18/09/2014

శిశు వేదనగర్భంలో పడినప్పటినుంచీ పరీక్షలే.
తెలుస్తూనే ఉంది...
నేనెవరో తెలుసుకోవాలనే నాన్న ప్రయత్నం 
కనబడుతోంది...
డాక్టరమ్మకి నాన్నమ్మ ఇస్తున్న లంచం.

చలి పుట్టిస్తోంది... 
అమ్మ పొట్ట మీద పూసిన చల్లని జెల్
భయం పుట్టిస్తోంది...
నిశ్శబ్దంగా పరీక్షాయంత్రం చేసే చప్పుడు.
తల, మెదడు, కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నా, 
అసలు పరీక్షలోనే విఫలమయ్యానని స్పష్టమైంది.

అన్నీ కనబడుతున్నాయి స్పష్టంగా...
రక్షించుకోవాలనే అమ్మ ప్రయత్నం 
వధించాలనే నానమ్మ పన్నాగం
వాళ్ళమ్మ మాట జవదాటక 
అమ్మతనాన్ని చంపే నాన్న నిశ్చయం 
గుట్టుచప్పుడు కాకుండా
నన్ను మట్టుబెట్టేందుకు ఊపిరిపోసుకుంటున్న యుద్ధతంత్రం

ఓ దుర్ముహూర్తంలో 
వైద్యుని నాటుమందు అయింది...అమ్మకి విందు
ఉన్న కాస్త చోటులోనే
తప్పించుకోవాలని పరుగులు తీసాను
అలిసిపోయి...మృత్యువుకి దొరికిపోయాను

పైనుంచి చూస్తూనే ఉన్నా...
మరో ప్రాణికి ప్రాణం పోయాలనే
ప్రయత్నంలో మునిగిన  అమ్మానాన్నలను.
చూడాలి ఈసారైనా...
తమ్ముడు పుడతాడో?...
మరో చెల్లి ప్రాణం పోతుందో?                                          @శ్రీ

11/09/2014

|| కనులుతెరచి చూసాను - తెలుగు గజల్ || (200 వ పోస్ట్ )


             ( నా 200 వ పోస్ట్ ... ఆదరిస్తున్న అందరికీ వందనాలతో  )నీకోసమె ప్రతినిమిషం వేచిచూసి అలిసాను 
కలకోసమె ప్రతిరేయీ కలవరించి అలిసాను 

పగలురేయి నీధ్యానమె చేసుకుంటు గడిపాను 
కళ్ళలోన నీరూపమె నిలుపుకుంటు మురిసాను 

నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను 

చెరోచోట మనముంటు కలవలేక పోతున్నా    
ఊహలలో నిన్ను చూసి పూవులాగ విరిసాను

ప్రేమలన్ని గుడ్డివని అంటారుగ #నెలరాజా
ప్రేమలోన పడినాకే కనులు తెరచి చూసాను .......@శ్రీ 

|| తెలుగు గజల్ ...నువ్వు నవ్వావని ||

నిశియంతా వెలుగైతే తెలిసింది నువ్వు నవ్వావని 
వనమంతా విరులైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని 
కలతంతా  సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని

మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని 
ఎదలోనే  రవమైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని 

#నెలరాజా కనిపిస్తే  తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని   ... @శ్రీ 

|| నువ్వు నేను ||

నా తలపులలో నిలుస్తావు 
నీ జ్ఞాపకాలతో బాధిస్తావు
నిన్ను నేను తలపుగా భావిస్తున్నా,
జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా
చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా
వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు
మదిని ప్రేమగా పలకరించేవి నీవైనజ్ఞాపకాలు.
మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా
నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ
నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా
సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ...
మునుముందుకి సాగిపోతున్నా.

నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతోఅడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమే
ఎదసంద్రంలో అలవైతే ధమనుల్లో తేనెల పరుగులే ...
ఎదసవ్వడి నువ్వనే నిశ్శబ్దమై మిగిలున్నా
నా గమ్యం నువ్వనే ఏడడుగులు వేస్తున్నా.
సవ్వడి నేనైతే నీమువ్వల రవళితో జత కలుపు
గమ్యం దూరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు

07/09/2014

|| నమో బాపు ||


నాకలోకానికి కొత్తరంగులద్దుతోంది
అంచెలంచెలుగా ఎదిగిన 'బాపు' కుంచె 

అప్సరలంతా లైను కట్టేసారు 'బాపు' ముందు 
మా బొమ్మలు కూడా అందంగా  వేయమంటూ

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు 'బాపు'ని
దేవలోకానికి ఆస్థాన చిత్రకారునిగా 

సంపూర్ణ రామాయణాన్ని మళ్ళీ తీస్తున్నారు 'బాపు'
మేకప్పక్కర్లేని దేవతలే పాత్రధారులుగా.

భూలోకంలో దేవకుమారుల వేట మొదలైంది 
'బాపు' చూపిన చిత్రాల్లోని (బొ)కొమ్మల కోసం

'బాపు'కే  ఇచ్చాడు విశ్వకర్మ...
తాను నిర్మించే భవనాల గోడలపై చిత్రాలు గీసే కాంట్రాక్టు.

బ్రహ్మ కూడా శిష్యుడయ్యాడు 'బాపు'కి
అందరి నుదిటి రాతలు మరింత అందంగా వ్రాద్దామని 

పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు...దేవతలు 
బాపు కార్టూనుల ప్రదర్శనలు చూసి.

సరసన చోటిచ్చారు దేవతలు 'బాపు'కి 
తమని...తమకంటే బాగా చిత్రాల్లో చూపాడని.

ఒక్కదేవుడైనా ఇవ్వలేదు శతాయుష్షు...
అందరికీ తన రేఖాచిత్రాలలో ప్రాణం పోసిన 'బాపు'కి