24/10/2016

|| కావాలి - తెలుగు గజల్ ||



వలపుల్ని పంచేటి మనసొకటి కావాలి మధువుల్ని నింపేటి పలుకొకటి కావాలి ఏడురంగులు చూసి ఎన్నాళ్ళు అయినదో వర్ణాల్ని వంచేటి విల్లొకటి కావాలి పుడమిలో కణములకు గొంతెండిపోతోంది మేఘాన్ని చరిచేటి మెరుపొకటి కావాలి దుస్వప్నరాజ్యాన్ని తుడిచిపెట్టేయాలి ప్రియురాల్ని చూపేటి కలయొకటి కావాలి ఎండుటాకుల ధ్వనులు చెవికింపుగా లేవు శిశిరాన్ని తుంచేటి చివురొకటి కావాలి విరహమే రాహువై మదిని కబళిస్తోంది గ్రహణాన్ని మింగేటి వెలుగొకటి కావాలి పూలతో బాటలను నింపాలి "నెలరాజ" ముళ్లన్ని ఏరేటి చేయొకటి కావాలి

|| ఈ నాటికి - తెలుగు గజల్ ||


మరందాల మబ్బు ఒకటి కలగ దొరికె ఈనాటికి 
కనుపాపకు తీపికడలి తరగ దొరికె ఈనాటికి   

ప్రేమగీతి పాడేందుకు యుగాలుగా వెదికాను
పల్లవించు చరణాలే జతగ దొరికె ఈనాటికి
   
మనసుకున్న దాహమంత ఒక్కసారి తీరినది  
చెలిమిలోని మధురిమతో  చెలమ దొరికె ఈనాటికి 

సరసమైన గీతాలను ఒకటొకటే నేర్పుతోంది 
ఇష్టపదులనాలపించు లలన దొరికె ఈనాటికి 

పేరులోని తీయదనం ఇపుడిపుడే తెలుస్తోంది  
నను పిలిచే అందమైన చిలక దొరికె ఈనాటికి

వెన్నెలబాణాలేస్తూ వేధించాడిన్నాళ్ళూ 
నెలరాజుని ఓడించే నెలత దొరికె ఈ నాటికి