06/01/2013

ఎవరి ప్రేమది పైచేయి?
నీ పదముల సవ్వడి
వేల మైళ్ళ  దూరం నుంచే 
నా చెవులు ఎలా పసిగడతాయో  తెలియదు...

నీ సిగలోని పూల పరిమళం 
కోసుల దూరం నుంచే 
నా నాసిక ఎలా ఆఘ్రాణిస్తుందో తెలియదు...

నీవక్కడ నవ్విన చిరునవ్వులవెలుగులు 
ఇక్కడ నా కంటిలో 
ఎందుకు ప్రతిఫలిస్తాయో తెలియదు... 

నీవక్కడ నను తలచిన విషయానికి 
ఇక్కడ నా మనసుకి 
ఎందుకు పొర మారుతుందో  తెలియదు...

నీవక్కడ  నా చిత్రాన్ని తాకితే 
ఇక్కడ నా మేను
ఎందుకు పులకరిస్తుందో తెలియదు...


కానీ....
ఇక్కడ  నా కంట కన్నీరొలికితే 
అక్కడ నీ  చెక్కిళ్ళు 
ఎందుకు తడుస్తున్నాయో మాత్రం  తెలుసు 

నా  గుండెలోని విరహపు కాట్లు 
అక్కడ నీ  ఎదలో 
ఎందుకు పలుగు పోట్లౌతున్నాయో  మాత్రం తెలుసు.

నీ వియోగం నన్నిక్కడ అనుక్షణం  మింగేస్తుంటే 
అక్కడ నీకు ఊపిరి
ఎందుకు సలపదో మాత్రం  తెలుసు.

తెలిసీ తెలియనిదల్లా ఒక్కటే.
అర్ధమైనా...ఎప్పటికీ అర్ధం కానిదొక్కటే.
ఎవరి  ప్రేమది 'పై చేయో'?                            @శ్రీ