలు చేస్తాయి ఖేదాలు నిర్మించు ఆకాశ సౌధాలు కూల(ల్చ)డం అవసరం జీవించి ఉన్నపుడు కష్టాల జ్వాలలో కాలుతూ ఉంటారు పేదోళ్ళ చితులపై చందనపు చెక్కల్ని పేర్చడం అవసరం ప్రేమరాహిత్యాన్ని మోయలేకున్నాను ఎందుకో "నెలరాజ" ప్రియురాలి వలపుతో మదిలోని మంటల్ని ఆర్పడం అవసరం #శ్రీ

09/11/2016

|| ఈ రాతిరి - తెలుగు గజల్ ||



మనం ఒక్కటైనప్పుడు పండుతోంది  ఈ రాతిరి 
విరహాలను దూరంగా పంపుతోంది ఈ రాతిరి 

వెలుగుపైన గెలవాలని యుద్ధకాంక్షతో ఉన్నది 
చీకట్లను రణభూమికి పంపుతోంది ఈ రాతిరి 

సుగంధాన్ని పూసుకొనే కోరికతో ఉంటుంది 
విచ్చుకున్న మల్లెలపై జారుతోంది ఈ రాతిరి 

పగటిలోని గాయాలకు లేపనాల కోసమేమొ
జాబిల్లిని రారమ్మని పిలుస్తోంది ఈ రాతిరి 

కామునితో కలహించే సమయంలో నెలరాజా 
ఇరువురమూ గెలవాలని మొక్కుతోంది ఈ రాతిరి   ... #శ్రీ 

08/11/2016

|| ఈ వెన్నెల - తెలుగు గజల్ ||



చీకటిపై కాంతిపూలు జల్లుతోంది ఈ వెన్నెల 
చలచల్లని బాణాలను రువ్వుతోంది ఈ వెన్నెల

తీరకాంత కొప్పులోన మెరవాలని ఉన్నదేమొ
తరగలపై మల్లెలుగా మారుతోంది ఈ వెన్నెల 

చందమామనొంటరిగా క్షణమైనా విడువదులే 
కలువపూల కళ్ళలోకి జారుతోంది ఈ వెన్నెల

ప్రణయించే జంటలన్ని తనకంట్లో పడెనెమో
జాబిల్లిని మబ్బు(ముగ్గు)లోకి లాగుతోంది ఈ వెన్నెల

పున్నమంటి  చెలిచిత్రం గీయాలని తలచాను 
పుచ్చపూల కాన్వాసుగ మారుతోంది ఈ వెన్నెల 

ఒంటరైన ప్రేమికులతొ వైరం తనకెందుకో
నేస్తమైన విరహానికి చూపుతోంది ఈ వెన్నెల

సుగంధాన్ని తనమేనికి పూసుకుంటు "నెలరాజా"
జాజిపూల తీగలపై పాకుతోంది ఈ వెన్నెల

06/11/2016

|| నా ప్రేయసి - తెలుగు గజల్ ||




చాందినీల పల్లకిలో కదులుతోంది నా ప్రేయసి  
పాలపుంతలకు తళుకులనద్దుతోంది నా ప్రేయసి 

మనసులోని వనాలన్ని శిశిరాలకు బలియైనవి
సుమదళాల ఉప్పెనలో ముంచుతోంది నా ప్రేయసి

మధురసుధలనెన్నిటినో  పెదవులలో నింపుకుంది
కోరినపుడు కాస్త కాస్త పంచుతోంది నా ప్రేయసి

నిరీక్షణల పర్వాలకు ఉద్వాసన పలుకుతుంది 
ప్రతిరేయిని రసధునిలా  మార్చుతోంది నా ప్రేయసి

విరహంలో మండుతున్నమనసునెలా చూసిందో
శీతజలధి తరగలలో తడుపుతోంది నా ప్రేయసి 

మదిలోపలి అమాసలకు నిలువనీడనీయదులే
సిరివెన్నెల దీపంలా వెలుగుతోంది నా ప్రేయసి 

కనులలోన వాలుతున్న చీకట్లను " నెలరాజా " 
తన చూపుల శరములతో తరుముతోంది నా ప్రేయసి    
                                                   - శ్రీ