15/07/2012

యశోద మనసు.



ఎన్ని జన్మల పుణ్యమో...
ఎన్ని  నోముల ఫలమో....
నాకడుపు పండి 
నా ఒడి నిండినది నీ రాకతో...

కరిమబ్బు ఎపుడూ అందంగా అగుపించలేదు...
నీల మేఘంలా నీవు నాకు కనిపించనంత వరకూ...

నల్లని వర్ణంలో సౌందర్యం కానలేకపోయాను....
ఇంద్రనీలమణిలా ప్రకాశించే నిన్ను చూసేంతవరకూ...

నల్లకలువలలోని  ఎర్రదనం తెలియదు నాకు...
నీ కలువరేకుల నయన సందర్శనం అయ్యేదాకా...

కదంబ పూల అందం ఎప్పుడో తెలిసిందో చెప్పనా?
నీ కర్ణాలకి ఆభరణాలైనపుడే....

గుండెలపై  నీపాద తాడనం నొప్పి ఎందుకు పుట్టించదా?
అని చూస్తే అపుడుకదా నా కంట పడినాయి..
సుతిమెత్తని నీ చరణారవిందాలు..


నందుని  యింట  విరిసిన ఆనందాల 'హరి'విల్లువి నీవు...
యదువంశనందనంలో వికసించిన పారిజాతానివి నీవు...
నా కంటి వెలుగువి నీవు...
మా ఇంటి వేలుపు నీవు......
నీవు బాలునిలా  కాదు లోకపాలకుడిలా  అనిపిస్తావు నాకు..
అందుకే చేయి చాచి అర్ధిస్తున్నాను  కృష్ణా!
ప్రతి జన్మకీ నీ తల్లినయ్యే ఒక్క వరమూ నాకు ప్రసాదించవూ?