23/07/2012

బృందావనం
కోమలితో కోలాటాలు...
సరసిజతో సల్లాపాలు...
మందాకినితో మదన క్రీడలు...
జలజాక్షితో జలక్రీడలు...

పద్మాక్షితో పూబంతులాట...
పావనితో పాచికలాట...
వయ్యారితో ఒప్పులకుప్పలు...
చంద్రముఖితో చెమ్మచెక్కలు...

హాసినితో పరిహాసాలు..
దామినితో దాగుడుమూతలు...
ఊర్వశితో ఉయ్యాలాటలు 
గీతికతో గానలహరులు...
నందినితో నౌకా విహారాలు...
వనజతో వన విహారాలు...

ఓ లలన బుగ్గల సిగ్గులు చిదుముతూ ఒక చోట...
ఓ చంచల  చెంగు లాగుతూ వేరొక చోట...
ముద్దులు దొంగిలిస్తూ ఒకచోట...
ఆలింగన సుఖమిస్తూ మరొక చోట...
అలుక తీరుస్తూ ఒక చోట...
కొప్పున పూలచెండు పెడుతూ వేరొకచోట..

మాలినితో మణిమండపంలో...
సారణితో సైకత వేదికలపై...
కౌముదితో  క్రీడాపర్వతాలపై...
లహరితో లతా మండపాలపై...

ఇటు చూస్తే...కృష్ణుడు...
అటుచూస్తే కృష్ణుడు....
సర్వం కృష్ణ మయం..
బృందావనం... సరస సల్లాపాల కేళీవనం..
మురళీరవాల మోహన సంగీత మయం....

అందరికీ ఒక్కరు...ఒక్కరికీ అందరుగా కనిపించే దృశ్యం...
మాయలమారి మాయా వినోదం...
పదహారు వేలమంది కృష్ణుల సందర్శనం...
అపురూపం...అద్భుతం...అనిర్వచనీయం....