21/09/2012

వారికెందుకు తెలియదంటావ్???




నీ కళ్లెప్పుడూ 
కలువరేకులతో
పోట్లాడుతూనే ఉంటాయి...

నీ చెవులెప్పుడూ 
శ్రీకారంతో
తగువులాడుతూనే  ఉంటాయి...

నీ గొంతు ఎప్పుడూ 
కోకిల పాటను
పరిహాసం చేస్తూనే ఉంటుంది...

నీ కనుబొమలెప్పుడూ
మదనుని  వింటిని 
వెక్కిరిస్తూనే ఉంటాయి...

నీ చూపులెప్పుడూ 
పూల బాణాలకు ధీటుగా 
బదులిస్తూనే ఉంటాయి...

నీ ఎర్రని పెదవులెప్పుడూ...
గులాబీ రేకులను
ఈసడిస్తూనే ఉంటాయి...

నీ మెడ ఎప్పుడూ
శంఖంతో 
పోరు పెట్టుకుంటూనే ఉంటుంది...

నీ  చేతులు 
తెల్లని తామరలని 
ఎదిరిస్తూ...
కాళ్ళని
కెందామరలతో కయ్యానికి 
కాలుదువ్వమంటూ  
ఉసిగొలుపుతూనే  ఉంటాయి...

అంతా 'నిన్ను' 'జగడాలమారి' 
అనుకుంటారు గానీ...
'సజాతి  ధ్రువాలు '
వికర్షించుకుంటాయని
వారికెందుకు తెలియదంటావ్???...@శ్రీ 

( చిత్రకారునికి కృతఙ్ఞతలు @శ్రీ )