21/03/2012

గుర్తుకొస్తున్నాయి



చిన్నప్పటి  ఆటపాటలు, గిల్లికజ్జాలు...
దసరా పండుగల పప్పు బెల్లాలు...
జెండా పండుగులప్పటి  తరగతి సున్నాలు, 
కట్టిన రంగు కాగితాల ఝాలర్లు....



పరీక్షల్లో పక్కోడి పేపర్లో  కొట్టిన కాపీలు...
అప్పుడప్పుడు పెట్టిన  స్లిప్పులు,
పట్టుబడినప్పుడు తిన్న పేకబెత్తం దెబ్బలు....
మార్కులు వెయ్యని టీచర్లని తిట్టుకున్న తిట్లు...

ఖాళీ దొరికితే చేసిన అల్లర్లు...
టీచర్లకు పెట్టిన మారు పేర్లు...
లీవు కోసం తెచ్చుకున్న దొంగాజ్వరాలు
ప్రొగ్రెస్ రిపోర్టుల్లో పెట్టిన నకిలీ సంతకాలు...

వేసవిలో ఎక్కిన స్కూలు ప్రాంగణపు మామిళ్ళు...
వెన్నెల రాత్రుల్లో ఆడుకున్న కబాడీ ఆటలు...
ఆటల పోటీలకు తిరిగిన ఊళ్లు,
సాధించిన కప్పులు....

లీజరు టైములో  పాటలకి వేసిన స్టెప్పులు...
ఇంటర్వెల్లో కొనుక్కున్న పుల్ల ఐసులు....
అమ్మాయిల కంపాస్ బాక్సుల్లో నుంచి కాజేసిన బఠానీలు...
చవితి పండుగప్పుడు కొట్టుకున్న పల్లేరుకాయలు....

అబ్బాయిల నూనూగు  మీసాలు...
అమ్మాయిల రంగురంగుల వోణీల రెపరెపలు...
నోట్సుల్లో పెట్టి అందించుకున్న ప్రేమలేఖలు...

ఇంకా చెప్పలేని అల్లర్లు...
చెప్పుకోలేని అల్లర్లు....

అన్నీ ఒకదాని వెనుక ఇంకోటి ఇప్పుడు కూడా 
కంటికి కనిపిస్తున్నాయి....
ఎప్పటికీ మర్చిపోకుండా 
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి...
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి....