27/11/2016

|| ఇరుచోట్లా ఉన్నారు - తెలుగు గజల్ || అనువాదపు గజల్జనాబ్ నిదా ఫాజలీ జీ వ్రాసిన ఈ గజల్ చూడండి
(ఏ దేశమైనా గానీ) దేశాన్నిగానీ, నివసించే ఎక్కువశాతం ప్రజలనుగానీ
ధర్మం( మతం) పేరుతో దూషించడంగానీ నిజంగా నేరమేననిపిస్తుంది 
అతితక్కువమంది దుష్టులవలన దేశం పేరు అపఖ్యాతిపాలౌతుంది 
మతాన్ని కూడా అదే దృష్టితో చూడడం అలవాటు చేసేసుకుంటాం.

నేను ఆమధ్య ఒక సభలో మాట్లాడుతూ అన్నాను
"విశ్వంలో వెలుతురుకంటే చీకటే ఎక్కువ ఉంది  
లోకులలో  చెడుకంటే  మంచితనమే ఎక్కువ ఉంది" అని. 
మంచితనానికి పెద్దపీట వేద్దాం. చెడుని కూకటివేళ్ళతో పెకలించేద్దాం... #శ్రీ .   


पाकिस्तान से लौटने के बाद 
लिखी गयी जनाब निदा  फ़ाज़ली जी की इस ग़ज़ल को पढ़ने के बाद 
लगा कि देश कभी गलत नहीं होसक्ता है, 
जनता भी गलत नहीं होसकती है 
केवल कुछ कट्टरलोगों की वजह से देश बदनाम होता है 

इस विश्व में  रोशनी से अन्धेरा ज्यादा है 
पर लोगों में बुराई से अच्छाई  ज्यादा है 

अच्छाई के साथ चलेंगे। .. बुराई को नाश कर देंगे। 

||  ఇరుచోట్లా ఉన్నారు - తెలుగు గజల్ || అనువాదపు గజల్ 

మనుషుల్లో రాకాసులు ఇరుచోట్లా ఉన్నారు 
అల్లా విష్ణువు శివుడు  ఇరుచోట్లా ఉన్నారు

హింసను పెంచే వ్యక్తులు వేరేగా ఉంటారు 
నగరాల్లో దుర్మార్గులు ఇరుచోట్లా ఉన్నారు

ఈశ్వరుడూ రెహమానూ వేరువేరు కాదులే 
పూజలు చేసే భక్తులు ఇరుచోట్లా ఉన్నారు 
( అనువాదంలో కాస్త స్వేచ్ఛను తీసుకున్నాను ఈ షేర్ కి ) 

హిందువులూ ముస్లిములూ ఖుషీగానె(కలిసిమెలిసి)ఉంటారు 
ఇబ్బందులు పడే ప్రజలు ఇరుచోట్లా ఉన్నారు

ఆతని పాటలు(కవితలు) వింటూ పరవశించిపోతారు 
మీర్^కున్న అభిమానులు ఇరుచోట్లా ఉన్నారు


जनाब निदा  फ़ाज़ली जी की  ग़ज़ल 
(पाकिस्तान से लौटने के बाद ) 

इन्सान में हैवान यहाँ भी है वहाँ भी
अल्लाह निगहबान यहाँ भी है वहाँ भी |

खूँख्वार दरिंदों के फ़क़त नाम अलग हैं
शहरों में बयाबान यहाँ भी है वहाँ भी |

रहमान की कुदरत हो या भगवान की मूरत
हर खेल का मैदान यहाँ भी है वहाँ भी |

हिन्दू भी मज़े में हैमुसलमाँ भी मज़े में
इन्सान परेशान यहाँ भी है वहाँ भी |

उठता* है दिलो-जाँ से धुआँ दोनों तरफ़ ही
ये 'मीर' का दीवान यहाँ भी है वहाँ भी |

26/11/2016

|| రాదో మరి - తెలుగు గజల్ |||| రాదో మరి - తెలుగు గజల్ || 

సూర్యుడు వెళిపోతున్నా రాత్రెందుకు రాదో మరి
రాత్రి వచ్చినాగానీ కలలెందుకు లేవో మరి

చివురు చూడకుండానే ఎండుటాకు రాలుతుంది 
ఆనందం అడుగిడినా వెతలెందుకు పోవో మరి .

గజిబిజి గీతలలోనే బతుకు చిక్కుకుంటోంది
నుదిటిమీద భాగ్యరేఖ జాడెందుకు లేదో మరి 

గుండెలోని శోకమంత పొంగిందని తెలుస్తోంది 
పొడిబారిన కనులనుండి నీళ్ళెందుకు రావో మరి

కాలం మాన్పని గాయం లేనేలేదంటారు 
యుగాలెళ్ళిపోతున్నా బాధెందుకు పోదో మరి

పగబట్టిన విధికూడా అనుక్షణం చంపుతోంది 
ప్రాణాలను హరియించే యముడెందుకు రాడో మరి

ఆరు రుచుల మిశ్రమాన్ని సేవిస్తూ "నెలరాజా"
వేపవిత్తులను మింగని బతుకెందుకు చేదో మరి 

                                                  #శ్రీ 

20/11/2016

|| విడువను ఎపుడూ - తెలుగు గజల్ ||నిను వలచేందుకు సుముహూర్తాలను వెదకను ఎపుడూ 
పెండ్లాడేందుకు పంచాంగాలను చూడను ఎపుడూ

నీ మదిలోనే వలపుల వేల్పుని చేస్తివి చెలియా
కపటపు ప్రేమను చూపే వారిని చేరను ఎపుడూ 

నీ సన్నిధిలో పగలూ రేయీ పున్నములేగా 
వెన్నెలనొంపే శరత్కాలమును తలవను ఎపుడూ

నీ నవ్వులలో నందనవనులే విరిసెను సఖియా 
గాలికి గంధము పూసే పూలను కోయను ఎపుడూ 

కాముడు మలచిన బంగరుశిల్పం నను వరియించెను
కలలోనైనా వేరే భామను కోరను ఎపుడూ

నీ ప్రేమంతా కొంచెంకొంచెం దోచుట తెలియును 
వలలను వేస్తూ పట్టాలంటే  దొరకను ఎపుడూ 

ప్రళయం రానీ యుగాలు పోనీ  ఓ "నెలరాజా" 
దేవుని ఎదుటన పట్టిన చేతిని విడువను ఎపుడూ


18/11/2016

|| ఎప్పటికో ||శ్రీ తన్మయ్ బుఖారియా జీ రచనకు స్వేఛ్చానువాదం || ఎప్పటికో || అన్ని దిక్కులలోని చీకట్లన్నీ ఒక్కటైపోయాయి. కొడిగట్టిన నా చేతిదీపం ఎప్పటిదాకా వెలుగుతుందో ? ముసురుకుంటున్న తిమిరాలను ఎప్పటికి తొలగిస్తుందో ? ఎముకలుకొరికే చలిగాలులను చీల్చుకుంటూ... అడుగుపెడుతున్న వసంతాన్ని అడ్డుకుంటున్నాయి... ఎందుటాకుల కాలంతో శాశ్వతసంధి చేసుకున్న సుడిగాలులు కాపలా కాయల్సిన తోటమాలే ... తోటకు శత్రువైపోతుంటే, ఆపత్కాలంలో కొమ్మలపైన గూళ్ళలో చిక్కుకున్న పక్షిపిల్లల ఆర్తనాదాలను ఎవరు వింటారో ? వాటి ప్రాణాలను ఎవరు రక్షిస్తారో ? వికృతంగా అరిచే గుడ్లగూబలు సంగీతసామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంటే... మధురస్వరాలాపన మాత్రమే తెలిసిన కోకిలలు ప్రాణాలను త్యాగిస్తున్నాయి. గతంలో కుహుకుహులతో కలకలలాడే ఈ వనానికి పూర్వవైభవం ఎప్పటికి వస్తుందో ? तन्मय बुखारिया जी की कविता : संगठित सारे अँधेरे होगये एक मेरा दीप कबतक टिमटिमाये ... तम हटाये आँधियों ने संधि करली ...पतझड़ों से अल्पमत में होगई है अब बहारें बाग़ का दुश्मन बना खुद बाग़बान प्रश्न है बुलबुले किसको पुकारें पद प्रतिष्टा बाँटलिए उल्लुओं ने कोकिलाएं आत्मह्त्या कर रही है इस चमन को कौन मरने से बचाएं

|| వెలుగుతూనె ఉండాలి - తెలుగు గజల్ ||మనసులోన వలపుదివ్వె వెలుగుతూనె ఉండాలి (ఉండాలీ) 
ముసురుతున్న వియోగాన్ని తరుముతూనె ఉండాలి

కప్పుకున్న నివురంతా ఎగిరిఎగిరిపోవాలి
కల్లలన్ని  నిజాలలో కాలుతూనె ఉండాలి

చీకట్లకు చూపులలో నిలువనీడనీయవద్దు
కన్నులలో పున్నములను నింపుతూనె ఉండాలి

కదులుతున్నపాదాలకు పూలస్పర్శ తగలాలి  
బాటలోని ముళ్లన్నీ తొలగుతూనె ఉండాలి

రాయిలోన రప్పలోన అన్వేషణ ఆపాలి 
మనిషిలోన మాధవుడిని వెదుకుతూనె ఉండాలి

మెడకుచుట్టినపుడు మనసు 'పట్టు' తప్పిపోతుంది 
'సత్య'లాగ జడను...చెలియ విసురుతూనె ఉండాలి

పాషాణపు మనసనుకొని వదిలేయకు "నెలరాజా" 
ప్రేమించే హృదయంతో చెక్కుతూనె ఉండాలి   

16/11/2016

|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ స్వర్ణోత్సవం నాడు 
భారతీయభాషల కవి సమ్మేళనంలో చదివిన కవిత. 


|| కృతఘ్నులైన కొంతమంది బిడ్డలు ||

అపరదానకర్ణులనిపించుకోవాలనేమో...
కనీ పెంచినందుకు కృతజ్ఞతను చూపకుండా 
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు దానం చేసేస్తున్నారు
కృతఘ్నులైన  కొంతమంది బిడ్డలు.  

“మదర్స్ డే” నాడు అమ్మ ఫోటోలను ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొని 
తల్లిగురించి ఎవరో రాసిన కొటేషన్లు షేర్ చేసుకుంటూ 
లోకుల దృష్టిలో తల్లిని దేవతలా పూజించేవారి జాబితాలో 
మొదటిస్థానాన్ని కొట్టేస్తూ ఉంటారు.

ఫాదర్స్ డే నాడు తండ్రి చేసిన త్యాగాల లిస్టుతో 
చదివేవాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగేంత గొప్పగా కవితలనల్లేస్తారు,
తల్లే కాదు తండ్రికూడా ఎంతో పూజనీయుడేనంటూ 
ఎన్నో మాటలు మాట్లాడతారు.

తనను కన్యాదానం చేసేటప్పుడు
అమ్మిన పొలాలు , తాకట్టుపెట్టిన ఆస్తుల సంగతి 
ఎప్పుడూ తలవనైనా తలవరు 
కరిగిపోయిన అమ్మ పుస్తెల గురించి ఒక్కమాట కూడా మాట్లాడరు.
తల్లిదండ్రులను తమతో తీసుకెళ్లలేమని కుంటిసాకులు చెప్పే కూతుళ్ళు .

తమ చదువులకోసం తండ్రి చేసిన ఓవర్ టైములు 
తీసుకున్న లోన్ల సంగతి ఎప్పుడూ గుర్తుచేసుకోవడానికే  ఇష్టపడరు ... 
రెండుచేతులా డాలర్లో ,రూపాయలో సంపాదించుకొనే కొడుకులు 

తల్లైనా తండ్రైనా మరణించిన కబురు తెలియగానే 
విద్యుత్‌ దహనవాటికల్లో దహన సంస్కారాలు చేయించి 
గంగలోనో గోదారిలోనో చితాభస్మాన్ని కలిపి కాస్త పుణ్యాన్ని
తమకు మెయిల్ చేసే వెబ్ సైట్లకోసం వెదుకుతూ ఉంటారు...
పున్నామనరకాన్ని తప్పిస్తారని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న “కొడుకులు” .

ఆశీస్సులు మాత్రమే ఇస్తూ 
పిల్లల ఉన్నతికోసం కనిపించే ప్రతీ దేవుళ్ళకీ
మొక్కుకునే తల్లిదండ్రులు మారాలి. 
బతికుండగానే నరకాన్ని చూపించిన పిల్లలకి 
కాస్తంత పుణ్యం కూడా దొరకకూడదనీ...
తమ ప్రేమను తలదన్నినందుకు, 
వాళ్ళ పాపం వాళ్ళనే కాల్చేయాలనీ 
కార్చే కన్నీటినే మంత్రజలంగా మార్చి జల్లడం నేర్చుకోవాలి ...
గుండెను బండరాయిగా చేసుకొని శపించడం నేర్చుకోవాలి ... 


11/11/2016

|| అవసరం - తెలుగు గజల్ ||
బాధలన్నీ అణిచి పెదవులను విప్పుతూ నవ్వడం అవసరం
చిరునవ్వు విసురుతూ ద్వేషాన్ని నిలువునా చీల్చడం అవసరం పనిలేనివారితో గడిపేటి సమయాలు ఎందుకూ కొరగావు సద్గురువుతో ఉండి వెలలేని జ్ఞానాన్ని పొందడం అవసరం మేధావితో చర్చ మధ్యలో ఆపడం మర్యాద కాదులే పసలేని అవివేకి వాదనను మధ్యలో తుంచడం అవసరం గాలించలేనపుడు బొగ్గుతో బాటుగా మండిపోతుంటాయి కర్బనపు గనిలోని వెలలేని వజ్రాల్ని ఏరడం అవసరం మోదాలు కొలువున్న కోవెలను పేల్చేసి కబ్జాలు చేస్తాయి ఖేదాలు నిర్మించు ఆకాశ సౌధాలు కూల(ల్చ)డం అవసరం జీవించి ఉన్నపుడు కష్టాల జ్వాలలో కాలుతూ ఉంటారు పేదోళ్ళ చితులపై చందనపు చెక్కల్ని పేర్చడం అవసరం ప్రేమరాహిత్యాన్ని మోయలేకున్నాను ఎందుకో "నెలరాజ" ప్రియురాలి వలపుతో మదిలోని మంటల్ని ఆర్పడం అవసరం #శ్రీ

09/11/2016

|| ఈ రాతిరి - తెలుగు గజల్ ||మనం ఒక్కటైనప్పుడు పండుతోంది  ఈ రాతిరి 
విరహాలను దూరంగా పంపుతోంది ఈ రాతిరి 

వెలుగుపైన గెలవాలని యుద్ధకాంక్షతో ఉన్నది 
చీకట్లను రణభూమికి పంపుతోంది ఈ రాతిరి 

సుగంధాన్ని పూసుకొనే కోరికతో ఉంటుంది 
విచ్చుకున్న మల్లెలపై జారుతోంది ఈ రాతిరి 

పగటిలోని గాయాలకు లేపనాల కోసమేమొ
జాబిల్లిని రారమ్మని పిలుస్తోంది ఈ రాతిరి 

కామునితో కలహించే సమయంలో నెలరాజా 
ఇరువురమూ గెలవాలని మొక్కుతోంది ఈ రాతిరి   ... #శ్రీ 

08/11/2016

|| ఈ వెన్నెల - తెలుగు గజల్ ||చీకటిపై కాంతిపూలు జల్లుతోంది ఈ వెన్నెల 
చలచల్లని బాణాలను రువ్వుతోంది ఈ వెన్నెల

తీరకాంత కొప్పులోన మెరవాలని ఉన్నదేమొ
తరగలపై మల్లెలుగా మారుతోంది ఈ వెన్నెల 

చందమామనొంటరిగా క్షణమైనా విడువదులే 
కలువపూల కళ్ళలోకి జారుతోంది ఈ వెన్నెల

ప్రణయించే జంటలన్ని తనకంట్లో పడెనెమో
జాబిల్లిని మబ్బు(ముగ్గు)లోకి లాగుతోంది ఈ వెన్నెల

పున్నమంటి  చెలిచిత్రం గీయాలని తలచాను 
పుచ్చపూల కాన్వాసుగ మారుతోంది ఈ వెన్నెల 

ఒంటరైన ప్రేమికులతొ వైరం తనకెందుకో
నేస్తమైన విరహానికి చూపుతోంది ఈ వెన్నెల

సుగంధాన్ని తనమేనికి పూసుకుంటు "నెలరాజా"
జాజిపూల తీగలపై పాకుతోంది ఈ వెన్నెల

06/11/2016

|| నా ప్రేయసి - తెలుగు గజల్ ||
చాందినీల పల్లకిలో కదులుతోంది నా ప్రేయసి  
పాలపుంతలకు తళుకులనద్దుతోంది నా ప్రేయసి 

మనసులోని వనాలన్ని శిశిరాలకు బలియైనవి
సుమదళాల ఉప్పెనలో ముంచుతోంది నా ప్రేయసి

మధురసుధలనెన్నిటినో  పెదవులలో నింపుకుంది
కోరినపుడు కాస్త కాస్త పంచుతోంది నా ప్రేయసి

నిరీక్షణల పర్వాలకు ఉద్వాసన పలుకుతుంది 
ప్రతిరేయిని రసధునిలా  మార్చుతోంది నా ప్రేయసి

విరహంలో మండుతున్నమనసునెలా చూసిందో
శీతజలధి తరగలలో తడుపుతోంది నా ప్రేయసి 

మదిలోపలి అమాసలకు నిలువనీడనీయదులే
సిరివెన్నెల దీపంలా వెలుగుతోంది నా ప్రేయసి 

కనులలోన వాలుతున్న చీకట్లను " నెలరాజా " 
తన చూపుల శరములతో తరుముతోంది నా ప్రేయసి    
                                                   - శ్రీ 

05/11/2016

|| ఎప్పుడూ సరికాదు - తెలుగు గజల్ || అనువదించిన గజల్జనాబ్ నిదా ఫాజలీ జీ రచించిన ఒక అద్భుతమైన గజల్ ని అనువదించే 
ప్రయత్నం చేసాను. అనువాదంలో స్వేచ్ఛ తీసుకోకుంటే భావాలు 
ఎప్పుడూ మాచ్ అవ్వవు. మూలానికి అతి దగ్గరగా నా అనువాదం 
ఉండేలా చూసుకున్నాను 

|| ఎప్పుడూ సరికాదు - తెలుగు గజల్ || అనువదించిన గజల్ 

వదిలేటి పొగలతో  చంద్రుడిని కమ్మడం ఎప్పుడూ సరికాదు 
పసివారి స్వప్నాల్ని నిలువునా దోచడం ఎప్పుడూ సరికాదు

ప్రాణాలు వదిలాక ప్రేమికుల సంగమం దాదాపు దుర్లభం 
ఆత్మలెగిరే దార్లు ఒకటవక పోవడం ఎప్పుడూ సరికాదు 

భూమిపై  జీవించి ఉండేది తక్కువని ఎవరికీ తెలియదు
పదునాల్గు వర్షాల్ని బాల్యాన గడపడం ఎప్పుడూ సరికాదు 

నువు నమ్మినటువంటి ధర్మాన్ని పాటించి జీవనం సాగించు 
గోప్పోళ్ళ సూక్తులను వల్లిస్తు ఉండడం ఎప్పుడూ సరికాదు 

ఏకాంత వేళలో నీలోని నీవుతో అపుడపుడు మాట్లాడు 
సభలున్న ప్రతిచోట హాజరౌతుండడం ఎప్పుడూ సరికాదు 

తన్హాయి కనబడితె ఎగిరొచ్చి వాలిపోతుంటాయి "నెలరాజ"
నిదురించు తలపుల్ని మేల్కొల్పుతుండడం ఎప్పుడూ సరికాదు  #శ్రీ 

                                  ***
మూలం :  

जनाब निदा फाजली की गजलें सभी को पसंद है 
उन गजलों में एक मोतीको आपके सामने लाया 
और तेलुगु में अनुवाद भी प्रस्तुत कर रहा हूँ | 

धुआँ उड़ाकर चाँद बुझाना अच्छी बात नहीं 
बच्चों के सपनों को चुराना अच्छी बात नहीं

जिस्मोंके बाहर भी मिलना जुलना नामुमकिन है 
रस्ते में  रस्ता कतराना अच्छी बात नहीं

उम्र ही कितनी मिलती है दुनिया में जीने को 
इस पर चौदह साल गवाना अच्छी बात नहीं

तेरा अपना जिया हुआ ही तेरा अपना है 
औरों की बाते दोहराना अच्छी बात नहीं

कभी अकेले में खुद से भी बाते करके देख 
हर महफ़िल में आना - जाना अच्छी बात नहीं

तन्हाई में भूली बिसरी यादें बसती है 
सोतोंको नींद से जगाना  अच्छी बात नहीं
 

03/11/2016

|| వారెవ్వరు - తెలుగు గజల్ |||| వారెవ్వరు - తెలుగు గజల్ || 

తొలకరిలో చినుకుపూలు జల్లుతున్న వారెవ్వరు 
హరివింటిని రంగులలో వంచుతున్న వారెవ్వరు

చీకటిలో మగ్గుతున్న తిథులు వెలిగిపోతున్నవి 
ఈ జగతిని వెన్నెలలో ముంచుతున్న వారెవ్వరు

పాకుతున్న పురుగొక్కటి రెక్కలొచ్చి ఎగురుతోంది 
సీతకోక చిలుకలాగా మార్చుతున్న వారెవ్వరు 

పడిలేచే తత్వానికి గురువులాగ అనిపించును 
కెరటానికి పట్టుదలను నేర్పుతున్న వారెవ్వరు

కిరణాలే కుంచెలైతె బిందువులే రంగులగును
సప్తవర్ణ చిత్రాలను  గీయుచున్న వారెవ్వరు

నిశలనాక్రమించేందుకు గుంపులుగా ఎగురుతాయి  
కాంతుల దివిటీలెన్నో మోయుచున్న వారెవ్వరు 

తారలకళ్ళకు గంతలు కట్టివేసి  "నెలరాజా" 
కలువలతో సరసాలను ఆడుతున్న వారెవ్వరు

02/11/2016

|| మరువలేను - తెలుగు గజల్ ||


మొదటిసారి నినుచూసిన సమయమెపుడు మరువలేను 
మనసులు పెనవేసుకున్న రేయినెపుడు మరువలేను

పాణిగ్రహణమైనట్లే అనిపించిన కాలము అది 
చేతిలోన చేయేసిన వేళనెపుడు మరువలేను

మార్చుకున్న దండలలో పూలు వాడవెప్పటికీ  
కళ్యాణము చేసుకున్న ఘడియనెపుడు మరువలేను

మౌనంతో చంపాలని ఎందుకు అనుకుంటావో
ప్రాణమంటు నను పిలిచిన పిలుపునెపుడు మరువలేను 

సుదూరాన నీవుంటే చిత్రవధే "నెలరాజా" 
ఒక్కటిగా కరిగించిన రాత్రినెపుడు  మరువలేను


|| కనిపిస్తూ ఉంటావు - తెలుగు గజల్ ||విచ్చుకున్న వెన్నెలలా కనిపిస్తూ ఉంటావు ( ఉంటావూ ) 
నిను మాత్రమె చూడాలని కలహిస్తూ ఉంటావు

కన్నులలో శ్రీరాగము ఎలా గొంతు విప్పినదో 
చూపులలో సరసపదిని వినిపిస్తూ ఉంటావు

*వలపుపూల శరములతో గుండెను భేదిస్తావు
రేకులతో నీ పేరును ముద్రిస్తూ ఉంటావు

షాయరీలతో దోస్తీ కలమెప్పుడు చేసినదో
ప్రేమగజళ్ళెన్నిటినో వ్రాయిస్తూ ఉంటావు

వియోగాల జ్వాలలన్ని ఆర్పుటెలా తెలిసిందో 
నీ నవ్వుల మేఘాలను పంపిస్తూ ఉంటావు

విరహంతో వేగుతున్న మనసునెపుడు చూసావో
హేమంతపు హృదయంతో స్పర్శిస్తూ ఉంటావు

నా మదిలో మోదాలను పండిస్తూ "నెలరాజా" 
ఖేదాలకు చుక్కలనే చూపిస్తూ ఉంటావు

పూర్వం రాజులు బంగారపు మొనలున్న బాణాలను , ఇనుపబాణాలను(నారాచము)... ఇంకా వేర్వేరు ముఖాలు , గుర్తులు ఉన్న బాణాలను శత్రువులపై ప్రయోగించేవారు . అలాగే వాళ్ళ వాళ్ళ పేర్లు ఉన్న 
బాణాలను ప్రయోగించేవారు . ఇక్కడ అదే భావాన్ని ప్రేయసి ప్రయోగించిన 
వలపుపూల బాణాలు గుండెను చీల్చాయనీ , ఆ పూల రేకులపై ఉన్న ఆమె పేరు 
గుండెలో ఎన్నోసార్లు ముద్రించబడినదని వ్రాసాను. రస హృదయలు ఈ షేర్^ని ఆస్వాదిస్తారని ఇలా విపులంగా ఈ షేర్ గురించి చెప్పాను