21/10/2013

|| చంద్రదర్శనం చేసే జాబిల్లి ||నీ తలపులలో నారూపాన్నే చూస్తూ
ఆరూపం చూసే చూపులకు
సిగ్గుపడిన చెక్కిలి గులాబి రేకులను 

నీ చేతిలోనే పండాలని
తహతహలాడే గోరింటలో కలిపి
అలదుకున్న అరచేతులు
మంకెనలని పరిహసిస్తున్నాయి...కెంపులని ధిక్కరిస్తున్నాయి.

కట్టుకున్న పట్టుపావడా
పట్టు లాంటి నీ మేనుపై
కొత్తశోభను సంతరించుకొంది.
విరిబోణి అందాలను దాచలేని
తెల్ల ఓణి అవస్థ పడుతోంది.
నీ సౌందర్యనిధులకి కావలి ఉన్నట్లుగా కనబడుతోంది.

పూలబాణాల విలుకాని
చెరకువింటి నారిలా
మల్లెమాలలు తురుముకొని
బంగారు జడగంటలు మోగిస్తూ
యవ్వనాన్ని అదిలిస్తూ
నీ ఒంపులను అనుకరిస్తూ
మెలికలు తిరుగుతోంది
నేను మెచ్చిన వాలుజడ
నీలికురుల నాగమాలిక

నాప్రేమ రంగరించిన పారాణి పూతలకి
కెందామరలుగ మారాయో
పెట్టుకున్న గోరింటకు
నీ కాలి మువ్వల రాత్రి ఊసులతో జతకలిపి
మరింత ఎరుపెక్కాయో
కట్టిన పరికిణీ బంగారుజరీ తగిలి కందాయో
తెలియని నీ పాదాల సౌందర్యానికి
తూరుపు దిక్కు సిందూరం సలాములంటోంది.

మర్రిమానుకి కట్టిన పూల ఊయలదే భాగ్యం
ఏడుమల్లెలెత్తు సౌకుమార్యానికి
ఆసనమయ్యిందనే గర్వం.
తామరతూళ్ళకి పాఠాలు చెప్పే చేతులకి
ఆసరా ఇచ్చానన్న అతిశయంతో డోలనాలు చేస్తోంది.

వెన్నెలమ్మ నోము పట్టడం మొదలెట్టకుండానే
నీ మోము చూచి ఉపవాసం చాలించింది
నక్షత్రాలు నీ నవ్వులు చూసి తమ పని లేదని
వేకువలో దాగేందుకు పరుగెత్తి పోయాయి.
నీ కిలకిలలతొ శుకపికాలు మేల్కొన్నాయి.

తదియనాటి చందమామ కోసం నీవు చూస్తుంటావు
చంద్రదర్శనం చేసే జాబిల్లిని అబ్బురంగా నేను చూస్తుంటాను.    
@శ్రీ 

(ప్రముఖ చిత్రకారులు వాసు Vasu Chennupalli గారికి కృతజ్ఞతలతో...)

19/10/2013

|| కృ(క్రి)ష్ణ వేణి ||
సదాశివుని జటాజూటం జడలు విప్పి ఆడినట్లు 
ఉమాదేవి నీలి కురులు పిల్లగాలికి ఎగిరినట్లు 
మహాబలేశ్వరునికి జలకన్నియ పుట్టినట్లు

వయసొచ్చిన పడుచు అల్లరి చేస్తూ పరుగులు తీస్తునట్లు
ముంగురులను సర్దుకుంటూ వయ్యారంతో సాగుతున్నట్లు
వడివడి నడకలతో బిరబిర పరుగులతో కదిలిపోతుననట్లు
కనబడుతోంది మా కృష్ణవేణి...తెలుగు నదులకే రారాణి.

ఆనకట్టల హద్దుల మన్నించి
పిల్లకాలువల ప్రవహించి
పంట చేలను తడిపి
పట్టెడన్నం పెట్టే కృష్ణమ్మ చేతులు
అన్నపూర్ణ హస్తాలకి ప్రతిరూపాలు.

మల్లికార్జునుని పాదాలు కడుగుతూ
భ్రమరాంబిక పారాణి తాకుతూ
కనకదుర్గమ్మకు ప్రణమిల్లుతూ
నల్లమల అడవులకు అందాన్నిస్తూ
హంసలదీవి దగ్గరకు రాయంచ నడకలతో చేరుకుంటుంది
తనను ప్రేమగా గుండెల్లో దాచుకొనే సాగరుని పరిష్వంగం లోనికి... ...@శ్రీ

08/10/2013

|| మా గోదారి (1) ||

గోదావరి మీద కవితలు, ఏక వాక్య కవితలు ,మినీ కవితలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి ఇప్పటికి.
అయినా గోదావరి లోని ప్రతి నీటి బొట్టుకి కవనం వ్రాయించగల శక్తి ఉంది. నాదైన కోణంలో కొన్ని కవితలు ఆ
జీవనదిపై వ్రాయాలని సంకల్పిస్తూ ... తల్లి గోదారికి ప్రణమిల్లుతూ .../\...@శ్రీ 
త్రయంబకేశ్వరుని జటాజూటంలోని గంగకు పోటీ వస్తూ
పార్వతీదేవి పాదాల పారాణి కడిగిన నీరులా
తొలిసంధ్య చల్లిన సిగ్గుపూలకళ్లాపికి ఎరుపెక్కినట్లుగా
అరుణుడి చురుకు చూపులకి వళ్ళంతా కందిపోయినట్లుగా
ప్రత్యూషంలోని సప్తాశ్వాల గిట్టలధూళి రాలి రంగిల్లినట్లుగా
ఎర్రబడిన తొలిపొద్దు అందాన్ని చూపే అద్దంలా
సూరీడు పంపిన కాంతులపేర్లు వేసుకొని
ఎంతో అందంగా కనిపిస్తోంది మా గోదారి.

కదిలే చేపలతో మిలమిలలాడుతూ
మత్స్యకారుల వలల చిక్కక తప్పించుకొని తోవచేసుకుంటూ
తెల్లని తెరచాపల అందాలను తిలకిస్తూ
నావికుల గీతాలకు మైమరుస్తూ
ఆ హైలెస్సలకు కదం తొక్కుతూ
వారి తాపాన్ని చల్లార్చేందుకు చల్లని తుంపర్లను చల్లుతూ
వడివడిగా కదిలిపోతుంది మా గోదారి.

సాయంసంధ్యను ప్రతిఫలిస్తూ
ఒడ్డునున్న జంటల గుసగుసలను ఓ చెవితో ఆలకిస్తూ
తీరాన్నున్న రెల్లుకొసల చక్కిలిగింతలకు మెలికలు తిరుగుతూ
అస్తాద్రి గుండెల్లో ఒదిగిపోయే సూరీడుకి వీడ్కోలు చెప్తూ
తొంగిచూసే మామను స్వాగతిస్తూ
సాగిపోతుంది మా గోదారి.

కొబ్బరాకుల వీవనలకు సేదదీరుతూ
నిశాకాంతులన్నిటినీ తానే తాగేయాలనే తపనతో
చంద్రుడినీ తారలను పట్టేసి తనలో దాచేస్తూ
నౌకావిహారాలు చేసే పడుచుజంటల చిలిపిచేష్టలకి చిన్నగా నవ్వుకుంటూ
తాను రేయంతా సాగరునితో చేసే అల్లరిని తలుచుకుంటూ
బిడియంగా కదిలిపోతుంది మా గోదారి. ...@శ్రీ 08/10/13.

04/10/2013

|| వాలు జడ ||


చేమంతుల అందానికి
పచ్చని పసిడి కాంతులిచ్చిన
నీ వాలుజడ

సన్నజాజుల పరిమళాన్ని
ప్రతి పాయలోను నింపుకున్న
నీ వాలుజడ.

గులాబుల గుబాళింపులను
గుచ్చెత్తి నను పిచ్చెత్తించే
నీ వాలుజడ

మొగలి పూల వాసనతో
రేయికి సెగలు రేపే
నీ వాలుజడ

మదనుని కొరడాలా
నీ యవ్వనాన్ని నియంత్రించే
నీ వాలుజడ

జడగంటలను చేతపట్టి
మదిలో వలపుల జేగంటలు మోగించే
నీ వాలుజడ.

మల్లెల మాలలను చుట్టుకుని
విల్లెత్తిన శృంగారంలా
నీ వాలుజడ.

సైకత వేదికలని తాకుతూ
యామినీ వాహినిలా సాగే
నీ వాలుజడ.

నీ నడుము కదలికలవద్ద
వయ్యారం నేర్చుకుంటూ
నీ వాలుజడ.

అలుకలో చెళ్ళుమని
నాబుగ్గల తాకిన పట్టుకుచ్చుల
నీ వాలుజడ

ప్రణయంలో నా మెడను చుట్టి
చెంతకు లాగిన
నీ వాలు జడ.

వసంతుని ధనువుకి
కట్టిన పూలనారిలా
నీ వాలుజడ.

రాత్రులలో కామునితో
కయ్యానికి కాలుదువ్వే
నీ వాలుజడ.

సరసాలలో మిన్నాగులా కదులుతూ
క్షీరనీరాలింగనాల మధ్య నలుగుతూ
సిగ్గుతో మెలికలు తిరిగే
నీ వాలుజడ. ...@శ్రీ