13/06/2012

చావు....మిస్టరీ
ప్రతి ఆదివారం జరుగుతోంది 
అదే తంతు...
సరిగ్గా ఉదయం పదకొండయ్యేసరికి...


ఆ ఆసుపత్రి  I C U లో జరుగుతోందీ ఘటన...
ఆ  మంచం మీద పడుకున్న వారెవ్వరూ 
చావునుంచి తప్పించుకోలేక పోతున్నారు. 

ఇదేదో 'మానవాతీత శక్తి చేసే పని' అని
అందరు డాక్టర్లు అనుకున్నారు.
బైటనుంచి ప్రఖ్యాత వైద్యులని పిలిచారు...
వాళ్ళని బృందంగా చేసారు...

ఆదివారం వచ్చింది...
మంచానికి దూరంగా  చాటుగా నక్కి 
కూర్చున్నారంతా...

పరిశోధన మొదలైంది...
తొమ్మిదయింది...టెన్షన్ మొదలైంది...
పదయింది...పదిన్నర అయింది...
సరిగ్గా పదకొండు అవడానికి 
ఐదు నిముషాలు మాత్రమే ఉంది...
అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి..
ఇంకో ఐదు నిముషాల్లో 
మరో చావు చూడాలేమోనని భయపడుతున్నారు...

ఇంతలో వచ్చింది 'ఆదివారం పార్ట్ టైం స్వీపర్' 
రాములమ్మ...
నెమ్మదిగా ఆ మంచం దగ్గరికొచ్చింది...
చేతి సంచిలోని మొబైల్ తీసింది...
చార్జర్ తీసింది...
......
......
.....
ఆ బెడ్ కి ఉన్న life support system ప్లగ్ తీసింది...
అందులో చార్జర్ పెట్టి ...కూనిరాగం తీస్తూ 
చీపురందుకుంది........  :-)
తొలకరి జల్లునల్లని మబ్బులు నెమ్మది నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి..
వెలుతురును  మింగేసే చీకటిలా....

కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని బయలుదేరిన శచీంద్రుని 
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీ ,మృదంగ ధ్వనులతో.....

ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని  వెంట బడుతూ,
చుట్టుకుంటున్న  విద్యుల్లతల మెరుపులతో....
  
సాయం సంధ్యలో దేవ సేనాని   మయూరం
పురి విప్పినట్లుగా...
సప్త వర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...

ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం 
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి 
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటి వంతెన వేస్తున్నట్లు 
కురిసింది
తొలకరి జల్లు.

( నిన్న సాయంత్రం కురిసిన తొలిజల్లుని చూస్తూ అల్లిన కవిత.. @శ్రీ )