31/03/2014

జయ ఉగాది(అందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు )


|| జయ ఉగాది  ||

మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల 
మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే

వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే

ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ
వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే

ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని 
ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే

కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు 
పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే

తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ
విరికన్నెల ప్రసాదాలకై  ప్రదక్షిణలు చేస్తుంటే

చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ 
తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే

శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని
చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ

తరువులన్నిటినీ  పలకరిస్తూ...సుమగంధాలను ఆఘ్రాణిస్తూ
శిశిరాన్ని తరిమి కొడుతూ...విజయదుందుభి మ్రోగిస్తూ

జయకేతనం ఎగురవేస్తూ...విచ్చేసాడు ఋతురాజు
అపజయమెరుగని 'జయ'నామధేయుడు.                    ...@శ్రీ (చిత్రకారులు వాసు గారికి ధన్యవాదాలతో ...)

17/03/2014

|| హోలీ ||
మకరందపానం చేస్తూ...
మాధుర్యాన్ని అందించిన సీతాకోక చిలుకలకి 
సిగ్గులభారాన్ని లెక్కచేయక...
వాటి రెక్కలకి తమ వర్ణాలని అద్దుతూ ప్రతి సుమం
నిత్యం ఆడుతుంటుంది రంగుల హోలీ

ఉదయకిరణాలను
క్షణానికో రంగులోనికి మార్చేస్తూ
ప్రతివర్ణాన్నీ తూరుపు సంధ్యకు పులిమేస్తూ
అస్తాద్రి చేరుతూ వీడ్కోలు పేరుతో
సంధ్యాసుందరి బుగ్గలకి సిందూర వర్ణాలు పూసేస్తూ
ఆదిత్యుడు నిత్యం ఆడుతుంటాడు రంగుల హోలీ


ప్రతి తరువునీ తపనతో తాకేస్తూ
ప్రతి కొమ్మపై రంగుపూలు చల్లేస్తూ
పుడమి నిండా సందడి చేస్తూ
ఋతురాజు ఆడేది రంగుల హోలీ 


సంధ్యా సమయాలలో
మేఘమాలికలు కురిపించే చిరుజల్లులను
ప్రభాకరుని కిరణాల సాయంతో అల్లరి పెడుతూ
ఆ నీలాలగగనం ఆడేది సప్తవర్ణాల హోలీ.


క్రోధంలో కెంపురంగుని విసురుతూ
నవ్వులతో ముత్యపువర్ణంలో తడుపుతూ
ప్రేమలో సతతహరితాన్నందిస్తూ
నా మదిలో లెక్కలేనన్ని వర్ణాలు నింపుతూ
నీవాడేది రంగురంగుల హోలీ...వేల వసంతాల కేళి. ...@శ్రీ

21/02/2014

|| రాత్రికి స్వాగతం ||

రాత్రంతా చీకటిని చీలికలు చేస్తూనే ఉంటాయి 
కలలను వెదికే కనురెప్పల అంచులకత్తులు

కన్ను మూస్తే కనబడే దుస్వప్నాల కుత్తుకలను 
తెగనరుకుతుంటాయి సుస్స్వప్నాల కాల్పనికఖడ్గాలు

గాయాల చీకట్లు నల్లని రుధిరాన్ని స్రవిస్తూనే ఉంటుంది 
కొత్తవేట్లకి అప్రయత్నంగానే సంసిద్ధమౌతూ

తీయని స్వప్నసాక్షాత్కారం పొందని బాధతో
కళ్ళు కక్కే ఆమ్లాల దాడులకి చెక్కిళ్ళు కాలిపోతూనే ఉంటాయి.

మండుతున్న కలల పొగలు
సుడులు తిరుగుతూ ఊపిరాడకుండా చేస్తున్నాయి కళ్ళని.

నిశను చీల్చినా
రేయిని కాల్చినా
కలలని వ్రేల్చినా
కళ్ళు నిప్పులు చిమ్మినా
విషాదమే గెలుస్తుందని తెలిసినా...
మడమ తిప్పని యోధునిలా
కొత్త ఆశలు నింపుకుంటూ
రెట్టించిన సమరోత్సాహంతో
స్వాగతిస్తున్నాయి నాకన్నులు...మరో రాత్రిని సాదరంగా...

18/02/2014

"శ్రీ కవితలు" రెండవ పుట్టినరోజు


ఆదరిస్తున్న అందరికీ నమస్సుమాంజలి _/\_ 


                                 "శ్రీ కవితలు" రెండవ పుట్టినరోజు                                                              జరుపుకుంటోంది ఈరోజు ...@శ్రీ ...

06/02/2014

|| అస్తిత్వం ||


నీలో ఉన్నది నేనైతే 

నీతోడుంటానంటూ
నీతోడంటూ
నా తోడైనది నీవే 

ప్రతి నిమిషం నిన్ను
నీడలా వెంబడించేది నేనైతే,
నా నీడై నాకు తెలియకుండానే
నన్ను అనుక్షణం అనుసరించేది నీవే

నిన్ను ప్రేమిస్తున్నది నేనైతే
నా ప్రేమగా మారిపోయింది నీవే.
నీవు ప్రాణప్రదమన్నది నేనైనా
నాలో ప్రాణదీపమై అఖండ కాంతులు వెదజల్లేది నీవే.

నీ మదిలో చిత్రించుకున్నది
నా రూపమైనా
చిత్రంగా మదినే నీ చిత్రంగా మార్చేసుకున్నది
మాత్రం నీవే...నీ ప్రణయమే.

"నీవు సగం నేను సగం"
అనే అర్ధనారీశ్వర ఆరాధనం నీదైతే...
నీవే నేను... నేనే నీవు
ఒకరు లేకుంటే వేరొకరికి అస్తిత్వం లేదనే
రాధామాధవీయతత్వాన్ని నిత్యం స్మరించేది నేను...@శ్రీ 

|| పాదాల గుర్తుల కోసం ||
మరువలేకున్నాను 

నీమోముపై ముంగురుల సోయగానికి 
కెరటాలు సైతం చిన్నబోయిన విషయం

నీ పాదాలు కడిగి
ప్రతి కెరటం పావనమైన సంగతి.

నీ కాలి మువ్వలతో 
తరగలకి సవ్వడి నేర్పిన దృశ్యం

నీ వేళ్ళ సవరింపులకి 
ఫక్కుమన్న కెరటాల నురుగులని 

మనం విశ్రమించిన ఏకాంత తీరాలలో 
ప్రతి రేణువు పులకించిన మనోహర చిత్రాన్ని 

కలిసి నడిచిన సప్తపదుల మొత్తాన్ని 
సాగరుడు అలలతో నేర్పుగా దొంగిలించడం.

అందుకే
తీరమంతా జల్లెడ పడుతున్నా
మనం కలిసినప్పుడు జాలువారిన నీ నవ్వుపూలకోసం...
సంద్రంలో వల వేస్తూనే ఉన్నా
ఇసుకలో కలిసి నడిచిన మన పాదాల గుర్తుల కోసం...  ...@శ్రీ 

15/01/2014

|| సంబరాల సంక్రాంతి ||


అందరికీ శుభాకాంక్షలతో...@శ్రీ 

కళ్ళాపి జల్లిన వాకిట్లో 
తారలను తలపించే వెండి చుక్కలు 
హరివిల్లు కొత్త రంగులు పులుముకొని 
నేలకి దిగి వేళ్ళ సొగసులని తోడు చేసుకొని 
అందంగా రంగవల్లులుగా మారిన శోభలు
కన్నెపిల్లలు అలంకరించిన గొబ్బెమ్మలు
పచ్చని పంటలతో ముస్తాబైన పల్లెసీమలు

భానుని అగ్నిఖండికలను తలపించే భోగిమంటలు
పవిత్రగోమయంతో చేసిన
భోగిపిడకల దండలతో చిన్నారులు
భగవన్నామ సంకీర్తనలతో
ఇంటింటా పుణ్యాన్ని పంచే హరిదాసులు
సాంబశివుని నందీశ్వరుని కళ్ళముందు నిలిపే బసవన్నలు.

ప్రతి మోమున ఆనందాల కాంతులు
ప్రతి ఇంటా సంక్రాంతి వేడుకలు
అంబారాన్ని చుంబించే సంబరాలు....@శ్రీ 15/01/2014