20/11/2016

|| విడువను ఎపుడూ - తెలుగు గజల్ ||నిను వలచేందుకు సుముహూర్తాలను వెదకను ఎపుడూ 
పెండ్లాడేందుకు పంచాంగాలను చూడను ఎపుడూ

నీ మదిలోనే వలపుల వేల్పుని చేస్తివి చెలియా
కపటపు ప్రేమను చూపే వారిని చేరను ఎపుడూ 

నీ సన్నిధిలో పగలూ రేయీ పున్నములేగా 
వెన్నెలనొంపే శరత్కాలమును తలవను ఎపుడూ

నీ నవ్వులలో నందనవనులే విరిసెను సఖియా 
గాలికి గంధము పూసే పూలను కోయను ఎపుడూ 

కాముడు మలచిన బంగరుశిల్పం నను వరియించెను
కలలోనైనా వేరే భామను కోరను ఎపుడూ

నీ ప్రేమంతా కొంచెంకొంచెం దోచుట తెలియును 
వలలను వేస్తూ పట్టాలంటే  దొరకను ఎపుడూ 

ప్రళయం రానీ యుగాలు పోనీ  ఓ "నెలరాజా" 
దేవుని ఎదుటన పట్టిన చేతిని విడువను ఎపుడూ