23/11/2012

దుఃఖం


దుఃఖం... నిన్ను  దాచాలంటే 
అందరికీ సాధ్యం కాదని తెలుసు...
పెల్లుబికే ఉప్పెనను రెండుకళ్ళలో
దాచటం అంటే మాటలా?

బిందువులో సింధువును 
చూపడం సులువే గానీ 
గుప్పెడంత గుండెలోని శోకాన్ని 
ఆల్చిప్పలాంటి ఆ కళ్ళలో దాచటం ఎంత కష్టం?

ఆనందబాష్పాలు చిందిస్తే 
బుగ్గల మీద జారిన 
కన్నీటి  చుక్కలు సైతం 
వెండి తళుకులతో మెరుస్తూ 
ఆనందాన్ని ప్రతిఫలిస్తాయి...
కాంతిని విఫలం (వక్రీభవించి) చేసి 
సప్తవర్ణాలను వెదజల్లుతాయి.

వేదనతో, ఆవేదనతో 
ఆ కళ్ళు వర్షించే 
ఆమ్లధారల  ధాటికి
లేత గులాబి బుగ్గలపై  
ఎప్పటికీ మిగిలిపోయే 
చారికలుగా  నిలిచిపోతాయి...

ముఖాన్ని...
కృత్రిమముఖంలో 
దాచేసుకున్నా 
ఆ ముఖం పైన కూడా 
నీ అవశేషాలు 
స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి...

మనస్సంద్రంలో 
నిలువెత్తు కెరటాలతో ఎగసిపడే 
దుఖాన్ని వర్షించాలంటే 
వేయి కళ్ళు కావాల్సిందే...
వేలనదులై పారాల్సిందే...

నిన్ను నా చిరునవ్వులో 
దాచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా,
ఆ చిరునవ్వునే కన్నీరు కార్పించే శక్తి 
నీకు ఎవరిచ్చారో?