14/09/2012

తనలోనే దాచేసుకుంటుందిగా ఈ వర్షం!...


గ్రీష్మ తాపాలకు వేడెక్కి 
నింగి నుండి జారే ప్రతి చినుకుని 
ఒడిసి పట్టుకోవాలనే ప్రయత్నంలో...
తలమునకలై ఉంది
ప్రకృతిలోని ప్రతి కణం...

రాత్రనక..పగలనక,
చేసిన తపస్సు ఫలించి 
వరం పొందిన వసుంధర 
పులకరించి పరవశిస్తోంది...

వేసవి వేడికి చిక్కి, శల్యమై
నెమ్మది నెమ్మదిగా సాగరుని వైపు 
పయనించే నదీ నదాలు...
మేఘమిచ్చిన జలోత్సాహంతో
వడివడిగా తమ ప్రియతముని
చేరాలని వేగిర పడుతున్నాయి...

ఎందరికో సంతోషాన్నిచ్చే ఈ వర్షం...
నాకు ఎందుకు  ఇష్టమో,
నిత్యం...వర్షంకోసం 
ఎందుకు ఎదురు చూస్తానో
తెలుసా నీకు?


నీకోసం 
నా కనులు చిందించే 
దుఃఖాశ్రువులను 
పరుల కంట పడనీయక
తనలోనే  దాచేసుకుంటుందిగా
ఈ వర్షం!...                                         @శ్రీ