02/05/2012

కను రెప్పల మధ్య దూరం...


మన  ప్రేమల మాట  ఎలా ఉన్నా,
మనం ఒకరికొకరు  దూరంగా.. 
ఉన్నామన్నది మాత్రం పచ్చి నిజం.


ప్రపంచం చిన్నది అయిపోయింది..
దూరాలు తగ్గిపోయాయి...
అని అందరూ అంటున్నారు.


ఇప్పుడు కూడా.........                               
నది.... సముద్రంలో కలవాలంటే
వేల మైళ్ళు  పరుగులెత్తాల్సిందే ....
వెన్నెలకాంతులు.... కలువని తాకాలంటే...
లక్షల మైళ్ళు పయనించాల్సిందే...

నిన్ను నేను చేరాలంటే ఎంత దూరం 
వెళ్ళాలో చెప్పగలనేమో కానీ,

రాత్రి అయితే చాలు, 
నీకోసం చూసి చూసి,
ఒకదానికొకటి దూరమైపోతున్న 
నా కను రెప్పలను కలపాలంటే....
వాటినెంత దూరం ప్రయాణం చేయించాలో 
మాత్రం చెప్పలేక పోతున్నా...... 


                                                                                                                               @శ్రీ