02/11/2016

|| మరువలేను - తెలుగు గజల్ ||


మొదటిసారి నినుచూసిన సమయమెపుడు మరువలేను 
మనసులు పెనవేసుకున్న రేయినెపుడు మరువలేను

పాణిగ్రహణమైనట్లే అనిపించిన కాలము అది 
చేతిలోన చేయేసిన వేళనెపుడు మరువలేను

మార్చుకున్న దండలలో పూలు వాడవెప్పటికీ  
కళ్యాణము చేసుకున్న ఘడియనెపుడు మరువలేను

మౌనంతో చంపాలని ఎందుకు అనుకుంటావో
ప్రాణమంటు నను పిలిచిన పిలుపునెపుడు మరువలేను 

సుదూరాన నీవుంటే చిత్రవధే "నెలరాజా" 
ఒక్కటిగా కరిగించిన రాత్రినెపుడు  మరువలేను


|| కనిపిస్తూ ఉంటావు - తెలుగు గజల్ ||విచ్చుకున్న వెన్నెలలా కనిపిస్తూ ఉంటావు ( ఉంటావూ ) 
నిను మాత్రమె చూడాలని కలహిస్తూ ఉంటావు

కన్నులలో శ్రీరాగము ఎలా గొంతు విప్పినదో 
చూపులలో సరసపదిని వినిపిస్తూ ఉంటావు

*వలపుపూల శరములతో గుండెను భేదిస్తావు
రేకులతో నీ పేరును ముద్రిస్తూ ఉంటావు

షాయరీలతో దోస్తీ కలమెప్పుడు చేసినదో
ప్రేమగజళ్ళెన్నిటినో వ్రాయిస్తూ ఉంటావు

వియోగాల జ్వాలలన్ని ఆర్పుటెలా తెలిసిందో 
నీ నవ్వుల మేఘాలను పంపిస్తూ ఉంటావు

విరహంతో వేగుతున్న మనసునెపుడు చూసావో
హేమంతపు హృదయంతో స్పర్శిస్తూ ఉంటావు

నా మదిలో మోదాలను పండిస్తూ "నెలరాజా" 
ఖేదాలకు చుక్కలనే చూపిస్తూ ఉంటావు

పూర్వం రాజులు బంగారపు మొనలున్న బాణాలను , ఇనుపబాణాలను(నారాచము)... ఇంకా వేర్వేరు ముఖాలు , గుర్తులు ఉన్న బాణాలను శత్రువులపై ప్రయోగించేవారు . అలాగే వాళ్ళ వాళ్ళ పేర్లు ఉన్న 
బాణాలను ప్రయోగించేవారు . ఇక్కడ అదే భావాన్ని ప్రేయసి ప్రయోగించిన 
వలపుపూల బాణాలు గుండెను చీల్చాయనీ , ఆ పూల రేకులపై ఉన్న ఆమె పేరు 
గుండెలో ఎన్నోసార్లు ముద్రించబడినదని వ్రాసాను. రస హృదయలు ఈ షేర్^ని ఆస్వాదిస్తారని ఇలా విపులంగా ఈ షేర్ గురించి చెప్పాను