29/02/2012

ముద్దు






అరచేతి మీద ముద్దు...అరవిందం.
నుదిటి మీద ముద్దు... నీలాంబరం.
మెడ  మీద  ముద్దు...ముత్యాలసరం.
కంటి మీద ముద్దు ...కనకాంబరం.
ముక్కుమీద ముద్దు... ముద్ద మందారం.

చెంప మీద ముద్దు...చెప్పదు  అడ్డు
పాదం మీద ముద్దు...పారాణి అద్దు.
చెవి మీద ముద్దు... చెరిపేసే  హద్దు.

తొలిముద్దు... తొలకరి జల్లు.
పాపిటి మీద ముద్దు... పన్నీటి జల్లు.
పెదవి మీద ముద్దు...పులకరింతల హరివిల్లు.
ప్రియమైన ముద్దు....పరవశాల  విరి జల్లు.

ప్రియురాలి ముద్దు... వెన్నెల్లో మల్లెల జల్లు ,
అంతరంగాలలో దాచుకునే...సరసాల విల్లు.




















గెలుపా? ఓటమా?


ప్రభాత సమీరం,మెత్తటి నా మునివేళ్ళు...
చెదిరిన నీ ముంగురులను సరి చేయాలని
పోటీ పడుతున్నాయి...

సూర్యుని తొలి కిరణం...
నా పెదవి అరుణం ...
నీ నుదిటిపై సిందూరపు ముద్దు
అద్దాలని పోటీ పడుతున్నాయి.

కోకిల కలరవాలు...నా తీపి మాటల గుసగుసలు...
నీ చెవిని చేరాలని 
పోటీ పడుతున్నాయి.

చల్లని పిల్లగాలి ..... వెచ్చని నా కౌగిలి...
నిన్ను చుట్టేయాలని
పోటీ పడుతున్నాయి...

ఎవరిని గెలిపిస్తావు?
నన్ను గెలిపించి, నువ్వు గెలుస్తావా?
నన్ను ఓడించి, నువ్వోడిపోతావా ???

నీ ఆత్మనై....


నీతో ఉండాలనుకున్నా.... పూలతో తావిలా... 
కానీ, వాడిన  పూలతో తావి కూడా పోతుంది.

నీతో ఉండాలనుకున్నా....చంద్రునితో వెన్నెలలా ...
కానీ, పగలు ఆ రెండిటిని దూరం చేసేస్తుంది.

నీతో ఉండాలనుకున్నా.... నీ వెంట నీడలా.... 
కానీ, చీకటి నీనుంచి నీ నీడను దూరం చేస్తుంది...

అందుకే.....నీలో నీ ఆత్మనై  ఉంటా...
ఎవరూ వేరుచేయలేని నీ  ఆత్మనై  ఉంటా......


28/02/2012

వెన్నెల కురిపించవా?




లోకమంతా చంద్రుని చల్లని వెన్నెలలో తడుస్తోంది..
ఎర్రకలువ రేకుల మెత్తదనంతో పోటీ పడే నీ పాదాలు 
వెన్నెల కాంతిలో మెరుస్తుంటే చూడాలని ఉంది.


'నీలో మచ్చ ఉంది'.
'నాలో మచ్చ లేదు' అని చంద్రుని ఎగతాళి చేసే
నీ ముఖ చంద్రబింబాన్ని చూడాలని ఉంది.

ఎగిరే నీ ముంగురులలో  వెన్నెల  ప్రతిఫలింప జేసి...
వింతశోభను నీ ముంగురులకు అందించిన
ఆ చంద్రబింబాన్ని చూడటం కంటే,
నీ మోములోని చంద్రుని  చూడటమే నాకు ఇష్టం  ప్రియా!....

కరుణించవా?
నా చీకటి  జీవితంలో వెన్నెల కురిపించవా?

27/02/2012

ప్రేమలేఖ





మువ్వల సవ్వడి




వెన్నెల 
పుచ్చపూవులా పరుచుకుంది....
నీ రాక కోసం ఎదురు చూసే
నా కన్నులకి అమృత వర్షంలా కనిపిస్తోంది....

నెలరాజు  నీకోసమే  
కాంతిబాటలు పరిచినట్లుంది,
నక్షత్రాల వీధి దీపాలను
నీకోసమే అమర్చినట్లుంది...
ఘల్లు ఘల్లుమని సవ్వడి చేసే
నీ కాలి అందెల మువ్వలు
తళతళలాడుతుంటాయి...
ఈ వెన్నెల్లో 
మిలమిల మెరుస్తుంటాయి.....

ఆ మువ్వల సవ్వడులు 
ప్రతినిత్యం నా ఇంట్లో వినపడనీ....
ఆ మువ్వల మెరుపులు 
అనుక్షణం  నా కంట్లో కనపడనీ....

నల్లని జలపాతం



ఈ లోకానికి తెల్లవారుతుంది సూర్యోదయంతో....
నాకు తెల్లవారుతుంది నీ ముఖ చంద్రోదయంతో....

ప్రత్యూష సమయంలో..
నీ నల్లని జలపాతం లాటి కురులు
చేసే అల్లరికి  నిద్ర లేవటం అలవాటుగా మారి పోయింది ప్రియా.....

అలిసి సొలిసి నిద్రించే నన్ను...
నీ నీలి కురుల జలపాతపు తుంపర్లు తాకి...
నా అలసటను దూరం చేస్తూ నిద్ర లేపుతాయి...

అలా ప్రతి రోజు నిద్ర లేపుతానని బాస చేస్తే
నీతో మళ్లీ అలిసిపోతాను ప్రియా...
నీలో మళ్లీ కలిసిపోతాను ప్రియా...

23/02/2012

నీవు లేని..

  
ఎక్కడున్నావు ప్రియతమా?
నాతోనే జీవితమన్నావు....
నా వెంటే ఉంటానన్నావు...
కనిపించని సుదూర తీరాలకు వెళ్ళిపోయావు....
నీవు లేని నా జీవితం తుఫానులో చిక్కుకున్న నావ....

మరుజన్మలో కూడా నీ తోడు కావాలని వరమడుగుతా.....
నాకోసం వేచి చూడు ప్రియతమా...
దేవుడు వరమిస్తే...
వలపై నీకోసం వచ్చేస్తా,
మబ్బై కమ్మేస్తా,
వానై, వరదై వచ్చి  నా ప్రేమలో  ముంచేస్తా...
తట్టుకోవాలి  సుమా...

హృదయ స్పందన



నీ పేరు మేఘమాలిక మీద వ్రాస్తే 
స్వాతి చినుకై కురిసి, మంచిముత్యమై మెరిసింది...
నీ పేరు గాలిలో వ్రాస్తే 
నా జీవన వేణువుకి శ్వాసయై పలికింది...


నీ పేరు నీలి సాగరం మీద  వ్రాస్తే 
ప్రేమతరంగమై వచ్చి నన్ను చల్లగా తాకింది...
నీ పేరు చంద్రునిమీద వ్రాస్తే
వెన్నెలై నా ఇంటి ముంగిట్లో కురిసింది...


నీ పేరు నీ అరచేతుల్లో  వ్రాస్తే 
నా వీపున ప్రేమ ముద్రలుగా మారాయి...
నీ పేరు నీ పెదవిపై వ్రాస్తే 
నా పెదవిపై నీ సంతకమై వెలిగింది...

నీ పేరు నీ మదిలో వ్రాస్తే 
అది నా హృదయ స్పందనగానే
మారి పోయింది ....




22/02/2012

నీ ప్రేమ



నీ మాటల్లో తీయదనానికి  నీ తీపి  పెదవులే కారణం....
నీ స్పర్శ లోని చల్లదనానికి  నీ అనురాగమే  కారణం....
నీ గుండెల్లో నా గుండెల చప్పుడు విన్పిస్తోందంటే,
అందుకు  నీ ప్రేమే కారణం....

పగలంతా నీ తలపులతో గడిపితే,
రాత్రంతా నీ కలలతో గడిపేస్తున్నా...

అమ్మో! యింత ప్రేమ తట్టుకోలేనంటావా???
ఏమి చెయ్యమంటావు ప్రియా....
నేను నా  ప్రేమను కొలుచుకోవటం  ఎప్పటికీ నేర్చుకోలేనేమో???

21/02/2012

ప్రాణం


సూర్యుడు లేని వెలుగు  నీవు....
చంద్రుడు లేని వెన్నెల  నీవు....
పూలు లేని తావి నీవు....
మేఘం లేని తొలకరి జల్లు నీవు...
కల లేని కల్పన నీవు...
ఇంతెందుకు ప్రియతమా....
నాలోని ప్రాణం నీవు....
నాలోని ప్రాణం నీవు.....

20/02/2012

ప్రేమ




ప్రేమంటే.....
చిమ్మ చీకటిలో కనిపించే కాంతికిరణం...
మిరుమిట్లు గొలిపే కాంతిలో కనిపించే ఛాయ...
మాటల్లో కనిపించే నిశ్శబ్దం....
నిశ్శబ్దంలో వినిపించే  సవ్వడి...
కంట కన్నీరొలికే సమయంలో చిరునవ్వు చిందింప చేస్తుంది...
నవ్వుతున్న కంట కన్నీరొలికిస్తుంది.... 

అందుకే ప్రేమంటే కొందరికి వరం ...
మరి కొందరికి శాపం.....   @శ్రీ

నీ అందం



నీ అందం అద్భుతం...
కోటి దీపశిఖల కాంతులున్నాయి నీలో...
ఆ అందాన్ని వీక్షించే భాగ్యం నాకు కలిగించావు ఈ జన్మలో...

నీవు స్నానమాడే సమయంలో సబ్బు బుడగలపై మెరిసే నక్షత్రాలను చూసి 
ఆశ్చర్యపోకు సుమా.....
అవి నా వేయి కనులు తప్ప మరేమీ కావు......
అవి నా వేయి కనులు తప్ప మరేమీ కావు......

అన్వేషణ



నేను నిన్ను ఎప్పుడు  పోగొట్టుకున్నానో  నాకే తెలియదు ...
నీకోసం మొదలైంది నా అన్వేషణ.

పూల పరిమళాలలో వెతికాను   నీకోసం...
పున్నమి నాటి వెన్నెల్లో వెతికాను.....
ఎగసి పడే సాగర తరంగాలలో వెతికాను...
గల గల పారే సెలయేటిలో వెతికాను
అందమైన జలపాతాలలో  వెతికాను ....

ఎంత మూర్ఖుడినో చూసావా?
అన్నింటి కంటే  అందమైన  నా మదిలో..
నిన్ను వెతుక్కోలేదు  చూడు.

19/02/2012

కానుక



 స్టూడెంట్ లైఫ్  దేవుడు ఇచ్చిన వరం
దాన్ని అనుభవించండి హాయిగా.....

అబ్బాయిలూ! అమ్మాయిలతో చాటింగ్ చేయండి
అమ్మాయిలూ! ఆడండి, పాడండి, ఆనందంగా ఉండండి.
కానీ, అన్నీ హద్దుల్లోనే సుమా!

ఒక్కసారి మీ మీద మీ కన్నవాళ్ళు పెట్టుకున్న ఆశలను గుర్తుకి 
తెచ్చుకోండి.
మీకు మొబైల్ కొని ఇవ్వాలంటే మీ నాన్న తనకి అవసరమైనదేదో
కొనుక్కోవడం మానేసారేమో?
మీకు మంచి డ్రెస్ కొనడానికి మీ తల్లి  పండుగ చీర
కొనుక్కోవడం మానేసిందేమో?

మీ ఆట పాటలతో బాటు మీ మీ  లక్ష్యాలను సాధించే దిశగా ,
ఆకాశమే హద్దుగా పరుగులు తీయండి...
ఆ లక్ష్యం సాధించాక విజయ గర్వంతో మీరు చేసే దరహాసమే
మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కోటి కాంతులు నింపుతాయి...

ఆ కాంతులే మీరు వారికిచ్చే నిజమైన కానుకలు.....

స్పర్శ

   
        ఓ వసంత సమీరమా!
        వసంత కుసుమ మకరందాల పరిమళంతో 
        మత్తెక్కిస్తూ...నన్ను తాకి 
        నా  ప్రేయసి ప్రేమ పూరితమైన స్పర్శను 
        గుర్తుకి తెస్తున్నావు.... 

మధురస్వప్నం



" కలవు కావా  నా కన్నుల్లో...
నిన్ను నా కన్నుల్లో దాచుకుంటా నిమిషమైనా.....
నిత్యం  నిన్ను నా స్వప్నమై రమ్మని పిలవాలనే ఉంటుంది...
ఆ స్వప్నం చూడాలంటే... 
ముందు నేను నీ తలపులనుండి బైటికి వచ్చి......
నిద్ర పోవాలి కదా!......"

కళ్ళు



కళ్ళు  ఎందుకు ఎర్రబడినాయి? 
అని అడిగావు నువ్వు....
నీ అందమైన నీలి కురులలో చిక్కుకున్న 
నా కళ్ళకి  నీ చేతి దువ్వెనతో  గాయమైందని
నీకెలా తెలుస్తుంది ప్రియతమా?.....

18/02/2012

విరహాగ్ని


                      
గోధూళి వేళ  సాయంసంధ్యని చూసావా నేస్తం!
చంద్రుని కోసం వేచి వేచి  విరహాగ్నిలో ఎరుపెక్కిన 
ప్రకృతి కన్యలా ఉంది కదూ!
చంద్రోదయంతో ఆ విరహం తీరునేమో  కాని
 నీ రాకకై వేచి చూసే నా విరహం తీరేదేప్పుడో? 

జీవితనౌక




ఈ చీకటిసంద్రంలో చీకటిని చీల్చుకుంటూ
వచ్చే వెన్నెల నౌక  ఆ చందమామ.
వెన్నెలలో స్నానమాడే అందమైన భామల్ని
నౌకా విహారానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఆ చందమామ. 
ఆతని పిలుపు  విని  వెళ్లి పోకు  నేస్తం!                                                                             నీవెళితే నా జీవిత నౌకాయానం ఆగిపోతుంది....